Begin typing your search above and press return to search.

సోద‌రిపై అత్యాచారం.. క్రైమ్‌ లో ప‌రాకాష్ట‌!

By:  Tupaki Desk   |   18 Sep 2017 5:14 AM GMT
సోద‌రిపై అత్యాచారం.. క్రైమ్‌ లో ప‌రాకాష్ట‌!
X
చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి తీసేసుకోవ‌డం ఇప్పుడు సాధార‌ణ‌మై పోయింది! కేసులు - పోలీస్ స్టేష‌న్లు - కోర్టులు - లాయ‌ర్లు అని ఆలోచిస్తూ కూర్చుంటే త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌ని, జ‌రిగినా కాలం గ‌డిచిపోయి.. ఏళ్ల‌కు ఏళ్లు ప‌డుతుంద‌ని భావిస్తున్నారో ఏమో బాధితులు.. కొన్ని నేరాల‌కు తామే శిక్ష‌లు వేసేస్తున్నారు. ఈ విష‌యంలో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అన్న తేడా లేకుండా దేశ‌వ్యాప్తంగా ఇదే ఆన‌వాయితీగా మారిపోతోంది. ఏపీలో రెండు రోజుల కింద‌ట భార్య వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌ని భావించిన భ‌ర్త ఆమెను త‌మ‌ బిడ్డ‌తో స‌హా న‌రికేయ‌డమే కాకుండా తాను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌లో స‌ద‌రు భ‌ర్త చ‌ట్ట ప్ర‌కార‌మో.. లేదా కుటుంబ పెద్ద‌ల‌తోనో సంప్ర‌దించి ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొని ఉంటే ప‌రిస్థితి వేరేలా ఉండేది.

కానీ, క్ష‌ణికావేశం - చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసేసుకోవ‌డం వంటి ప‌రిణామాలు జీవితాల‌ను స‌ర్వ‌నాశనం చేసేస్తున్నాయి. ఇప్ప‌డు ఇలాంటి ఘ‌ట‌న‌ను మించిన ఘోరం ఒక‌టి బెంగ‌ళూరులో చోటు చేసుకుంది. త‌మ సోద‌రిని బ‌లాత్కారం చేసి.. గ‌ర్భం తెప్పించాడ‌ని భావించిన ఆమె అన్న‌ద‌మ్ములు విచ‌క్ష‌ణ మ‌రిచిపోయారు. త‌మ క‌సిని - ప్ర‌తీకారాన్నీ క్ష‌ణాల్లోనే అమ‌ల్లో పెట్టి.. ఘోరానికి పాల్ప‌డ్డారు. సోద‌రిని గ‌ర్భ‌వ‌తిని చేసిన యువ‌కుడిని నిల‌వునా చంపేయ‌డ‌మే కాకుండా.. అత‌ని త‌ల న‌రికి దేహం నుంచి వేరు చేశారు. అంత‌టితో కూడా ఆగ‌కుండా అత‌ని పురుషాంగాన్ని కూడా కోసేసి.. క‌సి తీర్చుకున్నారు. నేరాల్లో ఇంత‌టి ఘోరం ఉంటుందా? అనిపించేలా వ్య‌వ‌హ‌రించిన ఘ‌ట‌న తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది.

వివ‌రాల్లోకి వెళితే.. ఒడిసాకు చెందిన గాంధీ జె.రాయ్‌ (19) - మధు జె.రాయ్‌ (21)లు ఉపాధి వెతుక్కుంటూ.. బెంగ‌ళూరు వెళ్లారు. అక్క‌డి ఓ వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌నికి కుదిరారు. ఇంత‌లో వారి సోద‌రి కూడా ఉపాధి నిమిత్తం వీరితో జ‌త‌క‌లిసింది. వీరంతా క‌లిసి ఒకే ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేస్తున్నారు. అయితే కొంత‌కాలానికి ఒడిసాలో వీరి నివ‌సించిన ప్రాంతానికే చెందిన బిరాంచి మాంజీ అనే మ‌రో యువ‌కుడు కూడా ఉపాధి వెతుక్కుంటూ వీరు ప‌నిచేస్తున్న ప‌రిశ్ర‌మలోనే ప‌ని సంపాయించాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇటీవ‌ల‌ తమ సోదరి అస్వస్థతకు గురికావడంతో సోద‌రులు ఇద్ద‌రూ ఆమెను స‌మీపంలోని ఓ ఆస్పత్రిలో చూపించారు. అయితే ఆమె అప్ప‌టికే గ‌ర్భ‌వ‌తి అని డాక్ట‌ర్లు వెల్ల‌డించ‌డంతో సోద‌రులు నిర్ఘాంత పోయారు. ఆమె నుంచి నిదానంతా విష‌యం అడిగి తెలుసుకున్నారు.

త‌మ సోద‌రి గ‌ర్భం ధ‌రించ‌డానికి బిరాంచి మాంజీనే కార‌ణ‌మ‌ని తెలుసుకుని ఒక్కసారిగా హ‌తాశుల‌య్యారు. ఎలాగైనా అత‌నికి బుద్ధి చెప్పాల‌ని భావించిన సోద‌రులు.. అత‌నితో క‌లుపుగోలుగా న‌టిస్తూ.. శుక్ర‌వారం `మందు తాగుదాం..ఎంజాయ్ చేద్దాం రా` అని బిరాంచిని ఆహ్వానించారు. వీరిని న‌మ్మిన బిరాంచి వారిని ఫాలో అయిపోయాడు. ఈ క్ర‌మంలో సోద‌రులు ఇద్ద‌రూ బిరాంచిని ఎలక్ర్టానిక్‌ సిటీ నైస్‌ టోల్‌ గేట్‌ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఒక్క‌సారిగా అత‌నిపై క‌ల‌బ‌డి వారితో తెచ్చుకున్న క‌త్తితో అతడిని అక్కడే చంపి... తలను వేరు చేశారు. పురుషాంగాన్నీ కోశారు. అనంత‌రం నేరుగా వెళ్లి పోలీసుల‌కు లొంగిపోయారు. ఈ ఘ‌ట‌న స్థానికంగానే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం సృష్టించింది.