Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద `వాళ్ల‌` అసంతృప్తి.. బ్ర‌ద‌ర్ అనిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   8 March 2022 6:39 AM GMT
జ‌గ‌న్ ప్ర‌భుత్వం మీద `వాళ్ల‌` అసంతృప్తి.. బ్ర‌ద‌ర్ అనిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఏపీ సీఎం జ‌గ‌న్ బావ‌మ‌రిది.. దివంగ‌త‌ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అల్లుడు.. బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌.. ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు ఆవేదనతో ఉన్నారని సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు.

నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌ని చెప్పిన ఆయ‌న వ‌చ్చే 2024 ఎన్నిక‌లను దృష్టిలో పెట్టుకుని రాజ‌కీయంగా చ‌క్రం తిప్ప‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో తాజాగా చేసిన వ్యాఖ్య‌లు.. త్వ‌ర‌లోనే ఆయ‌న తీసుకునే నిర్ణ‌యం.. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని, పార్టీని కూడా తీవ్ర‌స్థాయిలో ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. పెద్ద‌గా క‌నిపించ‌ని బ్ర‌ద‌ర్‌ అనిల్‌... కొన్ని రోజుల కింద‌ట రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఇంటికి వెళ్లారు. ఈ క్ర‌మంలోనే అనిల్ చుట్టూ.. రాజ‌కీయాలు అల్లుకున్నాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న కూడా రాజ‌కీయ అరంగేట్రం చేస్తార‌ని.. తెలంగాణ‌లో ఆయ‌న భార్య పార్టీ పెడితే.. ఏపీలో ఆయ‌న పార్టీ పెట్టే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

ఇప్పుడు తాజాగా ఆయ‌న విజయవాడలోని ఓ హోటల్‌లో బీసీ, మైనారిటీ, క్రిస్టియన్‌ సంఘాల ప్రతినిధులతో సమావేశమై.. సీఎం జ‌గ‌న్ కేంద్రంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ సమావేశం జరిగినట్లుగా మేధావులు భావిస్తున్నారు. ఈ సమావేశంలోనే బ్రదర్ అనిల్ పార్టీ పెట్టబోతున్నానని చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. బ్రదర్ అనిల్ మాత్రం అలాంటిదేం లేదని.. ఏదైనా ఉంటే తాను చెబుతానని ప్రకటించారు.

పార్టీ పెడతారా.. లేకపోతే పార్టీ పెడతామనే సంకేతాలను ఎవరికైనా పంపి లెక్కలు సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారా అన్నది ఆస‌క్తిగా మారింది. ఇదిలావుంటే, బ్రదర్ అనిల్ ఈ సమావేశం సంద‌ర్భంగా ఓ సందేశాన్ని ఘాటుగానే బ‌య‌ట‌కు పంపార‌ని అంటున్నారు మేధావులు.

త‌మ‌ సమస్యలు పరిష్కరిస్తారని 2019 ఎన్నిక‌ల్లో క్రైస్త‌వులు.. జగన్‌కు ఓటేశార‌ని.. కానీ.. ఆయనతో మాట్లాడేందుకు అనుమతి కూడా అవ‌కాశం దొరకట్లేదని బ్ర‌ద‌ర్ అనిల్ అన్న‌ట్టు తెలిసింది. అంతేకాదు.. ``వైఎస్ జగన్ కోసం.. పని చేసిన.. ప్రచారం చేసిన.. ప్రార్థనలు చేసిన క్రైస్తవువులెవరికీ మేలు జరగడం లేదు.

ఒక్కసారి మాత్రం రూ. ఐదు వేలు ఇచ్చి ఊరుకున్నారు. తర్వాత ఇవ్వడం లేదు. కనీసం కలిసేందుకూ అవకాశం ఇవ్వడం లేదు. ఎప్పుడూ త‌న‌ను పొగిడేవారికి కొంత మందిని వెంట‌బెట్టుకుని, మిగతా వారిని ప‌క్క‌న పెట్టారు. క్రైస్తవులు ఆర్థికంగా చితికిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదే సమయంలో వైసీపీ కోసం సొంతంగా ఖర్చు పెట్టుకుని పని చేసిన వారికీ ప్రతిఫలం లేకుండా పోయింది`` అని బ్ర‌ద‌ర్ వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.

ఇక‌, ఈ సమావేశానికి హాజరైన బీసీ సంఘం నేత శొంఠి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చించేందుకు అనిల్‌ను కలిశామన్న నాగరాజు.. త్వరలోనే తమకు శుభవార్త చెబుతామని బ్రదర్ అనిల్ చెప్పారని తెలిపారు. మ‌రోవైపు "సమస్యలు పరిష్కరిస్తారని జగన్‌కు ఓటేశాం.

సీఎంతో మాట్లాడేందుకు అనుమతి కూడా దొరకట్లేదు. సమస్యలపై చర్చించేందుకు అనిల్‌ను కలిశాం. బ్రదర్‌ అనిల్‌ చెబితేనే ఎన్నికల్లో ఓట్లు వేశాం, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కావాలని ఆయన్ను కోరాం. మా సమస్యలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.`` అని బీసీ సంక్షేమ సంఘం నేత నాగరాజు అన్నారు.

మ‌రోవైపు అనిల్ కూడా.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో తాను చేసిన తెర‌చాటు ఎన్నిక‌ల ప్ర‌చారం కార‌ణంగానే జ‌గ‌న్ అదికారంలోకి వ‌చ్చార‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు కూడా జ‌గ‌న్ క‌నీసం అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌నే ఆవేద‌న ఆయ‌న‌లో క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.