Begin typing your search above and press return to search.

బాలీవుడ్ పై రాందేవ్ సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   20 Oct 2016 10:28 AM GMT
బాలీవుడ్ పై రాందేవ్ సంచలన వ్యాఖ్యలు!
X
పేరుకు యోగా గురువు అయినా... యోగాతో పాటు సామాజిక - రాజకీయ - క్రీడా - వ్యాపార రంగాలలో దేని గురించైనా మాట్లాడగలిగే తెలివితేటలున్న వ్యక్తి బాబా రాందేవ్. చైనా వస్తువులను బహిస్కరించాలని, తద్వారా ఆ దేశంపై ఆర్ధిక ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చిన ఆయన... తాజాగా ఒక ప్రముఖ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో బాలీవుడ్ పైనా - పాకిస్థాన్ లో తన వ్యాపారంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్ లో పతంజలి నిర్వహణపై... పాక్ లో సంపాదించిన డబ్బును భారత్ కు తీసుకురావాలని ఆశలేదని, అక్కడ ఆర్జించిన సొమ్మును పాక్ ప్రజల సంక్షేమానికి ఖర్చుపెడుతున్నానని తాను చేసే పనికి చక్కగా సమర్ధించుకున్న బాబా రాందేవ్... చైనా వస్తువులను కొనకపోవడం వల్ల చైనాకు ఆర్ధిక ఇబ్బందులు వచ్చి, తద్వారా పాక్ కు సహాయం చేయకుండా ఉంటుందని, అందుకోసం అంతా చైనా వస్తువులను బహిష్కరించాలని సెలవిచ్చారు. మరి పాక్ లో పతంజలి ద్వారా వచ్చే డబ్బుతో అక్కడ టాక్సులు కట్టరా? తద్వారా పాక్ కు ఆదాయం లభించదా? నిత్యం మన చెడుకోరే వారి సంక్షేమం కోసమని చెప్పుకుంటూ పాక్ లో వ్యాపారాలు చేయడం అవసరమా? అనే ప్రశ్నలు ప్రస్తుతం అప్రస్తుతం!!

అలాగే, భారత్ లో పాక్ నటీనటులు నటించిన సినిమాలపై నిషేధం కొనసాగుతుండటం, కరణ్ జోహార్ లాంటి వ్యక్తులు ఈ విషయంపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ తో సైతం చర్చలు జరుపుతోన్న క్రమంలో ఈ విషయాలపైనా రాందేవ్ స్పందించారు. "కళాకారులు తీవ్ర వాదులు కాదు కానీ హిందీ సినిమాల్లో నటిస్తోన్న వారికి మాత్రం మనస్సాక్షి అనేదే లేదు.. వాళ్ల ఆరాటమంతా ఎంతసేపు సినిమాలు, డబ్బులు, బిర్యానీ తినడం గురించే ఉంటుంది. యూరీ ఉగ్రదాడిలో భారతీయులు చనిపోతే వారంతా ఎందుకు ఖండించలేదు" అని మీడియా ముఖంగా ప్రశ్నించారు.

ఇదే సమయంలో ఎన్టీయే పాలనపైకూడా తన అభిప్రాయాన్ని చెప్పిన రాందేవ్ బాబా... యోగికి సంతోషం దు:ఖం రెండూ ఉండవు అంటూనే మోడీ విజయవంతమైన ప్రధాని అని ప్రశంసించారు. అలాగే, రాజకీయాలపైనా, పదవులపైనా తనకు ఆసక్తి లేదని చెబుతున్నారు బాబా రాందేవ్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/