Begin typing your search above and press return to search.

చంద్రబాబు జమానాలో అది కూడా రహస్యమే?

By:  Tupaki Desk   |   5 Oct 2017 5:16 AM GMT
చంద్రబాబు జమానాలో అది కూడా రహస్యమే?
X
అవేమీ రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన విధాన పత్రాలు కాదు. రక్షణ శాఖకు సంబంధించిన వ్యూహాలు - డాక్యుమెంట్లు కానే కావు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం వాటి విషయంలో అంతకంటె ఎక్కువ రహస్యమే పాటిస్తున్నారు. కేవలం ఒక గోపురానికి సంబంధించి.. నిర్మాణానికి రూపొందించిన డిజైన్లను రహస్యంగా ఉంచాలని, వాటిని మీడియాకు తెలియనివ్వవద్దని... అంతా ఫైనలైజ్ అయ్యాకే డిజైన్లను బయటపెడదాం అని చంద్రబాబునాయుడు అధికార్లను స్వయంగా ఆదేశిస్తున్నారంటే.. అసలు అందులో ఏదో మతలబు ఉన్నదనే ప్రజలు భావిస్తున్నారు. ఏకంగా కోర్ కేపిటల్ కు సంబంధించి లండన్ సంస్థ రూపొందించిన డిజైన్ల పరిశీలన నుంచి ప్రతి పర్వాన్ని ఓపెన్ గా లైవ్ కెమెరాల ఎదుట నిర్వహించిన ముఖ్యమంత్రి, వాటి మీద అసంతృప్తి వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. అలాంటిది.. నది మీద ఒక గోపురం మాత్రం నిర్మించడానికి సంబంధించి.. ఇంత అతి జాగ్రత్త ఎందుకు తీసుకుంటున్నారో.. ఎందుకు డిజైన్లను రహస్యంగా ఉంచాలని అనుకుంటున్నారో మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ వ్యవహారం అంతా చూస్తే.. బోయపాటి శ్రీనుకు ఏదో లబ్ది చేకూర్చడానికి కీర్తి కట్టబెట్టడానికి చేస్తున్నారా అనే అనుమానం కూడా ప్రజలకు కలుగుతోంది. అదే సమయంలో.. అసలు ఇంకా డిజైన్లు తయారయ్యాయో లేదో అని.. ప్రస్తుతానికి ఆలోచన మాత్రమే వచ్చినా.. డిజైన్లు అయినట్లుగా సీక్రెట్ గా ఉంచుతున్నట్లుగా మభ్యపెట్టి వచ్చేవారం లోగా వాటిని తయారుచేయించి బయటపెడతారేమో అని కూడా కొందరు అనుకుంటున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. నిర్దిష్టంగా లెక్కవేస్తే ఇప్పటిదాకా జరిగిన పని ఒక్కటే ఒక్కటి. గోదావరి నీళ్లను కాలువ ద్వారా తీసుకువచ్చి కృష్ణలో కలపడం మాత్రమే. అదికూడా వైఎస్ రాజశేఖరరెడ్డి జమానాలోనే తవ్వకాలు - రివిట్మెంట్ కూడా పూర్తయిపోయిన కాలువలనే వాడుకుంటూ.. కేవలం ఎత్తిపోతలను మాత్రం ఏర్పాటుచేసి.. ఘనత మొత్తం తమదే అన్నట్లుగా చంద్రబాబు టముకు వేసుకుంటూ ఉంటారు. అలాంటి పథకానికి మరింత ప్రచారం కల్పించుకోవడానికి ఓ తాజా ఎత్తుగడ వేశారు. గోదావరి నీళ్లు వచ్చి ఇబ్రహీం పట్నం వద్ద కృష్ణ లో కలిసే సంగమ స్థలంలో ఓ ఐకానిక్ నిర్మాణం ఉండాలని చంద్రబాబు అనుకున్నారు. ఆయన అనుకున్నారో లేదా సినీ దర్శకుడు బోయపాటి శ్రీను అనుకున్నారో గానీ.. మొత్తానికి బోయపాటి ఓ అతి పెద్ద గోపురం నిర్మాణానికి డిజైన్లను కూడా త్రీడీ లో రూపొందించి తీసుకువెళ్లి చంద్రబాబుకు చూపించారు. అవి ఆయనకు నచ్చాయిట. దశావతారాలను ప్రతిబింబించేలా.. గోపురం కిందనుంచి ప్రవాహం వెళ్లేలా గోపురం డిజైన్ చేశారట.

అయితే చంద్రబాబు ఈ డిజైన్లను లీక్ చేయవద్దు ఇవి సీక్రెట్ అని అధికార్లను ఆదేశించారట. గోపురం నిర్మాణానికి ఆగమ పండితులతో కూడా చర్చించి మంచీ చెడు నిర్ణయించాలని ఆయన ఆదేశించడం వరకు బాగానే ఉంది. మరి బోయపాటి శ్రీను చేసిన డిజైన్లను కనీసం ప్రజలకు చూపించకుండా సీక్రెట్ గా ఉంచడం ఏమిటో, అన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత మాత్రమే బయటపెట్టాలని పురమాయించడం ఏమిటో అంతా అనుమానాస్పదంగా ఉన్నదని పలువురు అంటున్నారు.