Begin typing your search above and press return to search.

చైనాలో భారతీయ వైద్యుడికి కాంస్య విగ్రహం !

By:  Tupaki Desk   |   29 Aug 2020 1:00 PM GMT
చైనాలో భారతీయ వైద్యుడికి కాంస్య విగ్రహం !
X
అసలే భారత్ చైనా మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంది. గల్వనా లోయ ఘటన తరువాత ఇండియా చైనా పై డిజిటిల్ స్ట్రైక్ చేయడం ప్రారంభించింది. ఇటువంటి తరుణంలో చైనాలో భార‌తీయ వైద్యుడి విగ్ర‌హం పెట్టడం ఏంటి , మీ పిచ్చి కాకపోతే అని అనుకుంటున్నారా? మీరు అనుకునే దాంట్లో తప్పులేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా అదే ఊహిస్తారు .. కానీ , విగ్రహం ఏర్పాటు చేయడం అబద్దం కాదు, నిజంగానే అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. రెండో ప్రపంచయుద్ధకాలంలో చైనాలో వైద్య‌సేవ‌లు అందించిన గొప్ప వైద్యుడు ద్వారకానాథ్‌ కోట్నిస్‌. చైనా దేశంలో ఆయ‌న‌కు విశేష‌మైన గౌర‌వం ఉంది.

ఈ నేపథ్యంలోనే ద్వారకానాథ్‌ కోట్నిస్‌ కాంస్య విగ్రహాన్ని వచ్చే నెలలో షిజియాజువాంగ్‌ నగరంలోని ఒక మెడికల్‌ కాలేజీ ఎదుట ఏర్పాటు చేయాలని చైనా అధికారులు నిర్ణయించారు. ద్వారకానాథ్‌ స్వస్థలం మహారాష్ట్రలోని షోలాపూర్‌. చైనా విప్లవం సమయంలో జపాన్‌ దురాక్రమణపై పోరాడుతున్న ఆ దేశ కమ్యూనిస్టుపార్టీ సైన్యానికి వైద్యసాయం అందించడానికి నాటి మన జాతీయనేతలు ఒక వైద్యబృందాన్ని పంపారు. ఆ బృందంలో కోట్నిస్‌ కూడా ఉన్నారు. 1938లో చైనాకు వెళ్లిన కోట్నిస్‌ 1942లో మరణించేవరకూ అక్కడే ఉన్నారు. చైనా యువతిని పెండ్లి చేసుకున్నారు. మరణించేనాటికి ఆయన వయస్సు 32 ఏళ్లు మాత్రమే. చైనాలో కోట్నిస్‌కు విశేషమైన గౌరవం ఉంది.