Begin typing your search above and press return to search.

అందరూ హ్యాపీ...ఆయన తప్ప...?

By:  Tupaki Desk   |   12 April 2022 4:30 PM GMT
అందరూ హ్యాపీ...ఆయన తప్ప...?
X
అవును కొత్తగా వచ్చిన వారికీ, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వారికీ కూడా మంచి శాఖలు దక్కాయి. పెద్దాయనగా ఉన్న ఆయనకు మాత్రం హోదాకు, సీనియారిటీకి తగిన శాఖ లభించలేదు. ఇదీ లేటెస్ట్ గా ఉత్తరాంధ్రాలో వినిపిస్తున్న రాజకీయపరమైన మాట. ఇంతకీ దీని వెనక కధా కమామీషూ ఏంటి అంటే చాలానే ఉంది.

ఉత్తరాంధ్రాలోనే కాదు, ఉభయ గోదావరి జిల్లా రాజకీయాల్లో పలుకుబడి కలిగిన నేతగా బొత్స సత్యనారాయణకు పేరుంది. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన బొత్స చాలా మంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు. పీసీసీ చీఫ్ గా ఉమ్మడి ఏపీలో సత్తా చాటారు. ఒక దశలో చీఫ్ మినిస్టర్ రేసులో కూడా ఆయన పేరు వినిపించింది.

అలాంటి బొత్సకు వైసీపీ సర్కార్ లో ఉప ముఖ్యమంత్రి పదవి ఇప్పటిదాకా దక్కలేదు. ఇపుడు శాఖాపరంగా కూడా అనుకున్నది దక్కలేదన్న బాధ అనుచరులు వ్యక్తం చేస్తున్నారుట. బొత్సకి విద్యా శాఖను కేటాయించారు. సాధారణంగా రాజకీయాల్లో కొత్తగా నెగ్గి మంత్రులు అయిన వారికే ఆ శాఖ ఇస్తారు అంటారు.

బొత్స అయితే ఉమ్మడి ఏపీలో భారీ పరిశ్రమల శాఖతో మొదలుపెడితే మార్కెటింగ్, రవాణాతో పాటు చాలా కీలకమైన శాఖలను చూశారు. ఇక జగన్ సర్కార్ తొలి విడత మంత్రివర్గంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన మునిసిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. మూడేళ్ళుగా ఆ శాఖలో పట్టు సాధించారు.

తిరిగి అదే శాఖను కేటాయిస్తారు అని అంతా అనుకున్నారు. కానీ బొత్సకు విద్యా శాఖ ఇచ్చారు. అదే టైమ్ లో శ్రీకాకుళానికి చెందిన ధర్మాన ప్రసాదరావుకు రెవిన్యూ శాఖ ఇచ్చారు. అది చాలా ప్రధానమైన శాఖ. అలా ఆయన సీనీయరిటీకి తగిన గౌరవం దక్కింది. ఇక విశాఖలో చూస్తే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి లాంటి కీలకమైన శాఖ బూడి ముత్యాలనాయుడుకు దక్కింది. పైగా ఆయనకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు.

ఇక కొత్తగా నెగ్గిన గుడివాడ అమరనాధ్ కి పరిశ్రమలు, ఐటీ శాఖలను ఇచ్చారు. ఇక పీడిక రాజన్నదొరకు గిరిజన సంక్షేమ శాఖ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి హోదా ఆయనకూ లభించింది. మొత్తానికి చూస్తే ఉత్తరాంధ్రాకు మంచి శాఖలే ఈసారి దక్కాయి అని అంతా అనుకుంటున్నారు. అయితే బొత్సకు విద్యా శాఖ ఇవ్వడంతో ఆయన అనుచరులు అయితే మధన పడుతున్నారు.

క్యాబినేట్ లో మంత్రిగా చాన్స్ దక్కించుకున్నా శాఖ విషయంలో మాత్రం బొత్స వర్గంలో అసంతృప్తి ఉందని టాక్ నడుస్తోంది. అయితే జగన్ అందరికీ సమానంగానే శాఖలను ఇచ్చారని వైసీపీ లో అంటున్నారు. ఇన్నాళ్ళూ రాబడి శాఖలను చూసిన బొత్స ఈ వయసులో బడి శాఖను చూడాలా అన్న వారి ప్రశ్నలకు జవాబు ఎవరు చెబుతారో తెలియదు కానీ బొత్స వారు మాత్రం ఇపుడు నిత్య విద్యార్ధిగా మారాల్సిన అవసరం పడింది.

విజయన‌గరం జిల్లాలో డిగ్రీ దాకా చదివిన బొత్స ఇపుడు ఏపీలో విద్యా శాఖను నిర్దేశించి ముందుకు తీసుకెళ్ళే గురుతర బాధ్యతను అందుకున్నారు. ఆయనకు ఆ శాఖ ఇవ్వడం పట్ల క్యాడర్ లో ఒక రకమైన అసంతృప్తి ఉంటే మరో వైపు ప్రత్యర్ధి పార్టీలు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తూ ట్రోల్ చేయడంతో బొత్స వర్గం ఫైర్ అవుతోందిట.