Begin typing your search above and press return to search.

రేసులో వెనుకబడిన వేళ.. మనసు దోచుకునే మాట చెప్పిన మనోడు

By:  Tupaki Desk   |   11 Aug 2022 8:55 AM GMT
రేసులో వెనుకబడిన వేళ.. మనసు దోచుకునే మాట చెప్పిన మనోడు
X
రాజకీయం అంటే.. ఏం చేసైనా సరే అధికారాన్ని సొంతం చేసుకోవటం. అందుకోసం ఏం చేసినా తుది ఫలితం మాత్రం విజయం మీ పక్కన ఉండాలన్న దరిద్రపుగొట్టు థియరీ మన రాజకీయ నేతల్లోనూ.. రాజకీయ పార్టీల్లోనూ ఉంటుంది. అంతే తప్పించి.. గెలుపు కోసం అడ్డదిడ్డంగా వ్యవహరించకూడదన్న మాట మాత్రం చెప్పరు.

కానీ..మన రాజకీయ పార్టీలు.. నేతలు ఆలోచనలో పడేలా చేస్తున్నాడు మనోడు. ప్రస్తుతం బ్రిటన్ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిషి సునాక్ తన మాటలతో పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాడు. దేశ ప్రధాని పీఠం కోసం పోటీ పడుతున్న అతగాడు.. తన ప్రత్యర్థి కంటే రేసులో వెనుకబడి ఉండటం తెలిసిందే.

ఈ మధ్యన వెల్లడైన సర్వే రిపోర్టల ప్రకారం చూస్తే.. రిషికి 10 శాతం మాత్రమే విజయ అవకాశాలు ఉంటే.. అతడి ప్రత్యర్థి లిజ్ ట్రస్ ఏకంగా 90 శాతం విజయవకాశాలతో ఉండటం తెలిసిందే. ఇలాంటివేళ.. స్థైర్యం సడలకుండా.. గెలుపు కోసం అడ్డదిడ్డంగా మాట్లాడకపోవటమే కాదు.. విజయానికి అవకశం ఇస్తే భారీ హామీల్ని ఇవ్వటానికి అతడు ససేమిరా అంటున్నాడు. ప్రజలను ఆకట్టుకునేందుకు వీలుగా స్థాయికి మించిన హామీల్ని ఇచ్చేందుకు నో చెబుతున్నాడు.

తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తప్పుడు వాగ్దానాల్ని ఇచ్చి గెలిచే కన్నా.. ఓడిపోవటం మేలుగా పేర్కొన్నారు. జీవన వ్యయాలు పెరగటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కుటుంబాలను ఆదుకోవటానికి తాను కట్టుబడి ఉంటానని చెబుతన్నాడు. తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ ఇచ్చిన హామీలో ముఖ్యమైన.. పన్నుల్లో కోతలు విధిస్తానన్న హామీ కారణంగా ధనవంతులకే మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదే విషయాన్ని అతను ప్రస్తావిస్తూ.. 'ఇలాంటి తప్పుడు హామీలతో గెలిచే కన్నా ఓడితేనే మేలు. ప్రజల డబ్బు తీసుకోకుండా ఉండేందుకు నేను ప్రాధాన్యత ఇస్తా' అని పేర్కొన్నారు. కొవిడ్ వేళ బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తాను తీసుకున్న నిర్ణయాలను అతను మరోసారి ప్రస్తావిస్తూ.. తాను తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు తీర్పుఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడితే.. ఇప్పుడు చెప్పిన దానికంటే కూడా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటానని హామీ ఇవ్వటం గమనార్హం.

సాధారణంగా మన రాజకీయ నేతలు చేసే వాటి కంటే చెప్పేవి ఎక్కువగా ఉంటాయి. అందుకు భిన్నంగా రిషి మాత్రం చేసే దానితో పోలిస్తే.. చెప్పేవి కాస్త తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం చూస్తే.. మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలన్నది అతడి ఉద్దేశంలా కనిపిస్తోంది. మరి.. తుది పోరులో ఫలితం ఎలా వస్తుందో చూడాలి. రిషి మాటల్ని చూసిన మన రాజకీయ పార్టీలు.. అధినేతలు.. నేతలు కాస్తంతైనా సిగ్గు తెచ్చుకుంటే బాగుంటుంది కదూ?