Begin typing your search above and press return to search.

వ‌ర‌ద నీటితో కుప్ప‌కూలిన బ్రిడ్జి

By:  Tupaki Desk   |   30 Aug 2016 8:40 AM GMT
వ‌ర‌ద నీటితో కుప్ప‌కూలిన బ్రిడ్జి
X
భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. న‌దులు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తూ ఉండ‌టంతో సాధార‌ణ ర‌హ‌దారులు మూసుకుపోయాయి. రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతోంది. ఈ క్ర‌మంలో నీటి వేగానికి త‌ట్టుకోలేక‌ బెయిలీ బ్రిడ్జి కుప్ప‌కూలిపోయింది. ఈ బ్రిడ్జీ కూలుతున్న‌ప్పుడు దానిపై ఒక లారీ వెళ్తోంది. అదృష్టవ‌శాత్తూ ఆ లారీ డ్రైవ‌ర్ ను వెంట‌నే కాపాడ‌గ‌లిగారు. రోహ్‌ తాంగ్ సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు అవ‌స‌ర‌మైన సామానులు ఈ బ్రిడ్జి మీద నుంచే తీసుకెళ్తూ ఉంటారు. అలాగే, కొంత సామ‌గ్రిని తీసుకొస్తూ ఒక లారీ బెయిలీ బ్రిడ్జి మీదికి రాగానే... అది కూలిపోవ‌డం మొద‌లైంది. వెంట‌నే అధికారులు స్పందించ‌డంతో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని రోహ్‌తాంగ్ ప్రాజెక్ట్ ఛీఫ్ ఇంజినీర్ బ్రిగేడియ‌ర్ డీఎన్ భ‌ట్ మీడియాకి తెలిపారు. అయితే, వ‌ర‌ద ప్ర‌వాహంలో లారీ క‌ట్టుకుపోయింది. దాన్ని కూడా త్వ‌ర‌లోనే వెలికి తీస్తామ‌ని ఆయ‌న చెప్పారు. కూలిన బ్రిడ్జిని కూడా వీలైనంత త్వ‌ర‌గా పున‌ర్నిర్మిస్తామ‌ని అన్నారు.

రోహ్ తాంగ్ ప్రాజెక్ట్ పూర్త‌యితే ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా మారుతుంది. లెహ్‌-మ‌నాలి మార్గంలో ఉందీ రోహ్ తాంగ్ పాస్‌. ప్ర‌తీయేటా దాదాపు ఆరు నెల‌ల పాటు ఈ మార్గాన్ని మూసేస్తారు. ఎలాంటి రాక‌పోక‌ల్నీ ఈ మార్గంలో అనుమ‌తించ‌రు. మంచు విప‌రీతంగా కురుస్తూ ఉండ‌టం వ‌ల్ల ప్ర‌యాణానికి ఏమాత్రం అనుకూలంగా ఉండ‌దు. అయితే, ఈ మార్గం ద‌గ్గ‌ర 8.8 కిలోమీట‌ర్ల సొరంగ మార్గాన్ని ప్ర‌స్తుతం నిర్మిస్తున్నారు. ఇది పూర్త‌యితే, దేశంలోనే అతి పొడ‌వైన సొరంగం ఇదే అవుతుంది. ఈ సొరంగ నిర్మాణం పూర్త‌యితే ఏడాది పొడ‌వుగా రోహ్‌తాంగ్ పాస్ మార్గాన్ని వినియోగించుకోవ‌చ్చు. ఈ మార్గాన్ని ఏడాది పొడ‌వునా తెరిచి ఉంచే అవ‌కాశం ఉంటుంది.