Begin typing your search above and press return to search.

ఆ దేశ ప్రధాని రేసులో మనోడు వెనుకంజ.. అనుకోనిది ఏదైనా జరిగితే మాత్రం?

By:  Tupaki Desk   |   2 Sep 2022 12:30 PM GMT
ఆ దేశ ప్రధాని రేసులో మనోడు వెనుకంజ.. అనుకోనిది ఏదైనా జరిగితే మాత్రం?
X
వందల ఏళ్ల పాటు భారత్ ను పాలించిన బ్రిటీష్ దేశానికి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి అయితే? అసలు ఆ అవకాశం ఉందా? అన్న మాట నాలుగేళ్ల ముందు అయితే ఉండేది. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నంగా భారతీయ మూలాలు ఉన్న రిషి సునక్ ప్రధాని రేసులోకి వచ్చేయటమే కాదు.. ముఖాముఖి పోటీ వరకు వచ్చేశారు. తాజాగా జరిగే ఓటింగ్ లో తుది ఫలితం తేలనుంది. బ్రిటన్ కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రానికి పోలింగ్ నాటికి ముగియనుంది. దాదాపు 2 లక్షల మంది సభ్యులున్న టోరీలు ఈ ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంది. ఆగస్టు నుంచి పోస్టల్.. ఆన్ లైన్ విధానంలో పోలింగ్ సాగుతోంది.

పోలింగ్ సమయం ముగియటానికి కొన్ని గంటల ముందు.. విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపై అంచనాలు బయటకు వచ్చాయి. ప్రధాని పదవి కోసం మనోడు రిషితో పాటు లిజ్ ట్రస్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా వెల్లడైన అంచనాల ప్రకారం ఇరువురు అభ్యర్థులు తమ ప్రచారాన్ని పూర్తి చేసే సమయానికి రిషి కాస్తంత వెనుకంజలో ఉంటే.. లిజ్ ట్రస్ ముందు ఉన్నారు. విజేతను బ్రిటన్ రాణి ఎలిజబెత్ ప్రకటిస్తారు.

అయితే.. తుది పోలింగ్ లో ఏదైనా అనుకోని పరిణామం చోటు చేసుకుంటే తప్పించి.. మనోడి గెలుపు అవకాశాలు తక్కువన్న మాట వినిపిస్తోంది. ఇక.. బ్రిటన్ ప్రధాని పదవిని చేజిక్కించుకున్న వారికి సమస్యలు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడా దేశంలో ద్రవ్యోల్బణం పెరగటంతో పాటు ప్రజల ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇవన్నీ చాలన్నట్లు రష్యా - ఉక్రెయిన్ మధ్య నడుస్తున్న యుద్ధం కూడా తోడు కావటంతో చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్న సంగతి తెలిసిందే.

తాను పవర్లోకి వస్తే ప్రజల మీద ఉన్న పన్నుల్ని పెద్ద ఎత్తున తగ్గిస్తానంటూ లిజ్ ట్రస్ ఇప్పటికే హామీ ఇచ్చారు. కొత్తగా ప్రధాని పదవిని సొంతం చేసుకునే వారి పాలన ఆధారంగా కన్జర్వేటివ్ పార్టీ 2025 ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న అంచనాలు లిజ్ ట్రస్ కు అనుకూలంగా ఉన్నాయనే చెప్పాలి. అలా అని రిషికి అవకాశాలు లేవని చెప్పలేం కానీ.. కాస్తంత తక్కువన్న మాట వినిపిస్తోంది. సోమవారం తుది ఫలితం వెలువడనుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.