Begin typing your search above and press return to search.

బీయారెస్ దెబ్బా మజాకా...ఏపీలో ఫుల్ ఎఫెక్ట్ ?

By:  Tupaki Desk   |   6 Jan 2023 3:30 PM GMT
బీయారెస్ దెబ్బా మజాకా...ఏపీలో ఫుల్ ఎఫెక్ట్ ?
X
బీయారెస్ అంటే భారత రాష్ట్ర సమితి. భారతీయ జనతా పార్టీ మాదిరిగానే దేశమంతా తామే ఉండాలంటూ కేసీయార్ పట్టు బట్టి జాతీయ రాజకీయాల్లోకి వస్తున్న నేపధ్యం. జాతీయ పార్టీగా బీయారెస్ ఇన్నింగ్స్ ఏపీ నుంచే స్టార్ట్ అవుతాయని గులాబీ బాస్ గట్టిగా భావిస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఏపీ నుంచి ఏపీతో అన్ని విధాలుగా కేసీయార్ కి టచ్ ఉంది.

అలాగే భౌగోళిక స్వరూపంతో పాటు సామాజిక నేపధ్యాలు రాజకీయ పరిస్థితుల మీద మంచి అవగాహన ఉంది. ఇంతటి అవగాహన కర్నాటక, మహారాష్ట్రాలలో బీయారెస్ విషయంలో కేసీయార్ కి ఉండకపోవచ్చు. అందుకే ఆశలన్నీ ఏపీ మీదనే పెట్టి మరీ ఆయన ఫుల్ ఫోకస్ పెట్టేశారు. ఏపీలో బీయారెస్ పార్టీ వస్తూనే సామాజిక సమీకరణల మీదనే దెబ్బ కొడుతోంది.

ఏపీలో కాపులు వచ్చే ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు అని తలచిన కేసీయార్ తన ఏపీ కొత్త అధ్యక్షుడిగా అదే సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ని నియమించారు. రానున్న రోజులలలో మరింత మంది కాపు నాయకులను బీయారెస్ వైపుగా రప్పించాలని కేసీయార్ చూస్తున్నట్లుగా టాక్. కేసీయార్ రాజకీయ వ్యూహాలు సెపరేట్ గా ఉంటాయి. అలాగే ఆయన అంగబలం అర్ధబలం వైసీపీ టీడీపీకి ధీటుగా ఉంటుంది.

దాంతో ఏపీలో కేసీయార్ రాజకీయ దూకుడు ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది అన్నదే చర్చగా ఉంది. ఏపీలో కాపులు టీడీపీకి జనసేనకు సపోర్ట్ చేస్తారు అన్న లెక్కలేవో ఉన్నాయి. దాంతో కోరి మరీ ఆ సామాజికవర్గాన్ని కేసీయార్ టర్గెట్ చేశారు అని అంటున్నారు. ఇక కాపుల విషయం చూస్తే పవన్ కళ్యాణ్ మీద కూడా పూర్తిగా ఆ వర్గంలో గురి కుదరలేదు అంటున్నారు. దాని కంటే ముందు ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి రంగంలోకి వచ్చినా కాపులు పూర్తి స్థాయిలో మద్దతు అయితే ఇవ్వలేదు అని ఫలితాలు చెప్పాయి.

అలాంటిది బీయారెస్ కాపుల మీద వల వేస్తే వారు మాట వింటారా ఈ వైపుగా వస్తారా అన్నదే చర్చగా ఉంది. మరో వైపు చూస్తే కాపుల మద్దతు కోసం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. మధ్యలో వచ్చిన బీయారెస్ టీడీపీ ఓట్లకు గండి కొడుతుందా అన్న సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కాపుల విషయంలో తీసుకుంటే సీనియర్ నాయకులు మాజీ మంత్రులు అంతా పెద్ద ఎత్తున టీడీపీలో ఉన్నారు.

వారిని కేసీయార్ ఆకట్టుకుంటే కనుక బీయారెస్ దెబ్బ టీడీపీ మీద కూడా గట్టిగానే పడుతుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో బీజేపీ కూడ కాపు కార్డు తీస్తోంది. సోము వీర్రాజు ఆ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అలా కేసీయార్ పార్టీ సెగ బీజేపీకి కూడా తగలవచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే కేసీయార్ బీయారెస్ ఏపీలో ఎంట్రీ ఇస్తే 2014 నాటి పొత్తులు మళ్లీ రిపీట్ అయినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.

అయితే ఏపీలో బీయారెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరుతో అధికార వైసీపీ వ్యతిరేక ఓట్లలో భారీ చీలిక రావడం ఖాయమని అంటున్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ కి కానీ పొత్తులతో ఈసారి గట్టెక్కాలని చూస్తున్న చంద్రబాబుకు కానీ బీయారెస్ అనూహ్య రంగ ప్రవేశం మాత్రం మింగుడుపడని వ్యవహారంగానే ఉంది అంటున్నారు. మరి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీలో బీయారెస్ మీద విరుచుకుపడే పార్టీలుగా టీడీపీ జనసేన ముందు వరసలో ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.