Begin typing your search above and press return to search.

చిరాగ్ మద్దతు కోసం తేజస్వి సూపర్ స్కెచ్

By:  Tupaki Desk   |   1 Dec 2020 1:30 PM GMT
చిరాగ్ మద్దతు కోసం తేజస్వి సూపర్ స్కెచ్
X
బీహార్ లో రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇపుడు సమీకరణలు మారిపోయినా ప్రభుత్వానికి వచ్చే ముప్పు ఏమీ లేకపోయినా భవిష్యత్తులో ఎప్పుడేమి జరుగుతుందో తెలీదు కాబట్టి ఇపుడు మారే సమీకరణలపై అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఎల్జేపీ చీఫ్ చిరాగా పాశ్వాన్ ను దగ్గరకు తీసుకోవటానికి ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ సూపర్ స్కెచ్ వేశారు. దివంగత కేంద్రమంత్రి, చిరా తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఖాళీ అయిన రాజ్యసభ సీటు కేంద్రంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

రామ్ విలాస్ చనిపోయిన కారణంగా ఆ సీటును భర్తీ చేయాల్సుంది. ఎలాగూ తన తండ్రి మరణంతో ఖాళీ అయిన సీటే కాబట్టి తన కుటుంబానికే దక్కుతుందని చిరాగ్ ఆశలు పెట్టుకున్నారట. అయితే నరేంద్రమోడి మాత్రం చిరాగ్ కు పెద్ద షాకే ఇచ్చారు. చిరాగ్ ను కనీసం సంప్రదించకుండానే ఆ సీటును బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోడికి కేటాయించేశారట. తండ్రి ఖాళీ చేసిన సీటును తన తల్లి రీనా పాశ్వాన్ కు కేటాయించమని చిరాగ్ అడిగినా మోడి ఒప్పుకోలేదట. దాంతో ఏమి చేయాలో యువనేతకు అర్ధంకాలేదు.

సరిగ్గా ఈ సమయంలోనే తేజస్వి ఎంటరయ్యారు పిక్చర్లోకి. పాశ్వాన్ కుటుంబానికి అన్యాయం జరిగిందని చెబుతున్న తేజస్వీ తమతో చేతులు కలిపితే ఆ రాజ్యసభ స్ధానాన్ని రీనా పాశ్వాన్ కు వచ్చేట్లు సహకరిస్తామని చెప్పారు. నిజానికి తేజస్వి గనుక పోటీ పెడితే ఆ రాజ్యసభ సీటులో గెలవటం ఎన్డీయే కూటమికి అంత ఈజీకాదు. ఎలాగంటే సీట్ల సంఖ్య తీసుకుంటే బీజేపీకన్నా ఆర్జేడీకి ఎక్కువున్నాయి. ఇక కూటమిలో మాత్రమే ఎన్డీయేకి ఎక్కువుంది.

అయితే ఐదుస్ధానాల్లో గెలిచిన ఎంఐఎం ఎంఎల్ఏలు ఇపుడు ఆర్జేడీతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారట. అంటే కూటమి సంఖ్య 110 నుండి 115కి పెరిగింది. అలాగే చిరాగ్ చేతులు కలిపితే గెలిచిన ఒక్క ఎంఎల్ఏ కారణంగా 116కి పెరుగుతుంది. దీనికితోడు అప్పుడు ఎన్డీయేలోని జేడీయుతో పాటు రెండు పార్టీల్లో లుకలుకలు మొదలైనట్లు సమాచారం. దీంతో మరి కొందరు ఎంఎల్ఏలను తమవైపుకు తిప్పుకుంటే ముందు రాజ్యసభ సీటును గెలుచుకోవచ్చన్నది తేజస్వి ప్లానుగా చెబుతున్నారు. అదృష్టం కలిసొస్తే ఎన్డీయే కూటమి కూలిపోయి ఆర్జేడీ అదికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇదంతా తేజస్వీతో చిరాగ్ చేతులు కలిపితేనే. లేకపోతే ఎలాగూ పోటీ పెడతామంటున్న కారణంగా అప్పటి రాజకీయ సమీకరణలను అప్పటికప్పుడు నిర్ణయిస్తారు. కాబట్టి ఎలా చూసినా రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారిపోయే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు తేజస్వీ చుక్కులు చూపిస్తున్నట్లే అర్ధమవుతోంది. చూద్దాం బీహార్ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో.