Begin typing your search above and press return to search.

అన్న గెలిపిస్తుంటే.. త‌మ్ముడు లొల్లి పెడుతున్నాడు!

By:  Tupaki Desk   |   1 Jan 2022 2:28 AM GMT
అన్న గెలిపిస్తుంటే.. త‌మ్ముడు లొల్లి పెడుతున్నాడు!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వైసీపీ రాజ‌కీయాల్లో సీఎం జ‌గ‌న్ త‌ర్వాత అత్యంత శ‌క్తిమంత‌మైన నేత‌గా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఎదిగారు. త‌న వ్యూహాల‌తో టీడీపీకి చెక్ పెడుతూ అన్ని ఎన్నిక‌ల్లోనూ వైసీపీని గెలిపిస్తున్నారు. ఎక్క‌డ ఏ ఎన్నిక‌లు జ‌రిగినా అందుకు సంబంధించి పూర్తి ప్ర‌ణాళిక‌లు పెద్దిరెడ్డే సిద్ధం చేస్తున్నార‌ని టాక్‌. వ్యూహ ర‌చ‌న‌ల ద‌గ్గ‌ర నుంచి ఖ‌ర్చుల బాధ్య‌త‌ల వ‌ర‌కూ అన్నీ ఆయ‌నే చూసుకుంటున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో జ‌రిగిన పంచాయ‌తీ, ప‌రిష‌త్‌, మున్సిపాలిటీ ఎన్నిక‌ల‌తో పాటు బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లోనూ పార్టీ అఖండ విజ‌యం సాధించ‌డానికి పెద్దిరెడ్డే కార‌ణం. ఓ వైపు ఆయ‌న ఇలా సాగుతుంటే.. మ‌రోవైపు ఆయ‌న త‌మ్ముడు ద్వార‌క‌నాధ రెడ్డిపై మాత్రం సొంత పార్టీ నేత‌లే అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రస్తుతం తంబ‌ళ్ల‌ప‌ల్లె ఎమ్మెల్యేగా ఉన్న ద్వార‌క‌నాధ రెడ్డి వైసీపీ పార్టీ నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను వేధిస్తున్నార‌ని సొంత పార్టీ నేత‌లే ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. తంబ‌ళ్ల‌ప‌ల్లె జెడ్పీటీసీ స‌భ్యురాలు గీత భర్త కొండ్రెడ్డి ఈ ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. సొంత పార్టీ నాయ‌కుల మీదే ద్వార‌క‌నాధ రెడ్డి కేసులు పెట్టిస్తున్నార‌ని, మహిళా నాయ‌కుల‌ను వేధిస్తున్నార‌ని ఆయ‌న తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్ర రాజ‌కీయాల్లో మంత్రి రామ‌చంద్రారెడ్డి నంబ‌ర్ టూ పొజిష‌న్‌లో ఉన్నారు. చిత్తురూ జిల్లా రాజ‌కీయాల్లో ఆయ‌న మాట‌కు తిరుగులేదు.

రామ‌చంద్రారెడ్డి మంత్రిగా ఉండ‌గా.. ఆయ‌న కొడుకు మిధున్ రెడ్డి ఎంపీగా కొన‌సాగుతున్నారు. త‌మ్ముడు ద్వార‌క‌నాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ప‌ని చేస్తున్నారు. ఇలాంటి రాజ‌కీయ నేప‌థ్యంలో ఉన్న కుటుంబంలో ద్వార‌క‌నాధ రెడ్డిపై ఇప్పుడు సొంత పార్టీ నుంచే వ్య‌తిరేక‌త రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నియోజ‌క‌వ‌ర్గంలో ఆందోళ‌న‌లు చేయ‌బోతున్న‌ట్లు వైసీపీ నేత‌లు తిరుప‌తిలో ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెప్ప‌డం విశేషం. ఒక‌వేళ అదే జ‌రిగితే పార్టీ ప‌రువు పోతుంది. మ‌రి బ‌య‌ట విష‌యాలు చ‌క్క‌దిద్ది పార్టీని గెలిపించే పెద్దిరెడ్డి.. ఇప్పుడు త‌మ్ముడి విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రిస్తారోన‌న్న ఆస‌క్తి పెరిగింది.