Begin typing your search above and press return to search.

కొడుకు కోసం... బొత్స భారీ త్యాగం...?

By:  Tupaki Desk   |   24 Feb 2022 4:30 PM GMT
కొడుకు కోసం... బొత్స  భారీ త్యాగం...?
X
వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణకు పుత్రోత్సాహం ఒక్కసారిగా ఎక్కువ అయిపోతోంది. ఈ మధ్యనే తన కొడుకు డాక్టర్ సందీప్ కి వివాహం హైదరాబాద్ లో వివిధ రంగాల ప్రముఖుల సమక్షాన అంగరంగ వైభవంగా చేశారు. ఇక మీదట ఆయనకు కేవలం డాక్టర్ గానే కాకుండా లీడర్ గా కూడా బొత్స‌ చూడాలనుకుంటున్నారుట.

ఇక ఏపీ రాజకీయాలలో బొత్సది మూడున్నర దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం. ఆయన తనకు తానుగా స్వయంగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. విజయనగరం జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్రా అంతటా తనకంటూ బలాన్ని బలగాన్ని పెద్ద ఎత్తున సంపాదించుకున్నారు.

తన కుటుంబంలో తాను, తన సతీమణి ఇద్దరూ కూడా రాజకీయంగా పలు కీలకమైన పదవులు చేపట్టి గొప్పగా రాణించారు. ఇక బంధుగణంలో చూసుకుంటే తమ్ముడు బొత్స అప్పలన‌రసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. బెల్లాన చంద్రశేఖర్ ఎంపీగా ఉన్నారు. నెల్లిమర్ల, ఎస్ కోట ఎమ్మెల్యేలు కూడా బొత్సకు దగ్గరివారే. విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవిని సొంత మేనల్లుడికి ఇప్పించుకున్నారు.

మొత్తానికి చూస్తే ఎటు చూసినా బొత్స హవా అంతా జిల్లాలో కనిపిస్తుంది. మరి అంతమందిని రాజకీయంగా చేరదీసి ఉన్నత పదవులు ఇప్పించిన బొత్స తన సొంత కుమారుడి రాజకీయ జీవితానికి పూల బాట వేయకుండా ఉంటారా. అందుకే బొత్స కుమారుడు సందీప్ ని రాజకీయాల్లోకి దించేందుకు ఆయన చూస్తున్నారు.

బొత్స సందీప్ ఇప్పటికే తండ్రి అడుగు జాడలలో నడుస్తున్నారు. సందీప్ పెద్ద ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలను ఇప్పటికే చేస్తున్నారు. డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ హెల్త్‌, విద్య‌, ఉపాధి కోసం ప్ర‌త్యేక సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ధీర పేరుతో ఓ సంస్థ‌ను నెల‌కొల్పి కొవిడ్ స‌మ‌యంలో జిల్లావ్యాప్తంగా సేవ‌లు అందించారు. బొత్స యువ‌సేన‌ను ఏర్పాటు చేసి వివిధ సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇలా అన్ని విధాలుగా సందీప్ రాజకీయ వాసనలను వంటబట్టించుకుంటున్నారు.

దాంతో వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి సందీప్ ని వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా దించాలని బొత్స ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. చీపురుపల్లి నుంచి బొత్స ఇప్పటికి మూడు దఫాలుగా గెలిచారు. ఆయనకు అక్కడ గట్టి పట్టుంది. వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకుని కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించడం ద్వారా వైసీపీ అధికారంలోకి వస్తే కీలకమైన పాత్రలో ఉంచాలని బొత్స స్కెచ్ వేస్తున్నారు.

మొత్తానికి చూస్తే బొత్స వారసుడి కోసం చేస్తున్న ప్రయత్నాలు శభాష్ అనేలా ఉన్నాయి. మరి బొత్స అభిమాన గణం కూడా జై సందీప్ అని అంటోంది. జగన్ సైతం యువ నేతలకే టికెట్లు అంటున్న నేపధ్యంలో పొలిటికల్ గా అన్నీ సందీప్ కి అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. చూడాలి జూనియర్ బొత్స విజయనగరం జిల్లాలో ఎలా సత్తా చాటుతారో. తండ్రికి తగిన నేతగా ఎలా ముందుకు దూసుకెళ్తారో.