Begin typing your search above and press return to search.

వైసీపీకి పెద్ద కాపు ఆయనేనట.. ?

By:  Tupaki Desk   |   7 Nov 2021 3:30 AM GMT
వైసీపీకి పెద్ద కాపు ఆయనేనట.. ?
X
వైసీపీలో సీనియర్ మోస్ట్ నేత బొత్స సత్యనారాయణ అని చెప్పాలి. ఆయన ఒంటి చేత్తో విజయనగరం జిల్లా రాజకీయాలను శాసిస్తారు. బొత్స పలుకుబడి, వ్యూహాలు అలాంటివి. ఆయన వైఎస్సార్ హయాంలో తొలిసారి మంత్రి అయ్యారు. ఆ తరువాత జగన్ క్యాబినేట్ లోనూ మంత్రిగా ఉన్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలలో బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స అంటే జగన్ బాగా ఇష్టపడతారు. ఆయన సైతం జగన్ ప్రేమాభిమానాలు చూరగొన్నారు. బొత్స ఏది అడిగినా కాదు అనే సీన్ అయితే వైసీపీలో లేదు. ఇవన్నీ పక్కన పెడితే బొత్స సేవలను మరో మారు గట్టిగానే వినియోగించుకోవాలని జగన్ చూస్తున్నారని టాక్. వచ్చే ఎన్నికలు వైసీపీకి పెను సవాల్ గా మారనున్నాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో కుల ప్రసక్తి ఎక్కువ.

అందునా సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన ఒక బలమైన సామాజికవర్గం ఓట్లకు గేలం వేస్తోంది. ఆ వర్గంలో కూడా ఇపుడు ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈసారి తమ ఓట్లు తమ కులస్థులకే వేసుకోవాలని, ఏపీ రాజకీయాలలో తాము కీలకం కావాలని ఆశిస్తున్నారు. ఇన్నాళ్ళూ పవన్ జనసేన చుట్టూ యువత బాగా తిరిగేవారు, మిడిల్ ఏజ్, పెద్ద వయసు వారు మాత్రం ఇతర పార్టీలలో ఉండేవారు. కానీ ఈసారి అంతా కలసి జనసేనను బలపరచాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామం వల్ల ఎక్కువగా నష్టపొయేదిఅధికార వైసీపీయే అంటున్నారు.

ప్రధానంగా ఆ ముప్పు ఉభయ గోదావరి జిల్లాలో ఉందని అంటున్నారు. దాంతో కాపులలో పెద్ద నాయకుడు. ఒక విధంగా ఐకాన్ లాంటి బొత్స సత్యనారాయణను వైసీపీ తరఫున కాపు కాసేందుకు బరిలో దింపాలని జగన్ బ్రహ్మాండమైన ఆలోచన చేస్తున్నారుట. బొత్సకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పార్టీని పైకి తీసుకువచ్చే కీలక బాధ్యతలను అప్పగించాలని చూస్తున్నారుట. ఈ రెండు జిల్లాలే రేపటి ఎన్నికల్లో కీలకం కాబట్టి బొత్సను పూర్తిగా కాపులను వైసీపీ వైపు ఉండేలా చేయడానికే ఉపయోగించుకోవాలని చూస్తున్నారుట.

ఈ రెండు జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నయి. అలాగే అయిదు ఎంపీ సీట్లు ఉన్నాయి. వీటిని గత ఎన్నికల్లో నూటికి డెబ్బై శాతానికి పైగా గెలుచుకున్న వైసీపీ ఈసారి కూడా అదే రేంజిలో విజయాన్ని ఆశిస్తోంది. దాంతో బొత్సను ముందు పెట్టి కధ నడుపుతారు అంటున్నారు. అంటే పార్టీలో ఇది కీలకమైన పరిణామమే. చూడాలి మరి వైసీపీకి పెద్ద కాపుగా బొత్స గోదావరి రూటుని వైసీపీ వైపు ఎలా తిప్పుతారో.