Begin typing your search above and press return to search.

ఏకులా వచ్చి మేకులా మారిన బొత్స

By:  Tupaki Desk   |   27 Sep 2015 11:30 AM GMT
ఏకులా వచ్చి మేకులా మారిన బొత్స
X
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగ ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఆ పార్టీపై చాలామందికి సరైన హోప్స్ లేవు. మొదట్లో భారీ అంచనాలున్నప్పటికీ జగన్ నిలకడలేమి... ఆయన వ్యతిరేక వర్గం రోజురోజుకీ బలపడడంతో జగన్ - వైసీపీ రెండూ కొన్నాళ్లకు నామమాత్రమైపోతాయన్న భావన చాలామందిలో ఉంది. ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్లోనూ చాలామంది తాత్కాలికంగా ఏదో ఒక పార్టీలో ఉండాలి కాబట్టి ఉంటున్నాం అన్నట్లుగా ఉంటున్నారు. టీడీపీలోకి వెళ్లడానికి ఏమాత్రం ఛాన్సు లేనివారు - కాంగ్రెస్ కనీసం మరో దశాబ్దం వరకు లేచి నిలబడలేదన్న వాస్తవం అర్థం చేసుకున్నవారు వైసీపీలో కొనసాగుతున్నారు. అయితే... ఉన్నంతకాలం అక్కడ హవా చూపించగలిగితే అందులోనే కొనసాగొచ్చన్న ఆలోచన చాలామందికి ఉంది.. కానీ, జగన్ ఆ ఛాన్సివ్వకుండా అంతా తానే అయి వ్యవహరించడం... రెండో ప్రాధాన్యం ఇచ్చినా అది ఇతర నాయకులకు కాకుండా తన ఆడిటర్ విజయసాయిరెడ్డి - వైవీ సుబ్బారెడ్డి వంటివారికే దక్కడం తెలిసిందే. ఈ కారణంగానే అక్కడ భవిష్యత్ లేదని తెలిసిన కొందరు నాయకులు ఇప్పటికే బయటకొచ్చేశారు. ఈ క్రమంలో జ్యోతుల నెహ్రూ వంటివారు కొంత రైజింగ్ లోకి వచ్చి వైసీపీలో నంబర్ 2 అని ప్రకటించుకున్నారు కూడా. అయితే... ఆ పార్టీ నేతలు, ప్రజలు కూడా ఆ గొప్పలను నమ్మలేదు. కానీ... తాజాగా మాత్రం వైసీపీలో నంబర్ 2 పొజిషన్ ను ఓ నేత దక్కించుకున్నాడు. ఆ సంగతి వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. అది ఇంకెవరో కాదు... మాజీ మంత్రి - మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ.

ఇటీవలే పార్టీలో చేరిన బొత్స సత్యనారాయణకు జగన్ మంచి ప్రాధాన్యం ఇస్తున్నారట. ఇప్పుడు వైసీపీలో
రాజకీయమంతా బొత్స చుట్టూనే తిరుగుతోంది. వైసీపీలో ఇంతకుముందు కూడా సీనియర్ నేతలు ఉన్నా వారిలో చాలామంది ఫేడవుట్ అయినవారు - సరిగా మాట్లాడలేనివారు - పెద్దగా ఛరిష్మా లేనివారు... దూకుడు లేనివారు మాత్రమే. కానీ, బొత్స అందుకు భిన్నం. ఆయన మాట్లాడితే మామూలుగా ఉండదు... ఎలాంటి సిట్యుయేషన్లనయినా డీల్ చేస్తారు. రాజకీయ ఎత్తుగడలు కూడా బాగుంటాయి. గతంలోనూ ఎన్నోసందర్భాల్లో అది రుజువైంది కూడా. అంతేకాదు... ఆయన మాట్లాడితే మీడియాలో ప్రముఖంగా వస్తుంది. ఈ కారణాలన్నిటితో జగన్ ఆయనకు మంచి ప్రాధాన్యిమిస్తున్నారని తెలుస్తోంది. అంబటి రాంబాబు వంటి నేతలు గంటలు గంటలు మాట్లాడినా సింగిల్ కాలమ్ కూడా వేయని పేపర్లు బొత్స సింగిల్ లైన్ మాట్లాడినా మంచి ప్రాధాన్యమిస్తాయి. అది బొత్సకున్న ఇమేజి వల్ల కావొచ్చు... లేదంటే బొత్స నోటికి భయపడి కావొచ్చు... కారణమేదైనా కానీ దానివల్ల వైసీపీ వాయిస్ వినిపిస్తోంది.

అంతేకాదు... బొత్సకు చొరవ - సమయస్ఫూర్తి - ఎత్తుకు పైఎత్తులు వేయడం.. ప్లానింగ్ అన్నీ తెలుసు. దాంతో ఇంతకాలం పార్టీలో తాను తప్ప ఎవరూ సరైనవారు లేరన్న భావనలో ఉన్న జగన్ కు బొత్స కుడి భుజం అయిపోయారు. ధర్మాన ప్రసాదరావు కూడా తెలివైన నాయకుడే అయినా, వారిపై ఇష్టంతో జగన్ ఆయన్ను పార్టీలోకి తీసుకోలేదు.. ఆ తరువాత కూడా ధర్మాన జగన్ ను ఆకట్టుకోలేకపోయారు. కానీ, బొత్స అందుకు భిన్నంగా పార్టీలోకి వచ్చిన కొద్ది వారాల్లోనే మొత్తం కమ్మేశారు. ఏపీ - తెలంగాణల్లోనూ బొత్సకు అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలున్నాయి. సామాజిక వర్గం పరంగానూ బొత్సకు రాష్ట్రవ్వాప్త ఆదరణ ఉంది. మాటలతో మేజిక్ చేసే బొత్స భవిష్యత్తులో చాలామంది నాయకులను వైసీపీలోకి తేగలరని జగన్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు.

... అంతేకాదు, ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు, టీడీపీ - ఏపీ ప్రభుత్వాలను ఏకిపారేయడంలో బొత్స దూసుకెళ్తున్నారు. వైసీపీ కార్యక్రమాలను ప్లాన్ చేయడం కూడా ఆయననేట. మామూలుగా అయితే ప్రెస్ మీట్ పెట్టాలంటే జగన్ అనుమతి ఉండాలి... ఏం మాట్లాడాలో జగనే చెప్పాలి... కానీ, బొత్స.. ముందే స్పందించి ఈ విషయంపై ప్రెస్ మీట్ పెడదాం, ఇలాఇలా మాట్లాడుదాం.. మీరేమంటారో చెప్పండంటూ సూచనలు అడుగుతూ జగన్ తో ఓకే చేయించుకుంటున్నారట. మిగతా నేతలెవరూ జగన్ వద్దకు వెళ్లే సాహసం చేయలేకపోతుండగా బొత్స ఇంతలా కమ్మేయడంతో వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బొత్స స్వయంగా చొరవ చూపి మంచి సలహాలు ఇస్తుండడంతో జగన్ కూడా ఈయన మనకు బాగా ఉపయోగపడతారని గుర్తించారు. కొద్దివారాల కిందట జగన్ స్వయంగా బొత్సతో పార్టీ బాధ్యతలు దగ్గరుండి చూసుకోమని చెప్పినట్లు సమాచారం.

...ఇప్పటికే పెద్దనాయకుడిగా పేరున్న బొత్స స్వతాహాగా తెలివికలవాడు. జగన్ అవకాశం ఇచ్చారని ఎక్కువ చేయకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అధినేత ప్రాధాన్యం ఇస్తున్నారుకదా అని పార్టీపై పెత్తనం చేయకుండా కేవలం పార్టీ కార్యక్రమాల ప్లానింగు, ప్రభుత్వంపై దాడి వ్యూహాలు వంటివాటితో ఆయన జగన్ కుడిభుజమైపోయారు. జగన్ కూడా బొత్స వల్ల తనకు కొంత భారం తగ్గిందన్న ఫీలింగులో ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సొంత భవిష్యత్తు కోసం బొత్స ఏం చేస్తారో ఏమో కానీ, ప్రస్తుతానికి మాత్రం వైసీపీకి మార్గదర్శంన చేస్తున్నారు. అయితే, తాము ఎంతో కాలంగా ఉన్నా దక్కడి ప్రయారిటీ బొత్సకు కొద్ది రోజుల్లో దొరికందని.. ఏకులా వచ్చి మేకులా మారిపోయాడని కొందరు వైసీపీ నేతలు గుర్రుమంటున్నారు.