Begin typing your search above and press return to search.

భారత్ దెబ్బకి ఓ మెట్టు దిగొచ్చిన బ్రిటన్ !

By:  Tupaki Desk   |   22 Sep 2021 4:30 PM GMT
భారత్ దెబ్బకి ఓ మెట్టు దిగొచ్చిన బ్రిటన్ !
X
కరోనా మహమ్మారిని అరికట్టడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలో ఓ మహోద్యమంలా కొనసాగుతోంది. 82 కోట్ల మందికి పైగా ప్రజలు వ్యాక్సిన్లను వేసుకున్నారు. ఇందులో సింగిల్ డోస్ టీకా తీసుకున్నవారి సంఖ్యే అధికంగా ఉంటోంది. సెకెండ్ డోస్ తీసుకోవడానికి సుమారు మూడు నెలల పాటు గడువు ఉండటమే దీనికి కారణం. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వినియోగిస్తోన్నది కోవిషీల్డ్. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీన్ని ఉత్పత్తి చేస్తోంది. అనేక దేశాలకు ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తోంది.

కోవిషీల్డ్‌ కు అధికారిక గుర్తింపు ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీన్ని వ్యాక్సిన్‌ గా గుర్తించింది. ఈ పరిస్థితుల మధ్య బ్రిటన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అధికారికంగా గుర్తించట్లేదంటూ చేసిన ఓ ప్రకటన కలకలం రేపింది. బ్రిటన్‌కు ప్రయాణాలు పెట్టుకున్న వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గందరగోళంలో పడ్డారు. కోవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. తాము దాన్ని వ్యాక్సిన్‌ గా గుర్తించట్లేదంటూ మొదటగా ప్రకటించింది బ్రిటన్ ప్రభుత్వం.

ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలను తీసుకుంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులను రంగంలోకి దింపింది. భారత్‌ లోని బ్రిటన్ హైకమిషన్ కార్యాలయం అధికారులతో విదేశాంగ శాఖ సంప్రదింపులను నిర్వహించింది. కోవిషీల్డ్‌ ను అమెరికా సహా అన్ని దేశాలు కూడా అధికారికంగా గుర్తించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. బ్రిటన్ తీసుకున్న నిర్ణయాన్ని వివక్షతగా అభివర్ణించారు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిళ్లు ఫలించాయి. ఈ విషయంలో బ్రిటన్ మెత్తబడింది..మెట్టు దిగింది. తన ట్రావెల్ అడ్వైజరీని పునఃసమీక్షించింది. రివైజ్డ్ ట్రావెల్ అడ్వైజరీని తాజాగా జారీ చేసింది. కోవిషీల్డ్‌ను అధికారికంగా గుర్తించినట్లు తెలిపింది. కోవిషీల్డ్ తీసుకోని ఇండియా నుండి వచ్చే వారిపై ఎటువంటి నియమాలు ఉండవని బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది.