Begin typing your search above and press return to search.
మధ్యవేలు చూపించి జైల్లో ఇరుక్కున్నాడుగా!
By: Tupaki Desk | 21 Sept 2017 2:57 PM ISTకొందరిని కించపరిచేందుకు - అవహేళన చేసేందుకు వివిధ దేశాల్లో కొన్ని అసభ్యకరమైన సంజ్ఞలు పాటిస్తూ ఉంటారు!! ఇలాంటిదే మధ్య వేలు చూపించడం! ఇలాంటివి అక్కడ సర్వసాధారణమే! వీటిని అంతగా పట్టించుకోకుండా.. చాలా సింపుల్ గా తీసుకుంటారు. తమ దేశంలో చేసినట్టు ఇతర దేశాల్లోనూ అలా చూపిస్తే ఎవరైనా ఊరుకుంటారా?! అందులో నూ సంప్రదాయాలకు పెద్దపీట వేసి, వాటిని కఠినంగా అమలుచేసే అరబ్ దేశాల్లో ఇలాంటివి చేస్తే ఇంకేమైనా ఉందా? మరి తెలిసి చేశాడో తెలియక చేశాడో గాని.. ఒక బ్రిటిష్ టూరిస్టు అలా మధ్యవేలు చూపించి.. కటకటాల్లో ఇరుకున్నాడు. తొలిసారి తప్పించుకున్నా.. రెండోసారి మాత్రం పోలీసులకు దొరికపోయాడు!!
లెయిసెస్టర్ నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీ యాజమాని అయిన జమీల్ ముక్దుమ్(23).. ఈ ఫిబ్రవరిలో తన భార్యతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లాడు. ఆ సందర్భంలో రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి మోటర్ బైక్ పై జమీల్ కారు పక్కగా దూసుకెళ్లాడు. దీంతో ముక్దుమ్ అతనికి మధ్య వేలు సైగ చేశాడు. ఈ విషయంపై మోటర్ బైకిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే ముక్దుమ్ దేశం విడిచి వెళ్లిపోయాడు. అయితే తిరిగి గత వారం మళ్లీ దుబాయ్ కి వచ్చాడు. అయితే వెంటనే పోలీసులు అతడిని అరెస్టు చేసి ఆరునెలలు జైలుకు పంపించారు. చివరకు బెయిల్ పై రిలీజ్ అయిన ముక్దుమ్ ఘటనపై స్పందించాడు.
`నేనేం మహా పాపం చేయలేదు. ఇలాంటివి తరచూ ఇంగ్లాండ్ రోడ్లపై కనిపిస్తుంటాయి. ఆ మాత్రానికే జైలుకు పంపుతారా?` అంటూ ప్రశ్నిస్తున్నాడు. పైగా రేపిస్టులు - మర్డర్ చేసిన వారి సెల్ లో తనను ఉంచారని అతను వాపోయాడు. ట్రాఫిక్ ప్రయాణాల్లో ప్రయాణికులు విసుగు చెంది ఇలా వ్యవహరించటం సాధారణమే అయినా.. దుబాయ్ చట్టప్రకారం అలా అవమానించటం తీవ్ర నేరమేనని ముక్దుమ్ తరపున న్యాయవాది తెలిపారు. సరిగ్గా ఆరేళ్ల క్రితం జోసెఫ్ అనే యూకే వైద్యుడిని కూడా ఇలాంటి సంఘటనపైనే పోలీసులు అరెస్ట్ చేశారు.