Begin typing your search above and press return to search.

పతంజలిని అమ్మకానికి పెట్టారే? అంత మాట అన్నది ఎవరో తెలుసా?

By:  Tupaki Desk   |   25 Nov 2022 3:30 PM GMT
పతంజలిని అమ్మకానికి పెట్టారే? అంత మాట అన్నది ఎవరో తెలుసా?
X
యోగా గురువు బాబా రాందేవ్ పుణ్యమా అని పతంజలి పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ పేరును పాపులర్ చేసిన ఘనత ఆయనదే. పతంజలి పేరు తెలిసిన వారిలో ఎంత మందికి ఆ పేరు ఎవరిది? ఈ ప్రపంచానికి ఆయనేం చేశారు? లాంటివి తెలియకపోవచ్చు. కానీ.. ఆయన పేరును మాత్రం ఇట్టే గుర్తించేస్తారు. ఇవాల్టి రోజున యోగా అంటూ ప్రపంచం మొత్తం పాపులర్ అయిన ప్రక్రియకు మూలం ఆయనే అన్నది తెలిసిందే.

అలాంటి పతంజలి పేరును ఒక బ్రాండ్ గా మార్చి వేలాది కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన క్రెడిట్ బాబా రాందేవ్ కు.. ఆ కంపెనీ ఎండీ బాలక్రిష్ణన్ కు చెందుతుందని చెప్పాలి. మిగిలిన బహుళజాతి కంపెనీల కంటే తక్కువ ధరకు వస్తువుల్ని అందించటం ద్వారా అందరి కంట్లో పడి.. మౌత్ టాక్ తో.. పక్కా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థతో అనూహ్య రీతిలో విజయాల్ని సొంతం చేసుకున్న ఆయన కంపెనీకి ఈ మధ్యన తరచూ ఏదో ఒక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వేళలో.. అనూహ్యంగా బీజేపీ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

పతంజలి బ్రాండ్ పేరుతో అమ్మకాలు జరుపుతున్న బాబా రాందేవ్ మీదా బాలక్రిష్ణ మీదా ఆయన విరుచుకుపడ్డారు. మహానుభావుడైన పతంజలి పేరుతో అమ్మకాలు చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఒకవేళ పేరు మార్చుకోకుంటే ఉద్యమం చేస్తామన్న ఆయన.. ఒక కీలక వ్యాఖ్య చేశారు.

యోగా పితామహుడైన మహర్షి పతంజలి పేరును వాడుకొని పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నినిర్మించుకున్న రామ్ దేవ్.. పతంజలి పుట్టిన గ్రామానికి మాత్రం ఏమీ చేయలేదని విమర్శించటం గమనార్హం. మహానుభావుడి పేరుతో అమ్మకాలు చేస్తారా? అంటూ ఆయన లేవనెత్తిన పాయింట్.. ఆయన వ్యాపార ప్రత్యర్థులకు కాస్తంత ఆనందాన్ని కలిగించొచ్చన్న మాట వినిపిస్తోంది.

ఇక తన వాదనను వినిపించిన బీజేపీ ఎంపీ.. ''ఆయన వ్యాపారం గురించి అనవసరం. నెయ్యి.. సబ్బులు.. ప్యాంట్లు.. చివరకు లో దుస్తులకు కూడా ఆయన పేరు పెట్టుకోవటం ఏమిటి? ఎంతవరకు సమంజసం?' వారికి ఆ హక్కు ఎవరు ఇచ్చారు? పేరు మార్చుకోకుంటే ఉద్యమం చేస్తా.

న్యాయపరమైన చర్యలకు దిగుతాం' అని పేర్కొన్నారు. అయ్యోధ్యకు వచ్చే యాత్రికులు కొండార్ ను సందర్శిస్తే.. పతంజలి పుట్టిన ఊరికి ఏం చేశారో అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనికి రాందేవ్ బాబా ఎలా రియాక్టు అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.