Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్‌లో రెండు టిక్కెట్ల కోసం అన్న‌ద‌మ్ముల డిమాండ్‌..!

By:  Tupaki Desk   |   30 Nov 2021 4:30 AM GMT
టీ కాంగ్రెస్‌లో రెండు టిక్కెట్ల కోసం అన్న‌ద‌మ్ముల డిమాండ్‌..!
X
నాలుగు ద‌శాబ్దాల పాటు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉండి ప‌లు ఉన్న‌త ప‌ద‌వులు నిర్వ‌హించిన జానారెడ్డి ప్ర‌స్తుతం సైలెంట్‌గా ఉంటున్నారు. త‌న కుమారుల‌ను బ‌రిలో నిలిపి పొలిటిక‌ల్‌గా విశ్రాంతి తీసుకోవాల‌ని భావిస్తున్నారు. హుజూర్‌న‌గ‌ర్‌లోనే జానాకు పోటీ చేసే అవ‌కాశం వ‌చ్చింది. అధిష్ఠానం నుంచి వ‌చ్చిన ఆ ప్ర‌తిపాద‌న‌ను జానారెడ్డి సున్నితంగా తిర‌స్క‌రించారు. ఈ ఉప ఎన్నిక‌లో గెలిచి సీఎం అయ్యేది ఏమైనా ఉందా? అని అప్పుడు అభిప్రాయ‌ప‌డ్డారు. త‌న దృష్టి అంతా త‌న కుమారుల రాజ‌కీయ‌ ఎదుగుద‌ల‌పైనే పెట్టిన‌ట్లు తెలిపారు. త‌న వ‌య‌సు రీత్యా కూడా విశ్రాంతి తీసుకోవాల‌ని భావించారు. కానీ నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో పోటీ చేయ‌కత‌ప్ప‌లేదు.

రంగంలోకి త‌న‌యులు:

నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌లోనే జానారెడ్డి త‌న కుమారుల‌ను రంగంలోకి దించాల‌ని చూశారు. త‌న ఇద్ద‌రు త‌న‌యుల్లో ఒక‌రైన ర‌ఘువీర్‌ను ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని భావించారు. ర‌ఘువీర్‌కు త‌న స‌న్నిహితుడైన అప్ప‌టి టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అండ‌దండ‌లు కూడా ఉన్నాయి. అయితే హైక‌మాండ్ మ‌రోలా ఆలోచించింది. గెలుపే ల‌క్ష్యంగా జానారెడ్డినే బ‌రిలోకి దింపింది. జానా కుమారులు త‌న తండ్రి త‌ర‌పున విస్తృతంగా ప్ర‌చారం కూడా నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌లో కాంగ్రెస్ ఓడిపోయినా గ‌ణ‌నీయమైన ఓట్ల‌నే సాధించింది.

సాగ‌ర్‌, మిర్యాల‌గూడ‌పై క‌న్ను:

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లో పోటీకి జానారెడ్డి ఇద్ద‌రు కుమారులు ఉవ్విళ్లూరుతున్నార‌ట‌. సాగ‌ర్‌లో జైవీర్‌, మిర్యాల‌గూడ‌లో ర‌ఘువీర్ త‌మ ప‌ర్య‌ట‌న‌లు ముమ్మ‌రం చేశారు. టికెట్ త‌మ‌కే వ‌చ్చేలా కింది స్థాయి నుంచి కేడ‌ర్‌ను క‌లుపుకునిపోతున్నారు. తండ్రి ఆశీస్సుల‌తో క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ కార్య‌క‌ర్త‌ల్లో మ‌నోధైర్యాన్ని నింపుతున్నారు.

ఒకే ఇంట్లో రెండు టిక్కెట్లు వ‌స్తాయా?

జానారెడ్డి వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లో పోటీ చేసే అవ‌కాశం ఉంటుందో లేదోన‌నే చ‌ర్చ పార్టీ శ్రేణుల్లో జ‌రుగుతోంది. ఒక‌వేళ ఆయ‌న పోటీచేయ‌క‌పోతే త‌న ఇద్ద‌రు కుమారుల‌కు టికెట్లు ఇప్పించుకుంటారా? కుటుంబంలో ఒక‌టే టికెట్ ఇస్తే ఆయ‌న ఎటువంటి అడుగులు వేస్తార‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది? త‌న కంచుకోట సాగ‌ర్ నుంచి ఒక‌రికి టికెట్ ఇప్పించుకోవ‌డానికి ఎటువంటి ఆటంకాలు లేక‌పోయినా, మిర్యాల‌గూడ నుంచి మ‌రొక‌రికి టికెట్ అంత సులువుగా వ‌స్తుందా అనే చ‌ర్చ పార్టీ శ్రేణుల్లో జ‌రుగుతోంది.

రేవంత్ అండ దొరికేనా..?

త‌న కుమారులిద్ద‌రికీ టికెట్లు ఇప్పించుకునేందుకు జానారెడ్డి తీవ్రంగా కృషి చేస్తాడ‌నంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కుటుంబంలో ఒక‌రికే టికెట్ అనే ఫార్ములా పెడితే ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో వేచిచూడాలి. త‌న కుటుంబానికి స‌న్నిహితంగా ఉండే పీసీసీ చీఫ్ రేవంత్ అండ జానాకు ఉంటుందా? త‌న‌కు పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి రావ‌డానికి కృషి చేసిన జానా కుటుంబానికి రెండు టికెట్లు కేటాయించి రుణం తీర్చుకుంటాడా లేదా అనేది వేచిచూడాలి.

క్యాస్ట్ ఈక్వేష‌న్ కుదిరేనా..?

నాగార్జున‌సాగ‌ర్‌, మిర్యాల‌గూడ రెండూ జ‌న‌ర‌ల్ స్థానాలు. బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌కే టికెట్ ఇవ్వాల‌నుకుంటే జానా కుమారుల‌కు పెద్ద‌గా ఆటంకం కూడా ఏమీ ఉండ‌దు. అలాకాకుండా పార్టీ అధిష్ఠానం రాష్ట్ర వ్యాప్తంగా ఈక్వేష‌న్ తీసుకుంటేనే స‌మ‌స్య ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. 2018లో కూడా బీసీ అభ్య‌ర్థి అయిన ఆర్‌.కృష్ణ‌య్య‌ను బ‌రిలో నిల‌పాల్సి వ‌చ్చింది. ఈసారి ఎలాంటి ప‌రిస్థితి ఉంటుందోన‌న్న ఆందోళ‌న కూడా జానా అనుచ‌రుల్లో నెల‌కొంది. ఏదిఏమైనా వీట‌న్నింటితో సంబంధం లేకుండా జానా కుమారులు మాత్రం త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తూ బిజీగా ఉన్నారు.