Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: సీఎం కేసీఆర్ కు షాక్.. హైకోర్టు నోటీసులు

By:  Tupaki Desk   |   23 Jun 2022 8:30 AM GMT
బ్రేకింగ్:  సీఎం కేసీఆర్ కు షాక్.. హైకోర్టు నోటీసులు
X
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ లో టీఆర్ఎస్ కు భూమి కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలకు భూకేటాయింపులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్ రాజ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యలపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

టీఆర్ఎస్ హైదరాబాద్ కార్యాలయం కోసం 4935 గజాలు ఇవ్వడం.. అత్యంత ఖరీదైన భూమిని రూ.100కే గజం కేటాయించడాన్ని సవాల్ చేస్తూ పిటీషనర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం టీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డితోపాటు సీఎస్, సీసీఎల్ ఏ , హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

అధికారంలో ఉన్న కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసం ఢిల్లీతోపాటు తెలంగాణలోని 33 జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి ప్రతీ జిల్లా కేంద్రంలోనూ భూకేటాయింపులు చేశారు. హైదరాబాద్ లో ఖరీదైన బంజారాహిల్స్ లోని 4935 గజాల స్థలాన్ని గజం రూ.100 కే కేసీఆర్ సర్కార్ ధారదత్తం చేయడాన్ని పలువురు విమర్శించారు.

బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 12లోని ఎన్బీటీ నగర్ లో 4935 చదరపు గజాల స్థలాన్ని కేటాయింస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ తో సహా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండాలనే టీఆర్ఎస్ ప్రణాళికలో భాగంగా ఈ కేటాయింపు జరిగింది.

భూపరిపాలన ప్రధాన కమిషనర్ సిఫార్స్ మేరకు ఈ భూకేటాయింపు జరిగింది. కేటాయించిన భూమిని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం గతంలోనే కాంగ్రెస్ పార్టీ భూమి కేటాయించిన విషయం కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ గుర్తు చేశారు. వంద కోట్ల విలువైన భూమిని గజానికి రూ.100కే ఇవ్వడం విడ్డూరమన్నారు.