Begin typing your search above and press return to search.

అంతర్జాతీయ క్రీడాకారిణి దీనగాథ.. కప్పు తేవాల్సిన చేతుల్లో ఇటుకలు!

By:  Tupaki Desk   |   25 May 2021 12:30 AM GMT
అంతర్జాతీయ క్రీడాకారిణి దీనగాథ.. కప్పు తేవాల్సిన చేతుల్లో ఇటుకలు!
X
పై ఫొటోలో కనిపించే ఆమె రోజువారి కూలీ కాదు. అడపా దడపా పనులు చేసుకునే అమ్మాయి అంతకన్నా కాదు. ఆమె ఓ అంతర్జాతీయ క్రీడాకారిణి. తనదైన ప్రతిభతో సీనియర్ జట్టుకు ఎంపికైన మట్టిలో మాణిక్యం. దేశం గర్వించే స్థాయిలో కప్పులు తీసుకురావాల్సిన ఆమె ఎందుకు ఇటుకలు మోస్తుంది అనుకుంటున్నారా? అంటే కాలం మనచేతిలో ఉండదు కదా. కరోనాతో ఒక్కసారిగా ఆమె బతుకు మారిపోయింది. పొట్టపోసుకోవడానికి ఇటుకల మోయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమె ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఆత్మాభిమానంతో రెక్కలు వంచి కష్టపడుతోంది. అలా తన వాళ్ల కడుపు నింపుతోంది.

కుటుంబానికి అండగా..
జార్ఖండ్ కు చెందిన క్రీడాకారిణి సంగీత కుమారి సోరైన్. 2018-19 భూటాన్, థాయ్ లాండ్ లో జరిగిన అండర్-17, అండర్-18 టోర్నీలకు కెప్టెన్ గా వ్యవహరించింది. తనదైన ప్రదర్శనతో సీనియర్ జట్టుకు ఎంపికైంది. కానీ కరోనా మహమ్మారి ఆమె కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీసింది. ఓ వైపు కళ్లు లేని నాన్న, లాక్ డౌన్ వేళ ఉపాధి కోల్పోయిన అన్న. చేసేది లేక తానూ కష్టపడాలని అనుకుంది. అమ్మతో కలిసి స్థానికంగా ఉన్న ఇటుక బట్టీలో కూలి పనులు చేస్తోంది. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబానికి అండగా నిలబడుతోంది.

ఎవరూ పట్టించుకోలేదు!
సంగీత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గతంలో ప్రకటించారు. అయితే ఇంతవరకు తమను ఎవరూ సంప్రదించలేదని సంగీత తండ్రి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని వాపోయారు. జార్ఖండ్ లో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు చాలామంది ఉన్నారని సంగీత చెబుతోంది. ప్రభుత్వ సహకారం లేక జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారని తెలిపింది. కూలీ పనికి పోయే ముందు పొలాల్లో రోజూ ప్రాక్టీస్ చేస్తున్నట్లు పేర్కొంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఫుట్ బాల్ వదిలేది లేదని స్పష్టం చేసింది.

కేంద్రమంత్రి స్పందన
అథ్లెట్ సంగీత దీన గాథను ఓ హిందీ పత్రిక ప్రచురించింది. సంగీత అంశంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజుజి స్పందించారు. ప్రభుత్వం తరఫున ఆమెను ఆదుకుంటామని ట్వీట్ చేశారు. అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడల్లో భారత జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన సంగీతకు సహకారం ఉంటుందని తెలిపారు. ఆమె ఆర్థిక సమస్యలపై ఆరా తీసినట్లు చెప్పారు. త్వరలోనే సాయం చేస్తామని వెల్లడించారు. క్రీడాకారులు గౌరవప్రదమైన జీవనాన్ని గడపడమే తమ ఉద్దేశమని అన్నారు.

నెటిజన్లు ఫైర్
సంగీత పరిస్థితిపై నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై ఘాటుగా స్పందిస్తున్నారు. దేశంలో క్రీడాకారులను ఆదుకునేవారే లేరా? అని ప్రశ్నిస్తున్నారు. వేల కోట్లలో సంపాదించిన క్రీడాకారులైనా ఇలాంటి వర్తమాన అథ్లెట్లకు సహకారం అందించాలని కోరుతున్నారు. దేశానికి కప్పు తేవాల్సిన ఆమె చేతిలో ఇటుకలు ఉండడం నిజంగా బాధాకరమని విచారం వ్యక్తం చేస్తున్నారు.