Begin typing your search above and press return to search.

ఖ‌మ్మం ఖిల్లాలో గులాబీ రెప‌రెప‌లు.. 500 కోట్ల‌తో క‌నీ వినీ ఎరుగ‌ని ఏర్పాట్లు

By:  Tupaki Desk   |   18 Jan 2023 2:30 AM GMT
ఖ‌మ్మం ఖిల్లాలో గులాబీ రెప‌రెప‌లు.. 500 కోట్ల‌తో క‌నీ వినీ ఎరుగ‌ని ఏర్పాట్లు
X
జాతీయ‌స్థాయిలో స‌త్తా చాటాల‌ని నిర్ణ‌యించుకున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. భార‌త రాష్ట్ర స‌మితి(బీఆర్ ఎస్‌)తొలి స‌భ‌ను ఖ‌మ్మం కేంద్రంగా ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. బుధ‌వారం జ‌ర‌గ‌నున్న ఈ స‌భ‌కు సంబంధించి క‌నీ వినీ ఎరుగ‌ని ఏర్పాట్లు చేశారు. నిజానికి గ‌తంలో టీఆర్ ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన‌ప్పుడు కూడా ఈ రేంజ్‌లో ఏర్పాట్లు చేయ‌లేదని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

ఏర్పాట్ల విష‌యానికి వ‌స్తే.. ఖమ్మం నూతన కలెక్టరేట్ వెనుక నిర్వహిస్తున్న ఈ సభ కోసం 100 ఎకరాల స్థ‌లాన్ని సిద్ధం చేశారు. సభా వేదికను ఆధునిక హంగులతో ముస్తాబు చేశారు. జర్మన్ టెక్నాలజీతో వాటర్, ఫైర్ ఫ్రూఫ్‌తో వేదికను రూపొందించారు. మొత్తం 200 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. 448 ఎకరాల్లో 20 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు.

బహిరంగ సభలో 50 ఎల్ఈడీ తెరలు, 100 మొబైల్ టాయ్‌లెట్స్‌ ఏర్పాటు చేశారు. 8 లక్షల మజ్జిగ సహా.. నీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. వెయ్యి మంది వ‌లంటీర్లు సభలోని గ్యాలరీల్లో విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స‌భ‌కు ఢిల్లీ , పంజాబ్‌, కేర‌ళ ముఖ్య‌మంత్రులు స‌హా వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు కూడా పోటెత్త‌నున్నారు. ఇప్ప‌టికే వారు బ‌య‌లు దేరారు కూడా!

వీరితోపాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, క‌ర్ణాటక మాజీ సీఎం కుమార‌స్వామి స‌హా పలువురు జాతీయ నాయకులు వ‌స్తున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలను తనవైపు తిప్పుకునేలా కేసీఆర్ అత్యంత పగడ్బందీగా బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.

బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమై జాతీయ రాజకీయాలపై వీరంతా చర్చిస్తారు. అక్కడే అల్పాహారం చేశాక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు హెలికాప్టర్లలో యాదాద్రి వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ఖమ్మం బయలుదేరుతారు. మొత్తంగా బీఆర్ ఎస్ పార్టీ తొలి భేటీకి 500 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని స‌మాచారం. గ‌త ఏడాది జ‌రిగిన టీఆర్ ఎస్‌(అప్ప‌టికి పేరు మార్చ‌లేదు) ప్లీన‌రీకి 200 కోట్లు ఖ‌ర్చు చేసిన విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.