Begin typing your search above and press return to search.

రేషన్ డీలర్ల ఆందోళనకు బ్రేక్

By:  Tupaki Desk   |   28 Oct 2021 11:30 AM GMT
రేషన్ డీలర్ల ఆందోళనకు బ్రేక్
X
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్ల ఆందోళనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సమస్యను పరిష్కరిస్తామన్న మంత్రి కొడాలి నాని హామీతో రేషన్ డీలర్లు ఇప్పుడు వెనక్కి తగ్గారు. నవంబర్ కోటా రేషన్ కు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తామని రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది.

కాగా జీవో నంబర్ 10 రద్దుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ రేషన్ డీలర్లు ఆందోళన చేస్తూ వచ్చారు. సీఎం జగన్ తమ సమస్యలపై స్పందించేంత వరకూ నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు.ఇక రేషన్ డీలర్లతో ఉన్నతాధికారులు బుధవారం జరిపిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ గిరిజా శంకర్ తో జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో నిరసన కార్యక్రమాలు డీలర్లు కొనసాగించారు.

ఓవైపు రేషన్ డీలర్లు ధర్నాకు దిగితే రేషన్ పంపిణీ ఆగదన్న మంత్రి కొడాలి నాని.. రేషన్ సరఫరా వాహనాలు ఉన్నాయని... ఇంటింటికి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు వారికి హామీ ఇచ్చారు. దీంతో రేషన్ డీలర్ల ఆందోళనకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు అయ్యింది.

రేషన్ వ్యవస్థను సీఎం జగన్ అధికారంలోకి రాగానే ప్రక్షాళన చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో డీలర్లు అవినీతి చేశారని.. ప్రజలకు సరుకులు అందకుండా చేస్తున్న ఆరోపణలకు పరిష్కారంగా ప్యాకెట్ల రూపంలో సరుకులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అంతేకాదు.. గ్రామ వలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటికే పంపేలా జగన్ చర్యలు చేపట్టారు. దీంతో రేషన్ డీలర్లు ఇటీవల తమ సమస్యలు, కోరికలు తీర్చాలని సమ్మె బాట పట్టారు. తాజాగా ప్రభుత్వం చర్చలు జరపడంతో డీలర్లు దిగివచ్చి రేషన్ సరఫరాకు అంగీకారం తెలిపారు.