Begin typing your search above and press return to search.

ఏపీలో ఘోరం.. ప్రియురాలిని హత్యచేసిన ప్రియుడు!

By:  Tupaki Desk   |   19 Jan 2021 2:38 PM GMT
ఏపీలో ఘోరం.. ప్రియురాలిని హత్యచేసిన ప్రియుడు!
X
ప్రియురాలిని నరికి చంపాడో యువకుడు. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పెనమూరు మండలంలో చోటు చేసుకుంది. రెండేళ్లుగా తనను ప్రేమించిన యువతి.. ఇప్పుడు తనను దూరం పెడుతోందనే కోపంతో కత్తితో నరికాడు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పెనమూరు మండలంలోని ఒకే గ్రామానికి చెందిన యువతి, ఢిల్లీబాబు అనే వ్యక్తి రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. కానీ.. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. రెండు నెలల క్రితం వీరిద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే.. గాయత్రి మైనర్ కావడంతో ఈ పెళ్లి చెల్లుబాటు కాలేదు. ఈ క్రమంలో గాయత్రిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి, ఇంటికి పంపారు.

పోలీసుల కౌన్సెలింగ్ తరువాత గాయత్రిలో మార్పు వచ్చింది. అప్పటి నుంచి ఢిల్లీ బాబును దూరం పెడుతూ వచ్చింది. ఈ మార్పును ఢిల్లీ బాబు జీర్ణించుకోలేకపోయాడు. తనతో వచ్చేయాలని ఆమెపై ఒత్తిడి పెంచాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్నాడు.

దీంతో గాయత్రిని చంపేసేందుకు సిద్ధమయ్యాడు. పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తితో నడిరోడ్డుపైనే విచక్షణారహితంగా దాడి చేశాడు. 15 కత్తిపోట్లతో గాయత్రి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత నిందితుడు పరారయ్యాడు. దీంతో ఆగ్రహించిన గాయత్రి బంధువులు.. ఢిల్లీ బాబు ఇంటికి నిప్పుపెట్టారు. నిందితుడి తండ్రిపై దాడి చేశారు. దీంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.