Begin typing your search above and press return to search.

'దొనకొండ..అదెక్కడుంది?' బొత్స వ్యంగ్యం!

By:  Tupaki Desk   |   9 Sep 2019 3:16 PM GMT
దొనకొండ..అదెక్కడుంది? బొత్స వ్యంగ్యం!
X
రాజధాని మార్పు ఊహాగానాలకు ముందుగా తెరలేపిందే మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధానిని మార్చే ప్రసక్తి లేదంటూ అది తమ మెనిఫెస్టోలో లేని అంశమంటూ స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే స్పష్టం చేశారు. ఎన్నికలకు, ఎన్నికలకు తర్వాత కూడా జగన్ అదే మాటే చెప్పారు. అయితే జగన్ దేశంలో లేని వేళ రాజధాని అంశం గురించి బొత్స చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తెలుగుదేశం పార్టీకి - జనసేనకు వ్యాఖ్యానానికి బొత్స మాటలే అవకాశం ఇచ్చాయి. అక్కడ నుంచి ఆ అంశంపై రచ్చ కొనసాగుతూ ఉంది.

మధ్య మధ్యల్లో బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక వ్యాఖ్య చేసి వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మరోసారి ఒకింత వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రాజధానిని దొనకొండకు మార్చనున్నారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నపై ఆ ప్రాంతాన్ని అవమానించేలా బొత్స వ్యాఖ్యానించారు. 'దొనకొండా.. అదెక్కడుంది..' అంటూ బొత్స వ్యాఖ్యానించారు.

ఇండస్ట్రియల్ హబ్ కాగల ప్రాంతంగా - రాజధాని అక్కడైతే బావుంటుందనే ప్రాంతంగా ఆ ప్రాంతానికి పేరుంది. శివరామకృష్ణన్ కమిటీలో కూడా ఆ అంశం గురించి పేర్కొన్నారు. రాజధానిగా అందరి ఆమోద యోగ్యమైన ప్రాంతంగా దొనకొండను ప్రస్తావించారు కూడా. అలాంటి ప్రాంతం గురించి బొత్స ఇలా మాట్లాడారు.

రాజధాని గురించి తనే రచ్చను రేపి - దానిపై తనే వ్యాఖ్యానాన్ని కొనసాగిస్తున్న బొత్స ఇప్పుడు ఇలా మాట్లాడారు. దొనకొండ అంటే తనకు ఎక్కడో తేలీదన్నట్టుగా ఏపీకి చెందిన ఒక మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇలా అవమానించే మాటలు ఎందుకు మాట్లాడుతున్నట్టో ఆయనకే తెలియాలి.

ఇక జనసేన అధిపతి పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు బినామీగా వ్యవహరిస్తూ ఉన్నారని బొత్స అన్నారు. అందుకే రాజధాని విషయంలో చంద్రబాబు తరఫున ఆయన వకాల్తా పుచ్చుకుంటున్నారని బొత్స వ్యాఖ్యానించారు.