Begin typing your search above and press return to search.

కేసీఆర్ ద‌గాకోరు...ఢిల్లీ వైపే ఆయన చూపు

By:  Tupaki Desk   |   25 Jan 2017 7:33 AM GMT
కేసీఆర్ ద‌గాకోరు...ఢిల్లీ వైపే ఆయన చూపు
X
సామాజిక న్యాయం-సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 2650 కిలో మీటర్లు పూర్తి చేసిన సంద‌ర్భంగా ఆదివాసీల పోరుగర్జన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు హాజ‌రైన మాజీ ఎంపీ, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. 'కేసీఆర్‌ దగాకోరు. తెలంగాణ సెంటిమెంట్‌, విద్యార్థుల బలిదానాల పునాదుల గద్దెనెక్కి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. పాదయాత్ర ప్రతి అడుగు శబ్దం ఆయన చెవులకు తగులుతోంది. అందుకే ఉల్టా పల్టా మాట్లాడుతున్నారు. ఆయన మాతో నడిస్తే ప్రజల గోడు ఏంటో తెలుస్తుంది. నిండు అసెంబ్లీలో అటవీ హక్కుల చట్టం గురించి అబద్ధం మాట్లాడాడు. చట్టం గురించి తెలుసుకుంటే మంచిది. లేకుంటే నేర్పిస్తాం. అసలు చట్టాన్ని ధిక్కరించే హక్కు నీకెక్కడిది. కుర్చీ మీద ఉన్న ధ్యాస ప్రజలపై లేదు. నిత్యం కుటుంబం కోసమే ఆలోచిస్తున్నారు. ప్రజల్ని ధిక్కరిస్తే వారే తగిన గుణపాఠం చెబుతారు' అని హెచ్చరించారు.

పాదయాత్రను అడ్డుకోవాలని కేసీఆర్‌ ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా, అన్నీ చేస్తున్నామని చెబుతున్నా.. ప్రజలెందుకు పాదయాత్ర బృందాన్ని పూలపాన్పులో ముందుకు నడిపిస్తున్నారని బృందాకరత్ ప్రశ్నించారు. రాజకీయాల కోసం హెలికాప్టర్ల ద్వారా పర్యటిస్తారు, బంగ్లాపై నుంచి చూస్తారు. కానీ ప్రజల మధ్యలోకి వచ్చి గిరిజనులు, దళితులు, అట్టడుగు వర్గాల ఇళ్ల‌లో 100 రోజుల పాటు ఉంటూ వారి సమస్యల్ని తెలుసుకుంటున్న ఒకే ఒక యాత్ర మహాజన పాదయాత్ర అన్నారు. 2005 వరకు భూములు పోడు చేస్తున్న ప్రతి రైతుకు 5 నుంచి 10 ఎకరాలకు హక్కు కల్పించి హక్కు పత్రాలు ఇవ్వాలని చట్టంలో ఉందన్నారు. చట్టం చేసినప్పుడు కేసీఆర్‌ పార్లమెంట్‌లోనే ఉన్నారని బృందా గుర్తు చేశారు. అలాంటిది అసెంబ్లీలో అబద్దాలు చెప్పినందుకు ఆయన సిగ్గుపడాలన్నారు. వ్యక్తిగా ఆయనను విమర్శించడం లేదని, పాలనా విధానాలపైనే మాట్లాడుతున్నామని అన్నారు. ''ఇండ్లులేని పేదలకు ఇండ్లు ఇచ్చావా.. రైతులకు ఏం చేశావ్‌... అంగన్‌వాడీలను రెగ్యులరైజ్‌ చేశావా.. గిరిజన విద్యార్థులకు ఏం చేశావ్‌'' అంటూ బృందాకరత్‌ ప్రశ్నించారు. ఆయన దృష్టి ఢిల్లీపై ఉందన్నారు. మోడీకి సలామ్‌ చేస్తూ ఆయన మెప్పుకోసమే పాకులాడుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో కేసీఆర్‌ విఫలమయ్యారని, తెలంగాణ ప్రజలు ఎర్రజెండా వెంట నడుస్తున్నారన్న విషయం ఇప్పటికైనా గుర్తించాలని అన్నారు. కేసీఆర్‌కు అనుమానం ఉంటే వచ్చి చూడాలని, పాదయాత్రలో ఆయన పాల్గొంటే గిరిజనులు, దళితులు పడుతున్న ఇబ్బందులేంటో తెలుస్తాయన్నారు. ప్రజల సహకారాన్ని తీసుకొని ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రజల ముందు ఉంచుతామని బృందా క‌ర‌త్ అన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/