Begin typing your search above and press return to search.

బౌలర్లు బల..బ్యాట్స్ మన్ భళ..ఒక్క ఓవర్ లోనే పరుగుల వరద

By:  Tupaki Desk   |   7 April 2022 9:48 AM GMT
బౌలర్లు బల..బ్యాట్స్ మన్ భళ..ఒక్క ఓవర్ లోనే పరుగుల వరద
X
బుధవారం నాటి ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్ప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమ్మిన్స్ బ్యాట్ తో విధ్వంసం రేపిన సంగతి తెలిసిందే. ఇందులో 16 వ ఓవర్లో ఏకంగా 35 పరుగులు రాబట్టి కమ్మిన్స్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒకే ఓవర్లో 30 పరుగులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలు మ్యాచ్ ల్లో ఇలాంటి మెరుపు ఓవర్లు కనిపించాయి. అత్యధికంగా రెండుసార్లు ఓవర్ కు 37 పరుగులు చొప్పున వచ్చాయి. ఇందులో రెండుసార్లు భారత బౌలర్లే బాధితులు. మరోసారి భారత సంతతి బౌలర్ బలయ్యాడు. చిత్రమేమంటే.. అత్యధికంగా 37 పరుగులిచ్చన ఓ బౌలర్.. ఇప్పుడు టీమిండియా సభ్యడు. ఈ చరిత్ర ఓ సారి చూస్తే..

37 రెండుస్లారు లీగ్ లో ఇప్పటివరకు ఒక్క ఓవర్లో బౌలర్ సమర్పించుకున్న అత్యధిక పరుగులు 37. ఇలా రెండుసార్లు జరిగింది. 2011లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కొచీ టస్కర్స్ బౌలర్‌ ప్రశాంత్‌ పరమేశ్వరన్‌ వేసిన ఓవర్‌లో విండీస్ విధ్వంసకారుడు క్రిస్‌గేల్‌ (44; 16 బంతుల్లో 3x4, 5x6) వీర విధ్వంసం సృష్టించాడు. 6, 6 నో బాల్‌, 4, 4, 6, 6, 4 బాదాడు. ఈ మ్యాచ్‌లో తొలుత కొచీ 125/9కే పరిమితమైంది.

బెంగళూరు 13.1 ఓవర్లలో గేల్‌ వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 2011 తర్వాత మళ్లీ పదేళ్లకు అలాంటి రికార్డే నమోదైంది. గతేడాది చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ ఒకే ఓవర్‌లో 37 పరుగులిచ్చాడు. చివరి ఓవర్‌లో జడేజా 6, 6, 6 నోబాల్‌, 6, 2, 6, 4 కొట్టాడు. మ్యాచ్ లో జడేజా (62 నాటౌట్‌; 28 బంతుల్లో 4x4,5x6) చెలరేగాడు. 192 పరుగుల లక్ష్య ఛేదనలో బెంగళూరు 122/9 కే పరిమితమైంది.

కాగా, హర్షల్‌ పటేల్‌ ఇదే ఏడాది టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్ర చేయడం గమనార్హం. ప్రస్తుత 15వ సీజన్‌లో బుధవారం ముంబయి బౌలర్‌ డానియల్‌ సామ్స్‌ ఒకే ఓవర్‌లో 35 పరుగులు సమర్పించుకున్నాడు. సామ్స్‌ వేసిన 16వ ఓవర్‌లో 6, 4, 6, 6, 2 నోబాల్, 4, 6 విరుచుకుపడ్డాడు. స్వతహాగా పేస్ బౌలరైన కమ్మిన్స్ ఈ స్థాయిలో విధ్వంసం రేపగలగడని ఎవరూ ఊహించలేదు. కాగా, 2010లో పంజాబ్‌ కింగ్స్ బౌలర్‌ రవి బోపారా ఒకే ఓవర్‌లో 33 పరుగులు ఇచ్చుకున్నాడు. కోల్‌కతాతో జరిగిన ఆ మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌ (88; 42 బంతుల్లో 6x4, 8x6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.బోపారా వేసిన 13వ ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సులు బాదాడు.

ఇక తొలి బంతికి, చివరి బంతికి మనోజ్‌ తివారి (35; 32 బంతుల్లో 2x4) రెండు సింగిల్స్‌ తీశాడు. అయితే, చివరి బంతి రెండు సార్లు వైడ్‌గా నమోదై మొత్తం ఏడు అదనపు పరుగులొచ్చాయి. దీంతో ఈ ఒక్క ఓవర్‌లో కోల్‌కతాకు 33 పరుగులు రావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 200/3 భారీ స్కోర్‌ సాధించగా పంజాబ్‌ 18.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ మహేలా జయవర్దెనె (110 నాటౌట్‌; 59 బంతుల్లో 14x4, 3x6) శతకంతో మెరిశాడు. 2014లో పంజాబ్‌ తరఫున ఆడిన పర్విందర్‌ అవానా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. సెహ్వాగ్‌ (122; 58 బంతుల్లో 12x4, 8x6) శతకంతో చెలరేగాడు. సురేశ్‌ రైనా (87; 25 బంతుల్లో 12x4, 6x6) మెరిసినా చెన్నై 202/7 స్కోరుకే పరిమితమైంది. పర్విందర్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో రైనా 6, 6, 4, 4, 5నోబాల్‌, 4, 4తో మోత మోగించాడు.