Begin typing your search above and press return to search.

సగం జీతమే ఎక్కువ అంటున్న ఎంపీ ..ఎవరంటే ?

By:  Tupaki Desk   |   23 Dec 2019 8:46 AM GMT
సగం జీతమే ఎక్కువ అంటున్న ఎంపీ ..ఎవరంటే ?
X
నదియా విటామ్.. బ్రిటన్ పార్లమెంటు లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీ. మొన్నటి ఎన్నికలకు ముందు ఆమె ఎవరో కూడా చాలా మందికి తెలియదు. కానీ , ఎన్నికల తరువాత ఇప్పుడు ఆమె పేరు మారుమోగిపోతుంది. తాజాగా ఆమె చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ ఆమె తీసుకున్న ఆ సంచలనమైన నిర్ణయం ఏమిటి అని అనుకుంటున్నారా ..సాధారణంగా రాజకీయ నేతలు వీలైన కాడికి నొక్కేసి తమకి , తమ పిల్లల , పిల్లల తరాలకి సరిపడేలా కూడబెడుతుంటారు. కానీ , ఈమె మాత్రం తనకి ఏడాదికి వచ్చే మొత్తం జీతం లో సగం జీతం నాకు చాలు అని చెప్పి అందరిని షాక్ కి గురైయ్యేలా చేసింది.

బ్రిటన్ పార్లమెంటు రూల్ ప్రకారం ఆమె జీతం..80 వేల పౌండ్ల (సుమారు రూ. 73.98 లక్షల) ..కానీ, తన వార్షిక వేతనంలో 35 వేల పౌండ్లు (సుమారు రూ.32.36 లక్షలు) మాత్రమే తీసుకుంటానని ప్రకటించారు. ఎందుకు అంటే బ్రిటన్ జాతీయ గణాంక కార్యాలయం లెక్కల ప్రకారం అక్కడ సగటు కార్మికుడి వేతనం ఏడాదికి 35 వేల పౌండ్లని.. కాబట్టి తానూ ఏడాదికి అంతే తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశానని ఆమె చెప్పారు. మిగతా మొత్తాన్ని తన నియోజకవర్గంలో నిధులు లేక ముందుకు సాగని పనుల పూర్తికి, ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు.

ఈ విషయంలో నేను దాతృత్వం చాటుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేయడం లేదని.. ఆర్థిక సంక్షోభం తరువాత కోతల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వరంగ ఉద్యోగులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారామె. 35000 పౌండ్లే తాను తీసుకుంటున్నాననంటే ఎంపీలు అంతకంటే ఎక్కువ జీతానికి అర్హులు కారని కాదని.. అయితే, టీచింగ్ అసిస్టెంట్లు, నర్సులు, ఫైర్ ఫైటర్లు వంటివారు ఇంతే పొందుతున్నారని అన్నారు. వారికి దక్కాల్సినంత వేతనం దక్కినప్పుడు తాను కూడా ఎక్కువ జీతం తీసుకుంటానని.. తన నిర్ణయం వేతనాల పై చర్చకు దారితీస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. ఆమె బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తరువాత సోషల్ మీడియాలో పెద్దసంఖ్యలో నెటిజనులు ఆమెను అభినందించారు. అయితే, తన జీతంలో అధిక భాగాన్ని వదులుకోవాలన్న ఆమె నిర్ణయం మాత్రం అందరినీ ఆకట్టుకోలేదు. కొందరు నేతల నుంచీ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, నదియా మాత్రం తాను తీసుకున్న నిర్ణయం ఎంపీల విలువను తగ్గించేదేమీ కాదని అన్నారు.