Begin typing your search above and press return to search.

పాక్ గగనతలంలోకి బ్రహ్మోస్ క్షిపణులు.. భారత్ ఏం చెప్పిందంటే?

By:  Tupaki Desk   |   24 Aug 2022 5:31 AM GMT
పాక్ గగనతలంలోకి బ్రహ్మోస్ క్షిపణులు.. భారత్ ఏం చెప్పిందంటే?
X
కొన్ని తప్పులు పర్లేదు కానీ మరికొన్ని తప్పుల్ని సీరియస్ గా తీసుకోవాల్సిందే. తమ్ముడు తన వాడైనా ధర్మం తప్పకూడదన్న మాటను భారత్ చేతల్లోనూ చూపించింది. క్రమశిక్షణతో పాటు.. అంతర్జాతీయ సమాజంలో ఏళ్లకు ఏళ్లుగా తనకున్న ఇమేజ్ విషయంలో భారత్ ఎలాంటి తప్పులు చేయదన్న విషయాన్ని తాజా చర్యతో మరోసారి స్పష్టం చేసినట్లైంది. ఇటీవల దాయాది పాకిస్థాన్ గగనతలంలోకి బ్రహ్మోస్ క్షిపణులు పొరపాటున వెళ్లటం తెలిసిందే.

ఈ వ్యవహారంపై దాయాది దేశం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మార్చి 9న జరిగిన ఈ ఘటన అనంతరం భారత్ కు పాకిస్థాన్ సమన్లు పంపటంతో పాటు.. తన నిరసనను తెలియజేసింది.

దీనికి స్పందించిన భారత్ పూర్తి విచారణ అనంతరం తాజాగా ముగ్గురు వాయుసే అధికారుల్ని విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చిలో జరిగిన ఉదంతంపై తాజాగా కేంద్రంలోని మోడీ సర్కారు అధికారిక ఆదేశాల్ని జారీ చేసింది.

విధుల నుంచి తప్పించిన వారిలో ఒక గ్రూప్ కెప్టెన్.. వింగ్ కమాండర్ తో పాటు స్క్వాడ్రన్ లీడర్ కూడా ఉండటం గమనార్హం. స్టాండర్డ్ ప్రొసీజర్స్ లో చేసిన పొరపాటుతో క్షిపణులు ప్రమాదవశాత్తు పాకిస్తాన్ భూభాగంలో పడ్డాయని.. దీనికి ముగ్గురు అధికారులు చేసిన పొరపాట్లే కారణమని విచారణలో తేల్చారు.

అయితే.. ఈ సాంకేతిక లోపంతోనే పాకిస్థాన్ లో పొరపాటున బ్రహ్మోస్ క్షిపణులు పడినట్లుగా పేర్కొంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదన్న విషయాన్ని వెల్లడించింది. ఏమైనా.. తమ వైపు నుంచి జరిగే తప్పుల విషయంలో ఉపేక్షించమన్న విషయాన్ని భారత సర్కారు తాజా చర్యతో స్పష్టం చేసిందని చెప్పాలి.