Begin typing your search above and press return to search.

బోరిస్ పదవికి మూడినట్లేనా ?

By:  Tupaki Desk   |   15 Jan 2022 11:30 AM GMT
బోరిస్ పదవికి మూడినట్లేనా ?
X
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చిక్కుల్లో పడ్డారు. ప్రధానమంత్రి పదవికి మూడినట్లే అని అర్ధమైపోతోంది. గడచిన ఏడాదిన్నరలో జరిగిన రెండు ఘటనలే ఆయన పదవికి ముప్పు తెస్తోంది. ఇంతకీ ఆ రెండు ఘటనలు ఏమిటంటే కరోనా వైరస్ దేశమంతా కబళించేస్తుంటే బోరిస్ తన కార్యాలయం సిబ్బందితో విందు వినోదాల్లో మునిగిపోయారట. ఇక రెండో ఘటన ఏమిటంటే బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త ఫిలిప్ మరణించినపుడు కూడా బోరిస్ కార్యాలయ సిబ్బంది పార్టీల్లో మునిగి తేలారట.

రాణి భర్త ఫిలిప్ చనిపోయినపుడు దేశమంతా సంతాప దినాల్లో మునిగిపోయింది. అదే సమయంలో బోరిస్ మాత్రం తన కార్యాలయ సిబ్బందితో మందు పార్టీ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారంటూ ప్రముఖ మీడియా సంస్ధ డైలీ టెలిగ్రాఫ్ బయటపెట్టింది. ఈ రెండు ఘటలను అధికార, ప్రతిపక్షాలు బాగా సీరియస్ గా తీసుకున్నాయి. పై రెండు ఘటనలకే ప్రధానమంత్రి పదవికి బోరిస్ రాజీనామా చేసేయాల్సిందేనా అని మనకు ఆశ్చర్యంగా ఉండచ్చు. ఎందుకంటే మన నేతలు తమ పదవులకు రాజీనామాలు చేయటం మనం ఊహించలేము కాబట్టి.

కానీ విదేశాల్లో అందులోను బ్రిటన్ లాంటి దేశాల్లో ఇలాంటివి చాలా సీరియస్ గా తీసుకుంటారు. కరోనా వైరస్ కాలంలో పార్టీ చేసుకోవటం కన్నా సంతాప దినాల్లో పార్టీలో ముణిగితేలటం మాత్రం బ్రిటన్లో బాగా సీరియస్ వ్యవహారమే. బయట వాళ్ళకు ఈ విషయంలో తీవ్రత తెలియకపోవచ్చు కానీ బోరిస్ తెలీకుండా ఉంటుందని అనుకునేందుకు లేదు. తెలిసి కూడా తన సిబ్బందితో సంతాపదినాల్లో పార్టీ ఎలా చేసుకున్నారో అర్ధం కావటంలేదు.

బ్రిటన్ లో ఉన్నది ప్రజాప్రభుత్వమే అయినా రాచరికానికి కూడా వాళ్ళు అత్యంత ప్రాధాన్యతిస్తారు. కాబట్టే అక్కడ రెండు రకాల వ్యవస్ధలు నడుస్తున్నాయి. మరి ఈ విషయం తెలిసి కూడా బోరిస్ తప్పుచేశారంటే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. పైగా ఈ ఘటనలను పాలక, ప్రతిపక్ష ఎంపీలందరు తప్పు పడుతున్నారు. కాబట్టే తొందరలోనే రాజీనామా చేయకతప్పదంటున్నారు. బోరిస్ గనుక రాజీనామా చేస్తే భారత సంతతి వ్యక్తి, ప్రస్తుత ఆర్ధికశాఖ మంత్రి రిషి సునాక్ ప్రధానమంత్రి అయ్యే అవకాశముంది.