Begin typing your search above and press return to search.

బొకేలు.. ఫోటోలు.. మ‌రి నిధుల మాటేమిటీ?

By:  Tupaki Desk   |   12 March 2022 12:30 PM GMT
బొకేలు.. ఫోటోలు.. మ‌రి నిధుల మాటేమిటీ?
X
ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిందే. రోజువారీ పాల‌న స‌వ్యంగా సాగాల‌న్నా అప్పులు చేయాల్సిన దుస్థితి ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజా బ‌డ్జెట్‌ను మాత్రం వైసీపీ గొప్ప‌గా ప్ర‌వేశ‌పెట్టి అంకెల గార‌డీ చేసింద‌నే విమ‌ర్శ‌లు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే మ‌రోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఆర్థిక ప‌రిస్థితి కార‌ణంగా ప్ర‌జ‌ల చేతిలో చివాట్లు తినాల్సి వ‌స్తుంద‌ని టాక్‌. నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ఏం చేయ‌డం లేద‌ని.. ఏదో పేరుకే ఎమ్మెల్యేల‌ని జ‌నం వాళ్ల‌పై మండిప‌డుతున్నారు.

ఓ నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యే అంటే అక్క‌డి అభివృద్ది ప‌నులు చూసుకోవాలి. ప్ర‌భుత్వం నుంచి నిధులు తెచ్చి ప‌నులు చేయించాలి. ఇక అధికారంలో త‌మ పార్టీ ప్ర‌భుత్వ‌మే ఉంటే స‌మ‌స్యే ఉండ‌దు. ఒక‌వేళ ఏదైనా ఇబ్బంది ఉంటే సీఎంతో అపాయింట్‌మెంట్ తీసుకుని నియోజ‌క‌వ‌ర్గ ప‌రిస్థితి వివ‌రించి నిధులు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేయాలి. కానీ ప్ర‌స్తుత వైసీపీ ఎమ్మెల్యేల తీరు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంద‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిసి బొకేలు ఇవ్వ‌డం ఫోటోలు దిగ‌డం త‌ప్ప ఎమ్మెల్యేల‌తో పైసా ప్రయోజ‌నం కూడా లేద‌ని వాపోతున్నారు. జ‌గ‌న్‌తో దిగిన ఫోటోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేసుకుని ఫోజులు కొట్ట‌డం త‌ప్ప ప‌నులు మాత్రం చేయ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

నియోజ‌క‌వ‌ర్గాల‌కు నిధుల విష‌యంలో ఎవ‌రు కూడా సీఎంతో మాట్లాడే సాహ‌సం చేయ‌లేక‌పోతున్నార‌ని స‌మాచారం. అందుకే నిధులు తేవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్న ఎమ్మెల్యేలు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏం అభివృద్ధి చేస్తున్నారంటూ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. నిధుల లేమి స‌మ‌స్య ఉంద‌ని ఇప్ప‌టికే కొంత‌మంది వైసీపీ నేత‌లు బ‌హిరంగంగానే జ‌గ‌న్‌పై అసంతృప్తి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ప‌నులు చేద్దామంటే నిధులు ఎక్క‌డున్నాయంటూ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని సూచించేలా మాట్లాడారు. అధికారంలో ఉన్న త‌మ పార్టీ సీఎంనే నిధులు అడిగే ధైర్యం చేయ‌ని ఈ ఎమ్మెల్యేలు ఉండి లాభం ఏమిట‌ని? జ‌నాలు మండిప‌డుతున్నారు.