Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రి మేకపాటి ఏ కారణంగా మృతి చెందారు

By:  Tupaki Desk   |   21 Feb 2022 3:21 AM GMT
ఏపీ మంత్రి మేకపాటి ఏ కారణంగా మృతి చెందారు
X
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి నేడు తెల్లవారు జామున గుండె పోటుతో మృతి చెందారు. తెల్లవారు జామున గుండెపోటు రావడంతో మేకపాటి కుప్పకూలిపోయారు. దాంతో వెంటనే హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లే లోపే ఆయన మృతి చెందినట్లుగా సన్నిహితులు పేర్కొంటున్నారు. వైధ్యులు అత్యవసర చికిత్స అందించినా కూడా ఫలితం లేక పోయిందట.

మంత్రి ఏ సమయంలో మృతి చెందారు.. ఏ కారణంగా మృతి చెందారు అనే విషయాలను అపోలో ఆసుపత్రి వర్గాల వారు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆసుపత్రి కి చేరేప్పటికి మృతి చెందినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై వైకాపా వర్గాల వారు మరియు కుటుంబ సభ్యులు కూడా ఇంకా స్పందించలేదు. అభిమానులు మరియు కార్యకర్తలు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి క్యాబినేట్‌ లో చేస్తున్న గౌతమ్‌ రెడ్డి వారం రోజుల క్రితం దుబాయి వెళ్లారు. అక్కడ జరిగిన బిజినెస్‌ ఎక్స్‌ పో లో ఏపీ మంత్రి హోదాలో పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులను ఆహ్వానించారు.. పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులు వచ్చేలా ఒప్పించారు. దుబాయి ఎక్స్‌ పో ను ముగించుకుని నేరుగా హైదరాబాద్‌ కు నిన్న చేరుకున్నారు.

ఏపీకి నేడు లేదా రేపు వెళ్లాల్సి ఉంది. దుబాయ్ ఎక్స్ పో కు సంబంధించిన విషయాలను మంత్రి ముఖ్యమంత్రి మరియు మీడియాకు తెలియజేయాల్సి ఉంది. ఇంతలో ఇలా జరిగింది. మంత్రి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి మరియు తోటి మంత్రులు మరియు ఏపీ రాజకీయ వర్గాల వారు తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.

మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టిన గౌతమ్ రెడ్డి 2014 మరియు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 లో వైకాపా అధికారంలోకి వచ్చిన సమయంలో కీలకమైన పరిశ్రమల శాఖ ను గౌతమ్ రెడ్డి పై ఉన్న నమ్మకం మరియు సన్నిహిత్యం కారణంగా జగన్ ఇవ్వడం జరిగింది.

49 ఏళ్ల మేకపాటి గౌతమ్ రెడ్డి ఇలా హఠాన్మరణం కు గురి అవ్వడం అందరికి షాకింగ్ గాఉంది. యూకే లో ఉన్నత చదువులు చదివిన మేకపాటి గౌతమ్‌ రెడ్డి పార్టీలో మరియు జనాల్లో మంచి పేరు దక్కించుకున్నారు. జగన్ కు ఆత్మీయుడిగా పేరును సొంతం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఆయన సొంత నియోజక వర్గం లో అంతిమ సంస్కారాలు చేసే అవకాశం ఉంది. ఆ విషయమై కుటుంబ సభ్యుల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.