Begin typing your search above and press return to search.

ఇక 'లారా'నే సన్ రైజర్స్ హైదరాబాద్ తలరాత మార్చాలి?

By:  Tupaki Desk   |   4 Sep 2022 4:04 AM GMT
ఇక లారానే సన్ రైజర్స్ హైదరాబాద్ తలరాత మార్చాలి?
X
ఎందరు ఆటగాళ్లు మారినా.. ఎందరు కోచ్ లు మారినా ఐపీఎల్ తెలుగు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ తలరాత మారడం లేదు. అందుకే ఏకంగా ప్రధాన కోచ్ నే మార్చేసింది సన్ రైజర్స్ యాజమాన్యం. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మేనేజ్‌మెంట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుత కోచ్ టామ్ మూడీతో తన ఒప్పందాన్ని ముగించింది. బ్రియాన్ లారాను కొత్త ప్రధాన కోచ్‌గా నియామకం చేసింది. ఈరోజు అధికారిక ప్రకటన వెలువడింది.

టామ్ మూడీ నిష్క్రమణను ప్రకటిస్తూ సన్ రైజర్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది, "మాతో టామ్ మూడీ పదవీకాలం ముగిసింది. SRHకి టామ్ చేసిన సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంవత్సరాలుగా ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రయాణం, భవిష్యత్ లో టీం కోసం మేం అతనిని కోరుకుంటున్నాము' అని పేర్కొంది.

తర్వాత బ్రియాన్ లారాను కొత్త ప్రధాన కోచ్‌గా ప్రకటించారు. "క్రికెట్ లెజెండ్ బ్రియాన్ లారా రాబోయే #IPL సీజన్‌లకు మా ప్రధాన కోచ్‌గా ఉంటారు" అని SRH ట్వీట్ చేసింది. బ్రియాన్ లారా IPL 2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు.

టామ్ మూడీ సన్ రైజర్స్ తో గొప్ప బంధాన్ని నెలకొల్పారు. అతను 2013 నుండి 2019 వరకు జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. అతని పదవీకాలంలో SRH ఐదుసార్లు ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. 2016లో టైటిల్‌ను గెలుచుకుంది. 2021లో అతను జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2022లో మళ్లీ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఎస్ఆర్.హెచ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. చిత్తుగా ఓడింది. అందుకే వచ్చే సీజన్‌లో బలమైన పునరాగమనం కోసం బ్రియన్ లారాను నియమించినట్టు తెలుస్తోంది.