Begin typing your search above and press return to search.

అట్టహాసంగా పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు !

By:  Tupaki Desk   |   28 Jun 2021 11:30 AM GMT
అట్టహాసంగా పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు !
X
మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు దేశానికి అందించిన మహోన్నతమైన సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, రాబోయే తరాలకి చిరస్మరణీయంగా నిలిచే విధంగా పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను గత ఏడాదికాలంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. విద్యావేత్తగా, సాహితీవేత్తగా సాహితీరంగంలో విశేష కృషి చేసిన పీవీ నరసింహారావుకి నివాళిగా మహోన్నత మూర్తిమత్వం ఉన్న పీవీగారి రాసిన పుస్తకాల్ని ఆవిష్కరించాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పీవీ వ్యక్తిత్వాన్ని, రాజనీతిని, పాలన దక్షతను, ఆర్థిక సంస్కరణలలో వారి కృషిని 360 డిగ్రీలలో ఆవిష్కరించడమే ప్రధాన లక్ష్యమని ప్రకటించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు ''పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ''ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ గ్రంధాల ప్రచురణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీలకు అప్పగించింది. అలా ఇప్పుడు మొత్తం 9 పుస్తకాలను ప్రచురించారు. వాటిలో పీవీ రాసినవి 4 పుస్తకాలు కాగా, మిగతావి ఆయన కృషిని, జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు కావడం విశేషం. ఈ పుస్తకాలను నేడు జూన్ 28న పీవీ జ్ఞానభూమిలో జరిగిన పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళసై సౌందర రాజన్ గారు, ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరణ చేశారు. శత జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పీవీ కాంస్య విగ్ర‌హాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ లో ఇప్పటివరకూ ఎన్నో భారీ విగ్రహాలుండగా తొలిసారి అధునాతన లేజర్‌ సాంకేతికత వినియోగించారు. అమెరికా నుంచి తెప్పించిన సీఎన్ సీ యంత్రం ద్వారా పీవీ ముఖాన్ని అచ్చు గుద్దినట్లు సిద్ధం చేశారు. దాదాపు రూ. 27 లక్షలు వెచ్చించి15 మంది కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడి 17 రోజుల్లో దీనిని తీర్చిదిద్దారు. పీవీ విగ్రహం కొలువుదీరిన నెక్లెస్‌ రోడ్‌ కూడలి తో పాటు జ్ఞాన భూమిని అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా పీవీ కాంస్య విగ్రహాన్ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, సీఎం కేసీఆర్ ఆవిష్క‌రించారు. పీవీ శ‌త జ‌యంతి ముగింపు ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆయ‌న విగ్ర‌హానికి గ‌వ‌ర్న‌ర్, సీఎం కేసీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. అంతకు ముందు పీవీ మార్గ్‌ ను గ‌వ‌ర్న‌ర్ ప్రారంభించారు.

పీవీ మార్గ్‌ లోని జ్ఞాన‌భూమిలో శ‌త‌జ‌యంతి ముగింపు ఉత్స‌వాలు జరిగాయి. పీవీ మార్గ్‌ లోని జ్ఞాన‌భూమిలో ఏర్పాటు చేసిన పీవీ శ‌త జ‌యంతి ముగింపు ఉత్స‌వాల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి, బహుభాషా కోవిదులు పీవీ న‌ర‌సింహారావు శ‌త జ‌యంతి ఉత్స‌వాలు నేటితో సుసంప‌న్న‌మ‌వుతున్నాయి అని సీఎం కేసీఆర్. విదేశాల్లో పీవీ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించిన మ‌హేశ్ బిగాల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు సీఎం కేసీఆర్. విద్యా సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా గురుకుల‌, న‌వోద‌య పాఠ‌శాల‌ల‌ను పీవీ న‌ర‌సింహారావు తీసుకొచ్చారు అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. పీవీ చేప‌ట్టిన భూ సంస్క‌ర‌ణ‌లు భార‌త‌దేశంలో ఇత‌ర రాష్ట్రాలు మార్గ‌ద‌ర్శ‌కంగా తీసుకున్నాయని గుర్తు చేశారు. నేడు ఆవిష్క‌రించిన పీవీ విగ్ర‌హాన్ని చూస్తుంటే క‌డుపు నిండిపోయింది అని సీఎం అన్నారు. ఈ ర‌హ‌దారికి పీవీ మార్గ్ అని నామ‌క‌ర‌ణం చేయ‌డం సంతోషంగా ఉందన్నారు. భ‌విష్య‌త్‌లో అనేక ప‌థ‌కాల‌కు పీవీ పేరు పెట్టుకుంటామ‌ని చెప్పారు.

పీవీ న‌ర‌సింహారావు ర‌చ‌న‌లు
1. Influence of Indias Culture on the West and other Speeches : ప‌శ్చిమ దేశాల‌పై భార‌త సంస్కృతి ప్ర‌భావంపై పీవీ న‌ర‌సింహారావు గారి ప్ర‌సంగాల సంక‌ల‌నం.
2. The Granny & Other Stories : పీవీ న‌ర‌సింహారావు గారు రాసిన 8 అరుదైన క‌థ‌ల సంక‌ల‌నం.
3. The Meaning of Secularism and other Essays : పీవీ న‌ర‌సింహారావు గారు వివిధ సంద‌ర్భాల‌లో రాసిన వ్యాసాల సంక‌ల‌నం.
4. Thus Spake PV – Interviews with PV Narasimha Rao : పీవీ న‌ర‌సింహారావు గారిని వేర్వేరు మీడియా ప్ర‌తినిధులు చేసిన ఇంట‌ర్వ్యూల సంక‌ల‌నం.

పీవీ గారిపై ఇత‌ర పుస్త‌కాలు
5. PV Narasimha Rao – Architect of India Reforms : పీవీ న‌ర‌సింహారావు చేసిన ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌పై, ఆయ‌న పాల‌నా రీతుల‌పై దేశ‌, విదేశాల‌కు చెందిన అగ్ర నాయ‌కులు రాసిన వ్యాసాల సంక‌ల‌నం. ఈ కాఫీ టేబుల్ బుక్‌కు ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు సంజ‌య బారు సంపాద‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు.
6. Legend in Lines : పీవీ న‌ర‌సింహారావు గారు స్ఫూర్తిగా దాదాపు 125కు పైగా అంత‌ర్జాతీయ‌, జాతీయ‌, రాష్ట్ర కార్టూనిస్టులు వేసిన క్యారికేఛ‌ర్‌ల సంక‌ల‌నం.
7. Chanakya : పీవీ న‌ర‌సింహారావు గారి జీవిత చ‌రిత్ర‌పై వెలిజాల చంద్ర‌శేఖ‌ర్ రాసిన పుస్త‌కం.
8. న‌మ‌స్తే పీవీ : పీవీ న‌ర‌సింహారావు గారి గురించి న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిలో ప్ర‌చురించిన వ్యాసాల సంక‌ల‌నం.
9. కాలాతీతుడు : పీవీ న‌ర‌సింహారావు గారి జీవితం స్ఫూర్తితో 143 మంది క‌వుల క‌వితా సంక‌ల‌నం