Begin typing your search above and press return to search.
ఐలయ్యకు సన్మానం: విజయవాడలో మంటలు
By: Tupaki Desk | 21 Oct 2017 11:30 PM GMTవివాదాస్పద రచయిత - ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెఫర్డ్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి కూడా ఆయన వివాదాల తుట్టెనే కదిపారు. ఇటీవల ఆయన రాసిన `సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు` పుస్తకం ఏపీ - తెలంగాణల్లో పెద్ద తుఫాన్ రేపిన విషయం తెలిసిందే. ఆర్యవైశ్య, బ్రాహ్మణ సంఘాలు రోడ్ల మీదకు చేరి తీవ్ర ఆందోళనకు దిగాయి. కొన్ని ప్రాంతాల్లో ఆయనకు సంఘాల నేతలు అడ్డు తగిలి వివాదం పోలీస్ స్టేషన్లకు సైతం పాకింది. ఐలయ్య మీద కేసులు పెట్టిన వారూ ఉన్నారు. ఇక - ఐలయ్య పక్షాన ఎస్సీ వర్గాలు రోడ్లమీదకు వచ్చిఅగ్రవర్ణాలకు వ్యతిరేకంగా - ఐలయ్యకు మద్దతుగా ధర్నాలు చేశారు. వీరు కూడా వైశ్యులపై పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. మొత్తానికి ఈ వివాదా దాదాపు రెండు వారాలు సాగింది.
రాజకీయ నేతల మొదలు మఠాధిపతుల దాకా ఐలయ్యపై పెద్ద ఎత్తున ఫైరయ్యారు. పుస్తకాన్ని నిషేధించాలని నినాదాలు చేశారు. ముఖ్యంగా టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ను ఐలయ్య దుయ్యబట్టారు. ఆస్తులు సంపాయించుకున్నారని - క్రిమినల్ అని సంబోధించారు. అదేసమయంలో తాను మరో అంబేద్కర్ నని - దళితుల పక్షాన గొంతు వినిపిస్తానని - తన సమరం ఆగదని చెప్పారు. ఇక, మీడియాకు ఈ విషయం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. దీంతో వారాల తరబడి ఇదేవిషయంపై బ్రేకింగ్ న్యూస్ లతో చానెళ్ల దంచికొట్టాయి. అదేసమయంలో ఈ పుస్తకం నిషేధించాలని కోరుతూ..నేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.
అయితే, సదరు ఐలయ్య రచన భావ ప్రకటన కిందకి వస్తుందని పేర్కొంటూ.. పుస్తకాన్ని నిషేధించలేమని పేర్కొంది. అయితే, రచయితలు సంయమనం పాటించాలని మాత్రం చురకలంటింది. దీంతో దాదాపు వివాదం సర్దు మణిగిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ - నిప్పులేని పొగలా.. తాజాగా శనివారం ఐలయ్య సెంట్రిక్‌గా వివాదం మళ్లీ రాజుకుంది. ఈ నెల 28న ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు విజయవాడలో సన్మానం చేయాలని దళిత సంఘాలు నిర్ణయించాయి. ఇదే విషయాన్ని వెల్లడించాయి. దీంతో ఐలయ్య వివాదం మరోసారి భగ్గుమంది. తమ ఆత్మగౌరవాన్ని కించపరిచిన ఐలయ్యకు సన్మానమా? అంటూ ఆర్యవైశ్య - బ్రాహ్మణ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి.
ఎట్టి పరిస్థితిలోనూ ఈ సన్మానం జరగనివ్వబోమని స్పష్టం చేశాయి. అయితే, ఐలయ్య కూడా వీరికి ఘాటు జవాబే చెప్పారు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. బెదిరింపులకు భయపడేదిలేదని ఐలయ్య స్పష్టం చేశారు. అంతేకాదు ఈ నెల 28న తాను విజయవాడ వెళ్లి.. సన్మానం చేయించుకుంటానని తేల్చి చెప్పారు. అదేసమయంలో టీజీ వెంకటేశ్‌ను తక్షణం అరెస్టు చేసి జైల్లో పట్టాలని డిమాండ్ చేశారు. మరి ఈ వ్యాఖ్యలు కూడా ఆర్య వైశ్యుల్లో మంటలు రేపుతున్నాయి. ఈ వివాదం కొత్త రూపు సంతరించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.