Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ బీజేపీలనే క్షమించలేదు...బీయారెస్ సంగతేంటి...?

By:  Tupaki Desk   |   8 Oct 2022 7:33 AM GMT
కాంగ్రెస్ బీజేపీలనే క్షమించలేదు...బీయారెస్ సంగతేంటి...?
X
ఏపీ జనాలు విభజన మీద ఈ రోజుకీ చాలా కోపంగా ఉన్నారు. నిండు కుండ లాంటి ఏపీని రెండు ముక్కలు చేశారన్న బాధ వారిది. దానికి కారణాలు కూడా సహేతుకంగా లేవు అని నమ్మేవారే ఈ రోజుకీ మెజారిటీగా ఉన్నారు. ఇక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా పార్లమెంట్ లో తలుపులు మూసి టీవీలను బంద్ చేసి మెజారిటీ ఏదీ లేకుండానే విభజన బిల్లు పాస్ చేశారని కూడా జనాలు విశ్వసిస్తున్నారు. దాంతో పాటు అడ్డగోలుగా ఏపీని ముక్కలు చేశారని, ప్రత్యేక హోదా హామీని నోటి మాటగా ఇచ్చారు తప్ప విభజన చట్టంలో పెట్టలేదని కూడా ఆరోపిస్తున్నారు.

ఇక విభజన చేసినా హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయమని ఏపీ జనాలు కోరినా చేయలేదు అన్న బాధ ఉంది. ఇలా అనేకానేక కారణాలతో కాంగ్రెస్ తన స్వార్ధ రాజకీయాలనే చూసుకుని విభజన చేసి పారేసింది అన్నది సగటు ఆంధ్రుల మనో వేదన. తెలంగాణాలో అధికారం కోసం కాంగ్రెస్ విభజన చేస్తే బీజేపీ కూడా వంత పాడింది అన్నది పక్కాగా ఆంధ్రులు నమ్మే మరో సత్యం.

అయితే ఆంధ్రులు తమ కోపాన్ని ఇప్పటికీ చల్లార్చుకోలేదు సరికదా వీలు దొరికినపుడల్లా తీర్చుకుంటూనే ఉన్నారు. అడ్డగోలు విభజన చేసిందనే కాంగ్రెస్ ని రెండు ఎన్నికల్లో ఓడించి పారేసారు. బీజేపీని అయితే 2014లో ఎంతో కొంత నమ్మారు. కానీ విభజన హామీలు ఏవీ నెరవేర్చకపోవడంతో ఆ పార్టీని 2019 ఎన్నికల్లో నోటా కంటే వెనకాతల ఉంచేశారు. 2024 ఎన్నికల్లో కూడా ఇదే రకమైన తీర్పు ఇవ్వడానికి జనాలు రెడీగా ఉన్నారు.

ఇపుడు విభజనకు మూల సూత్రధారి అయిన టీయారెస్ బీయారెస్ గా మారి ఏపీలో ఎంట్రీ ఇవ్వబోతోంది. మరి విభజన చేసిన పాపానికి, మద్దతు ఇచ్చిన నేరానికి కాంగ్రెస్ బీజేపీలకు పాతరేసిన ఏపీ జనాలు అసలు విభజనకే మూల సూత్రధారి, విభజన కోసం ఉద్యమాలు చేసి సాధించుకోవడమే కాకుండా ఏపీ జనాలను నానా మాటలు అన్న బీయారెస్ ని ఏ మాత్రం విడిచిపెడతారా అన్నదే చర్చ. బీయారెస్ ఏపీలో పోటీ చేసినా కూడా కాంగ్రెస్ బీజేపీలకు దక్కిన మర్యాదే ఆ పార్టీకి దక్కుతుందని చెబుతున్నారు.

పైగా తాము ఇంతకాలం ఒక ఉప ప్రాంతీయ పార్టీగా ఉండిపోయిన కారణం చేత టీయారెస్ ని ఏ విధంగానూ ఏమీ చేయలేకపోయామని, ఇపుడు బీయారెస్ గా మారి తానే ఏపీ జనాలకు అవకాశం ఇస్తే ఊరుకోమని అనే వారే ఎక్కువ మంది ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా ఎక్కడైనా బీయారెస్ పొలిటికల్ గేమ్ సాగుతుందేమో కానీ ఏపీలో అయితే అసలు సాగదని అంటున్నారు.

కనీసం ఒక ఎన్నికలో అయినా ఏపీ జనాల కోపాన్నిబీయారెస్ ఎదుర్కొంటే ఆ తరువాత మిగిలిన పార్టీలతో పాటుగా పోటీ చేసేందుకు వీలుంటుందేమో అని అంటున్నారు. ఇక బీజేపీ నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి లాంటి వారు అయితే ఆంధ్రులను నానా మాటలు అన్న కేసీయార్ క్షమాపణలు చెప్పిన తరువాతనే ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కేసీయార్ క్షమాపణలు చెబితే ఏపీ జనాలు ఓకే అంటారా.

విభజన గాయాలు నిలువెల్లా దహిస్తున్నా కూడా జై కొడతారా అంటే ఏమో రాజకీయ తెర మీదనే మిగిలిన కధను చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో పార్టీని విస్తరించి ఇక్కడ మీటింగులు పెట్టాలనుకొవడం కేసీయార్ చేస్తున్న సాహసం అని అంటున్నారు. అయితే పక్కా రాజకీయ వ్యూహకర్త అయిన కేసీయార్ బీజేపీ మీద ఏపీ జనాల కోపాన్ని మళ్ళించి విభజన పాపాల భైరవుడు బీజేపీయే తప్ప తన తప్పు ఏమీ లేదని చెప్పుకుంటారా. చూడాలి మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.