Begin typing your search above and press return to search.

సీఎం చెప్పడు గనుక..మేమూ చెప్పక్కర్లేదు!

By:  Tupaki Desk   |   2 Oct 2015 11:30 AM GMT
సీఎం చెప్పడు గనుక..మేమూ చెప్పక్కర్లేదు!
X
సాధారణంగా ఎవ్వరైనా రాజకీయ నాయకులు రాష్ట్ర గవర్నరును కలిస్తే.. గనుక, బయటకు వచ్చిన వెంటనే.. తాము గవర్నరును కలిసి ఏం మాట్లాడినదీ.. రాష్ట్రంలో ఉన్న సమస్యలు లేదా పరిణామాల గురించి ఎంత కూలంకషంగా చర్చించినదీ తామే మీడియా వారికి తెలియజేస్తుంటారు. తద్వారా గవర్నరు దృష్టికి రాష్ట్ర వ్యవహారాలను తీసుకువెళుతున్న తమ అంకితభావాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని వారు ఆరాటపడతారు. అంతే తప్ప.. ఏదో ప్రెవేటు భేటీ లాగా.. గవర్నరు వద్దకు గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి వచ్చేయాలని ఎవరూ అనుకోరు. అయితే ఏపీలో విపక్షనేత వైఎస జగన్‌ మాత్రం.. ఇలాంటి రెగ్యులర్‌ రాజకీయ ఎత్తుగడలకు కాస్తంత భిన్నం. ఆయన గురువారం నాడు.. రాష్ట్ర గవర్నరు నరసింహన్‌ ను వెళ్లి కలిశారు. అయితే ఆ భేటీ గురించి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

పార్టీ తరఫున అధికారికంగా ఎవ్వరూ మాట్లాడలేదు గనుక.. గవర్నరుతో జగన్‌ భేటీ అనేది రహస్య భేటీ అనే ప్రచారం కూడా బాగా జరిగింది. ఒక రకంగాచెప్పాలంటే... గవర్నరుతో భేటీ గురించి జగన్‌ మీడియాతో మాట్లాడి ఉంటే ఎంత ప్రచారం వచ్చేదో అంతకంటె ఎక్కువ ప్రచారం.. ఆయన మౌనంగా ఉండడం వల్ల వచ్చింది.

అయితే పార్టీ నాయకులతో మీడియా మిత్రులు ప్రత్యేకంగా అడిగినప్పుడు మాత్రం.. రాష్ట్రంలో ఉన్న పలు రకాల సమస్యల గురించి మాత్రమే గవర్నరుతో చర్చించడానికి జగన్‌ వెళ్లారని అంటున్నారు. ప్రతిపక్షనేతగా ఆహక్కు ఆయనకు ఉందంటున్నారు. 7వతేదీన ప్రారంభం కాబోతున్న తన నిరాహారదీక్ష అంశంతో పాటు, రైతు ఆత్మహత్యలు, పొగాకు రైతుల సమస్యలు, ఇతర అంశాలను గవర్నర్‌కు చెప్పారని అంటున్నారు. ప్రజాసమస్యలే భేటీ ఎజెండా అయితే.. జగన్‌ ఆ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించవచ్చు కదా.. పార్టీ తరఫున అధికారిక ప్రకటన విడుదల చేయవచ్చు కదా అని పలువురి సందేహం.

అయితే పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ మాత్రం.. ఈ భేటీని సందేహిస్తున్న వారిని ఓ రేంజిలో నిలదీస్తున్నారు. ఇది రహస్య భేటీ ఎందుకవుతుంది? గవర్నర్‌ ను ఆయన రాజ్‌ భవన్‌ లోనే కలిశారు కదా. అంతమాత్రాన... మాట్లాడిన విషయాలను మీడియాకు చెప్పాలనే నిబంధన లేదుకదా.. అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నరును కలుస్తుంటారు. ఎందుకు కలిశాడనేది ప్రతిసారీ ఆయన మీడియాకు వెల్లడిస్తుంటారా? అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. సీఎం చెప్పడు గనుక.. తాము కూడా చెప్పం.. గవర్నరుతో ఏం మాట్లాడామో రహస్యంగానే ఉంచుకుంటాం అని బొత్స భాష్యం చెబుతున్నట్లుగా ఉంది.