Begin typing your search above and press return to search.

ట్రంప్ గాలి.. థెరిస్సాకు సోకింది

By:  Tupaki Desk   |   22 March 2017 4:18 AM GMT
ట్రంప్ గాలి.. థెరిస్సాకు సోకింది
X
ఆర్నెల్లు సావాసం చేస్తే ఆడు.. ఈడు అవుతాడని ఊరికే అనలేదేమో. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతల్ని స్వీకరించిన ట్రంప్ పుణ్యమా అని.. ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముస్లింలపై తనకున్న అక్కసుకు.. ఉగ్రవాద బూచిని చూపిస్తూ.. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉంటున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. మొన్నటికి మొన్న ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించిన ట్రంప్ సర్కరు..తాజాగా ఎనిమిది ముస్లిం దేశాల నుంచి వచ్చే విమానాల క్యాబిన్ లోకి కెమేరాలు.. ల్యాప్ టాప్ లు.. ట్యాబ్ లు.. కిండల్స్ లాంటి వాటిని తీసుకొచ్చే విషయంపై నిషేదం విధించారు.

అమెరికాకు జాన్ జిగిరీ అయిన బ్రిటన్ సైతం.. తాజాగా ట్రంప్ బాటలో నడుస్తూ.. ఆరు ముస్లిం అధిక్య దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల క్యాబిన్ బ్యాగేజ్ పై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది.

ముస్లిం దేశాలకు చెందిన ప్రైవేటు విమానయాన సంస్థలతో పేలుడు పదార్థాలు తరలించే అవకాశం ఉందన్న ఆలోచనతో తాజా నిషేధాన్ని అమలు చేసినట్లుగా చెబుతున్నారు. తాజా ఆదేశాలతో ఈజిప్ట్ లోని కైరో.. దుబాయి.. యూఏఈ లోని అబుదాబీ.. టర్కీలోని ఇస్తాంబుల్.. ఖతార్ లోని దోమ.. జోర్డాన్ లోని అమ్మన్..కువైట్ సిటీ.. మొరాకో లోని కాసాబ్లాంకా..జెడ్డా.. సౌదీఅరేబియాలోని రియాద్ నగరాలకు చెందిన అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి వచ్చే ప్రయాణికులకు తాజా నిబంధనలు వర్తిస్తాయి.

తాజా నిర్ణయంతో వివిధ ముస్లిం దేశాల నుంచి వచ్చే 50కి పైగా విమానాల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. రానున్న 96గంటల్లో ఈ ఆదేశాల్నిఅమలు చేయనున్నారు. భద్రతాకారణాలతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ట్రంప్ సర్కారు చెప్పుకుంది. ఇదిలా ఉంటే.. అమెరికా విమానయాన సంస్థలకు ఈ నిబంధనల ప్రభావం పడదు. అమెరికా నిషేధం విధించిన కొద్ది గంటలకే బ్రిటన్ ప్రధాని థెరిస్సా కూడా ట్రంప్ బాటలో నడుస్తూ ఇదే తరహా నిర్ణయాన్ని తీసుకోవటం గమనార్హం.

టర్కీ.. లెబనాన్.. జోర్డాన్.. ఈజిఫ్టు.. ట్యునిసియా.. సౌదీఆరేబియాకు చెందిన 14 విమానయాన సంస్థలపై బ్రిటన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఆరు దేశాలకు చెందిన విమానయాన సంస్థల్లో ప్రయాణికుల ఎలక్ట్రానిక్ వస్తువుల్ని బ్యాగేజ్ రూపంలో విమానాల్లోకి అనుమతించరు. వీటిని ముందుగానే అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. అమెరికా బాటలోనే మరో అగ్రరాజ్యం నడవటంపై పలువురు విమర్శిస్తున్నారు. ట్రంప్ ఒక్కడు సరిపోనట్లు.. ఆయనకు తోడుగా థెరిస్సా కూడా ఆయన బాటలో నడుస్తున్నట్లుగా తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/