Begin typing your search above and press return to search.

ఏపీ బీయారెస్ : గెల్చుడా...చీల్చుడా...?

By:  Tupaki Desk   |   2 Jan 2023 12:25 PM GMT
ఏపీ బీయారెస్ : గెల్చుడా...చీల్చుడా...?
X
ఏ రాజకీయ పార్టీ అయినా గెలిచేందుకే పెడతారు. కానీ జనాల అంచనా అవి అందుకోకపోయినా లేక మరో విధంగా వాటి ఫోకస్ పడినా అవి చీల్చుడు పార్టీలుగా మారతాయి. అపుడు అవి చేసే నష్టం ఎవరికి అన్న చర్చ అయితే ఉంటుంది. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పార్టీ గెలిచే పార్టీగా ప్రచారం చేసుకుని బరిలోకి దిగింది. కానీ చివరికి ఆ పార్టీ పుణ్యమాని ప్రతి పక్ష కాంగ్రెస్ కి భారీ నష్టాన్ని మిగిల్చింది.

అలాగే చూస్తే 2009లో ఉమ్మడి ఏపీలో గెలిచే పార్టీగా ధీమా కలిగించి సంక్రాంతి పందెం కోడిగా బరిలోకి దిగిన ప్రజారాజ్యం పార్టీ భారీగా ఓట్ల చీలికకు కారణం కావడంతో అధికారంలోకి రావాల్సిన తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బ తింది. ఇక ఇపుడు చూస్తే బీయారెస్ ఏపీలో తన పార్టీని విస్తరించాలనుకుంటోంది. ఆ పార్టీ కీలకమైన నేతలను బీయారెస్ లో చేర్చుకుంటోంది.

దాంతో పాటు విపక్షాల అమ్ముల పొదిలో ఉన్న కొన్ని అంశాలను బీయారెస్ కూడా తన నెత్తిన ఎత్తుకోబోతోంది. అందులో మొదటిది అమరావతి రాజధాని అంశం అంటున్నారు. అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలని బీయారెస్ లో చేరుతున్న నేత మాజీ మంత్రి రావుల కిశోర్ బాబు చెప్పుకొచ్చారు. ఇక ఏపీలో మూడు రాజధానులు అని వైసీపీ మాత్రమే అంటోంది. తెలుగుదేశం జనసేన సహా అన్ని పార్టీలు అమరావతి ఇష్యూనే ముందు పెట్టుకుని పోరాడుతున్నాయి.

ఇపుడు బీయారెస్ కూడా అందులో చేరితే గుంటూరు క్రిష్ణా జిల్లాల ఓట్లలో చీలిక కచ్చితంగా వస్తుంది. అదే విధంగా చూస్తే కాపుల ఓట్లను విపక్షాలు టార్గెట్ చేశాయి. ఇపుడు బీయారెస్ కూడా కాపు నేతలనే ఏరి కోరి తన వైపు తీసుకుంటోంది. దాంతో కాపుల ఓట్లలో కూడా అతి పెద్ద చీలిక తెచ్చేందుకు బీయరెస్ చూస్తోందని అర్ధమవుతోంది.

మరో వైపు చూస్తే కోస్తాలో 101 సీట్లు ఉన్నాయి. వీటి మీదనే తెలుగుదేశం కానీ జనసేన కానీ ప్రత్యేక దృష్టి పెట్టాయి. 2014లో కూడా తెలుగుదేశానికి ఇక్కడే ఎక్కువ సీట్లు వచ్చాయి. దాంతో మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేఅయాలని చూస్తున్నాయి. అయితే బీయారెస్ చూపు కూడా ఈ సెగ్మెంట్ మీదనే ఉంది. దాంతో బీయారెస్ పోటీగా వస్తే ఓట్ల చీలిక తప్పనిసరిగా ఉంటుంది అన్న భయం అయితే విపక్ష శిబిరంలో ఉంది అంటున్నారు.

మరో వైపు కేసీయార్ గుంటూరు, విజయవాడలలో ఏదో ఒక చోట భారీ మీటింగ్ పెట్టడం ద్వారా ఏపీలో బీయారెస్ యాక్టివిటీని స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. అలాగే ఉత్తరాంధ్రాను ఫోకస్ చేస్తూ ఆయన విశాఖపట్నంలో మీటింగ్ పెట్టనున్నారు అని అంటున్నారు. దంతో తెలుగుదేశానికి పట్టున్న చోటనే కేసీయార్ కూడా తన ఓట్ల వాటా కోసం ఫైటింగ్ కి దిగితే అపుడు విపక్షం నుంచే అతి పెద్ద చీలిక ఉండే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే అధికార పక్షానికి కూడా బీయారెస్ ఏ సెక్షన్ల ఓట్లు చీలుస్తుంది అన్న ఆందోళన లేకపోలేదు. ఉత్తరాంధ్రలో అయితే వైసీపీకి కూడా బీయారెస్ దెబ్బ పడడం ఖాయమనే అంటున్నరు. మొత్తానికి చూసుకుంటే బీయారెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది అన్నది ఈ రోజు వరకూ ఎవరికీ ఏ రకమైన అంచనాలు లేకపోయినా ఓట్లు మాత్రం చీల్చే పార్టీగా ఉండబోతోంది అన్న దాని మీద క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణా అంటి సంపన్న రాష్ట్రానికి సీఎం గా రెండు దఫాలుగా కేసీయార్ ఉన్నారు. ఆయన పార్టీ కూడా నిధులు విరాళాలతో కళకళలాడుతోంది.

పైగా జాతీయ స్థాయిలో తన పార్టీని నిలబెట్టాలన్న ఆలోచంతో ఆయన పట్టుదలగా పనిచేస్తారు. వ్యూహాలకు లోటు ఉండదు, అంగబలం అర్ధబలం విషయంలో ఏపీలోని ప్రధాన పార్టీలకు ఆయన తీసిపోరు. దాంతో బీయరెస్ కనుక ఏపీలో రంగంలో ఉంటే పోటీ గట్టిగానే ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి చూడాలి ముందు ముందు కేసీయార్ మార్క్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.