Begin typing your search above and press return to search.

తెలుగువారికి బ్రిటీష్ ఎయిర్ వేస్ అరుదైన గౌరవం

By:  Tupaki Desk   |   22 May 2022 12:31 PM GMT
తెలుగువారికి బ్రిటీష్ ఎయిర్ వేస్ అరుదైన గౌరవం
X
ఒకప్పుడు ప్రపంచమంతా తమ గుత్తాధిపత్యంతో చెలరేగిన బ్రిటీష్ వారు స్వాతంత్ర్యం ఇచ్చాక ఆ దోచుకున్న సంపదతో కోటీశ్వరులుగా ఎదిగారు. కానీ కాలం పెట్టిన పరీక్షలో చతికిలపడి ఇప్పుడు ఓ అభివృద్ధి చెందిన దేశంగా మిగిలారు. అమెరికాలో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించలేకపోయారు.

మనదేశాన్ని, మనల్ని అవమానించిన బ్రిటీష్ వారు ఇప్పుడు రూట్ మార్చారు. తాజాగా బ్రిటీష్ ఎయిర్ వేస్ శనివారం కీలక ప్రకటన చేసింది. తమ సంస్థ హైదరాబాద్-లండన్ సర్వీస్ కోసం 20 మంది తెలుగు మాట్లాడే క్యాబిన్ క్రూ సిబ్బందిని రిక్రూట్ చేసినట్లు తెలిపింది.

ఇటీవల కాలంలో విదేశీ విమానయాన సంస్థలు స్థానిక భాషలకు పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే బ్రిటీష్ ఎయిర్ వేస్ తెలుగు మాట్లాడే క్యాబిన్ క్రూ సిబ్బందిని నియమించుకుంది. వీరికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినట్టుగా పేర్కొంది. కొత్తగా రిక్రూట్ చేయబడిన 20 మంది క్యాబిన్ క్రూ సిబ్బందికి లండన్ లో ఆరువారాల పాటు విస్తృతమైన భద్రత, సేవా శిక్షణను ఇచ్చినట్టుగా బ్రిటీష్ ఎయిర్ వేస్ తెలిపింది.

హైదరాబాద్-లండన్ మార్గంలో ప్రయాణించే ప్రతి విమానంలో తెలుగు మాట్లాడే సిబ్బంది ఉంటారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి హైదరాబాద్ నుంచి లండన్ కు రాకపోకలు సాగించే బీఏ 276, బీఏ 277 విమానాలలో ప్రయాణికులు మాతృభాషలోనే పలకరింపులు అస్వాధించవచ్చు.

భారతదేశంలోని స్థానిక క్యాబిన్ సిబ్బందిని ఉపయోగించి హైదరాబాద్ నుంచి లండన్ కు తమ తొలి విమానాన్ని నడిపినట్లు బ్రిటీష్ ఎయిర్ వేస్ ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిటీష్ ఎయిర్ వేస్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కాలమ్ లామింగ్ మాట్లాడుతూ హైదరాబాద్ కు స్థానికంగా క్యాబిన్ సిబ్బందిని నియమించుకోవడం అంటే ప్రయాణికులకు బ్రిటీష్ శైలి సేవలను తెలుగు భాష, సంస్కృతి, ఆచారాలతో అందించడమేనని చెప్పారు.

బ్రిటీష్ ఎయిర్ వేస్ ప్రస్తుతం ఐదు భారతీయ నగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి లండన్ లోని హీత్రూ విమానాశ్రయానికి వారానికి 28 విమాన సర్వీసులను నడుపుతోంది.