Begin typing your search above and press return to search.

ఇంకెంత కాలం?; ప్రధమ పౌరుడి రాజసం

By:  Tupaki Desk   |   30 Jan 2016 5:30 PM GMT
ఇంకెంత కాలం?; ప్రధమ పౌరుడి రాజసం
X
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిపోయాయి. బ్రిటీషోడు వదిలేసి వెళ్లిన చట్టాలు.. వాటి పద్ధతులు నేటికీ కొనసాగుతున్నాయి. దేశాన్ని ఎలా నడిపించుకోవాలో చెప్పుకుంటూ ప్రపంచంలోనే అత్యుత్తమ.. అతి పెద్ద రాజ్యాంగం రాసుకున్నామని గొప్పలు చెప్పుకునే నేతలు.. కాలం చెల్లిన బ్రిటీష్ చట్టాల్ని నేటికీ ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కాదు. చట్టాలే కాదు.. చాలా పద్ధతుల్ని ఇప్పటికీ పాటిస్తున్నారు.

ఆగస్టు 15.. జనవరి 26 న అన్నిరాష్ట్రాల్లోని గవర్నర్లు.. రాష్ట్రపతి భవన్ లో ‘‘ఎట్ హౌస్’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఎందుకు? అనే దానికి చెప్పే సమాధానం సంతృప్తికరంగా ఉండదు. దేశంలోని ప్రతి జిల్లాలోనూ ఇదే తీరులో జిల్లాకలెక్టర్ నేతృత్వంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా జరిగే తంతు ఏమిటంటే.. జిల్లా కలెక్టర్ మొదలుకొని.. రాష్ట్రపతి వరకూ రాజకీయ ప్రముఖులు.. వివిధ రంగాలకు చెందిన వారిని.. పరిచయస్తుల్ని తమ నివాసానికి పిలిపించి.. భారీ విందును నిర్వహిస్తారు. అంతకు మించి మరెలాంటి కార్యక్రమం ఉండదు. ఈ కార్యక్రమం పూర్తి అయ్యాక పారేసే ఆహారపదార్థాలు భారీగా ఉంటాయి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇప్పటికి పేదరికం రక్కసి నుంచి బయటపడని భారతానికి.. ఇంత విలాసవంతమైన విందులు అవసరమా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పేటోళ్లు కనిపించరు.

ఇదొక్కటే కాదు.. సంప్రదాయం పేరిట ఇలాంటి ఖర్చులు చాలానే జరుగుతుంటాయి. ఇదంతా దేనికి? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఈ ఖర్చుకు సంబంధించిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ప్రాధమిక ప్రశ్న వేసుకుంటే.. ప్రజలు కట్టే పన్నుల నుంచి అన్నదే చెప్పాలి. అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటున్న మన దేశంలో ఈ రోజుకి తాగేందుకు స్వచ్ఛమైన నీరు.. పీల్చేందుకు గాలి.. ప్రయాణానికి అనువైన రోడ్లు.. అంతదాకా ఎందుకు టిక్కెట్టు కొంటాం బాబు.. అవసరమైనన్ని రైళ్లు వేయండి బాబు అని నెత్తినోరు కొట్టుకున్నా కల్పించలేని పాలకులు.. అందుకు భిన్నంగా రాజసం తొణికిసలాడే విందులు అవసరమా? ఇలాంటి వాటికి పెట్టే ఖర్చుల్ని ఏదో ఒక కార్యక్రమానికి నిర్వహిస్తే మార్పు ఎంతోకొంత అవుతుంది కదా?

తాజాగా.. రాష్ట్రపతి వినియోగించే గుర్రపు బగ్గీ ఏడాది విరామం తర్వాత బయటకు రావటాన్ని మీడియాలో ప్రముఖంగా చూపించేశారు. గణతంత్ర వేడుకల ముగింపు కార్యక్రమంలో భాగంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. రాజసం ఉట్టిపడే బగ్గీలో ప్రయాణించి సందర్శించి సందడి చేశారు. భద్రతలో భాగంగా మూడు దశాబ్దాల నుంచి వినియోగించని బగ్గీ వినియోగాన్ని 2014 నుంచి మొదలెట్టారు. ఆ తర్వాత మళ్లీ భద్రతలో భాగంగా వినియోగించలేదు. తాజాగా మరోసారి ఆయనీ బగ్గీని వినియోగించారు. రాజసం ఉట్టిపడే విషయాలకు ప్రాధాన్యత ఇచ్చే కన్నా.. సింఫుల్ గా ఉండే అంశాల మీద దృష్టి పెట్టి సరికొత్త సంప్రదాయాల్ని నెలకొల్పొచ్చు కదా? అలా ఎందుకు చేయరు?