Begin typing your search above and press return to search.

రాజాసింగ్ ను వదలని తెలంగాణ సర్కార్.. మళ్లీ అరెస్ట్

By:  Tupaki Desk   |   25 Aug 2022 10:30 AM GMT
రాజాసింగ్ ను వదలని తెలంగాణ సర్కార్.. మళ్లీ అరెస్ట్
X
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మూడు రోజుల వ్యవధిలోనే మళ్లీ రెండోసారి అరెస్ట్ అయ్యారు. ఈ ఉదయం పాత కేసులపై నోటీసులు ఇచ్చిన మంగళ్ హాట్ పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆయన్ను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. గురువారం ఉదయం షాహినాయత్ గంజ్, మంగళ్ హాట్ పోలీసులు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19, ఏప్రిల్ 12న రాజాసింగ్ పై నమోదైన కేసుల్లో ఈ నోటీసులు జారీ అయ్యాయి.

పోలీసులు నోటీసులు ఇవ్వడంపై రాజాసింగ్ స్పందించారు. పాత కేసుల్లో తనను మరోసారి అరెస్ట్ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నారని ఆరోపించారు. నిన్ననే నోటీసులు సిద్ధం చేసి ఈ ఉదయం అందించారని తెలిపారు. కేసులు నమోదైన ఆర్నెళ్ల నుంచి పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు.

కాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాజాసింగ్ పై కేసు నమోదైంది. అసిస్టెంట్ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 19న మంగళ్ హట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో రెచ్చగొట్టేలా పాట పాడారని షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 12వ తేదీన మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో రాజాసింగ్ కు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ కావడం గమనార్హం.

ఇటీవల ఓ మత ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రాజాసింగ్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా తనను అరెస్ట్ చేశారని ఆయన తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో పోలీసులు అరెస్ట్ విధానం సరిగా లేదంటూ ఆయనను విడుదల చేసింది.

కాగా రాజాసింగ్ వ్యాఖ్యలతో పాతబస్తీ సహా హైదరాబాద్ అట్టుడుకుతోంది. ఆందోళనలతో హింస చెలరేగుతోంది. రాజాసింగ్ ఇంటిని కూడా ఆందోళనకారులు ముట్టడించి దాడులకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

రాజాసింగ్ కు బెయిల్ పై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈపిటీషన్ కోర్టు రేపు విచారణ జరుపనుంది. తాజాగా మరో కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.