Begin typing your search above and press return to search.

ఆంధ్రా వరికి బ్రేకులు...అక్రమ బిజినెస్ కి చెక్

By:  Tupaki Desk   |   15 April 2022 7:49 AM GMT
ఆంధ్రా వరికి  బ్రేకులు...అక్రమ బిజినెస్ కి చెక్
X
తెలంగాణాలో ఇబ్బండి ముబ్బడిగా యాసంగి సీజన్ లో పడిన ధాన్యాన్ని ఒక్క గింజ కూడ పొల్లుపోకుండా కొంటామని కేసీయార్ గట్టిగానే ప్రకటించారు. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా రెడీ చేశారు. దాంతో ఇపుడు అక్రమ మార్గాలలో ఆంధ్రాలోని సరిహద్దు జిల్లాల నుంచి వరి పెద్ద ఎత్తున తెలంగాణాకు తరలివెళ్తోందిట. ఈ నేపధ్యంలో తెలంగాణా పోలీసులు ఒక్కసారిగాఅప్రమత్తం అయ్యారు.

ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి మరీ ఆంధ్రా సరిహద్దుల వద్ద గట్టి నిఘా పెట్టేశారు. అలా తెలంగాణలోకి వచ్చే భారీ వాహనాలను తనిఖీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దుల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులను మోహరించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ, నాగార్జునసాగర్‌, ఖమ్మంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అధిక లోడుతో వెళ్తున్న లారీలు, ట్రాక్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కోదాడ రామాపురం కూడలి వద్ద ధాన్యం లోడుతో వస్తున్న రెండు లారీలు, రెండు ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు.

ఆయా లారీ, లోడ్ వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు వెనక్కి పంపించారు. అయితే ధాన్యం రవాణాకు సంబంధించి తమ వద్ద ముందస్తు సమాచారం లేకపోవడంతో రైతులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. దీంతో నిరాశ చెందిన రైతులను పోలీసులు శాంతింపజేసినా తెలంగాణలోకి రానివ్వలేదు. ఇదొక ముచ్చట అయితే తెలంగాణాలో ఆంధ్రా వరిని అమ్ముకునేందుకు కొందరు వ్యాపారులు పెద్ద ఎత్తున బిజినెస్ కి తెర తీశారు అని తెలుస్తోంది.

బస్తాకు 1960 రూపాయలు అంటూ ఆకర్షణీయమైన ధరను తెలంగాణ సర్కార్ నిర్ణయించడంతో ఆంధ్రా వరికి అడ్డదారులు వెతికి మరీ తెలంగాణాలోకి చేర్చేలా చూస్తున్నారు. అలా ఆంధ్రాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లా వ్యాపారులు తక్కువ ధరకు అక్కడ రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి తెలంగాణకు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమై ప్రధాన జంక్షన్ల వద్ద ప్రవేశంపై ఆంక్షలు విధిస్తున్నారు.

అంతే కాదు, ఇంకా ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం, మదిర, బోనకల్, ఎర్రుపాలెం, మరికొన్ని సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు పికెట్లు లేవు. దాంతో ఆ వైపుగా ఆంధ్రా వరికి దారులు తెరచుకుంటాయన్న చర్చ కూదా ఉంది. నిజానికి చూస్తే ఏపీ రైతులు తమ పంటను అమ్ముకునేందుకు తెలంగాణకు రావడం ఇదే తొలిసారి కాదు అంటున్నారు. గతంలో కూడా ఇలాగే చేశారు.

అయితే ఈసారి వరి కొనుగోలు మీద ఏకంగా కేంద్రంతో కేసీయార్ పెద్ద యుద్ధమే చేశారు. మీరే కొనాలని కూడా డిమాండ్ చేశారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఒక విధంగా టీయారెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకుంది. దాంతో అణువణువునా తనిఖీలు చేపట్టాలని చూస్తున్నారు. అదే టైమ్ లో తెలంగాణా రైతులు తప్ప ఆంధ్రా సహా ఇతర రాష్ట్రాల నుంచి వరిని రానీయకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఆంధ్రాలో కొందరి వ్యాపారుల అడ్డగోలు బిజినెస్ కి ఇలా ఎక్కడికక్కడ చెక్ పెట్టేస్తున్నారు.