Begin typing your search above and press return to search.

ఖమ్మంలో బీఆర్ఎస్ సభ : ఏపీ నుంచి ప్రజలు వస్తారా? ఆంధ్రులు ఆదరిస్తారా?

By:  Tupaki Desk   |   18 Jan 2023 8:37 AM GMT
ఖమ్మంలో బీఆర్ఎస్ సభ : ఏపీ నుంచి ప్రజలు వస్తారా? ఆంధ్రులు ఆదరిస్తారా?
X
టీఆర్ఎస్ భారతీయ రాష్ట్రసమితి(బీఆర్ఎస్) గా మారిన తరువాత మొదటిసారిగా ఖమ్మంలో జనవరి 18న సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ ద్వారా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఇందులో భాగంగా 5 లక్షల మంది అటెండ్ అయ్యేలా ఇప్పటికే వ్యూహం రచించారు. నలుగురు మంత్రులను రంగంలోకి దించి ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించారు. ఈ సభకు దేశంలోని కేసీఆర్ తో పాటు మరో ముగ్గురు సీఎంలు, ఇతర జాతీయ నాయకులు హాజరు కానున్నారు. అయితే ఏపీ బార్డర్లో ఉన్న ఖమ్మంలో సభను నిర్వహించడానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ జిల్లాలో సభను నిర్వహిస్తే అటు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయొచ్చని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం సభకు ఆంధ్రా నుంచి ప్రజలను 150 బస్సుల ద్వారా రప్పిస్తున్నారు. మరి కేసీఆర్ సభను ఆంధ్రులు ఆదరిస్తారా..?

100 ఎకరాల్లో నిర్వహిస్తోన్న ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీఆర్ఎస్ గా మారిన తరువాత నిర్వహించే తొలిసభ ఇది. అందుకే దీనికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం భగవత్ మాన్ జాతీయ నాయకులు వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేసీఆర్ ఇప్పటికే ఇతర రాష్ట్రాల మద్దతు కూడగడుతున్నారు. వీరిలో మొదటి నుంచి కేజ్రీవాల్, భగవత్ మాన్ తెలంగాణ సీఎంకు మద్దతు ఇస్తున్నారు. అయితే కేరళ సీఎం విజయ్ పినరయి కూడా బీఆర్ఎస్ కు సపోర్టుగా రావడం విశేషం.

ఖమ్మం సభకు తెలంగాణ నుంచి 5 లక్షల మంది హాజరయ్యేలా స్కెచ్ వేశారు. ఈ బాధ్యతలను నలుగురు. మంత్రులకు అప్పగించారు. హరీశ్ రావు, ఖమ్మం మంత్రి పువ్వాడ నాగేశ్వర్ రావు ఇప్పటికే ఖమ్మం జిల్లా నాయకులతో సమావేశమయ్యారు.

తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస గౌడ్ లు ఏపీ నుంచి ప్రజలను రప్పించే పనిలో ఉన్నారు. మొత్తంగా బీఆర్ఎస్ నిర్వహించే తొలి సభ సక్సెస్ కావడానికి కలిసికట్టుగా పనిచేస్తున్నారు. వీరే కాకుండా తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోకి ముఖ్యులు సైతం బీఆర్ఎస్ సభకు హాజరు కానున్నారు. అయితే బీఆర్ఎస్ లో నెంబర్ 2 గా ఉన్న కేటీఆర్ లేకపోవడం గమనార్హం.

ఇక ఈ సభకు ఏపీ నుంచి ప్రజలను రప్పిస్తున్నారు. ఇందుకోసం 150 బస్సులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ ఆంధ్రా కమిటీ వేసి అక్కడి కార్యకలాపాలను మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఖమ్మంలో నిర్వహించే సభకు ఏపీ ప్రజలను కూడా రప్పిస్తే వారు ఆదరిస్తున్నారని దేశ వ్యాప్తంగా చాటి చెప్పనున్నారు. ఆ బాధ్యతలను ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ , తెలంగాణ మంత్రులతో పాటు స్థానిక కమిటీ నాయకులు బాధ్యత వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సభ నిర్వహిస్తున్నందున ఏపీ ప్రజలను తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదని యోచిస్తున్నారు.

అయితే గతంలో తెలంగాణ ఉద్యమం ద్వారా ఆంధ్రా నాయకులపై ఉద్యమం నిర్వహించిన కేసీఆర్ ను ఇప్పుడు ఏపీ ప్రజలు ఆదరిస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ పాత విషయాలు మరిచి బీఆర్ఎస్ కోసం వస్తే జాతీయస్థాయిలో రాణించడం పెద్ద విషయం కాదని అనుకుంటున్నారు. కానీ చాలా మంది తెలంగాణ ఉద్యమం ద్వారా తీవ్రంగా నష్టపోయారు. అవన్నీ ఎలా మరిచిపోతాం అనుకుంటే మాత్రం బీఆర్ఎస్ కు కష్టమే అవుతోంది. అయితే ఖమ్మం సభ ద్వారా ఆంధ్రులకు కేసీఆర్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు.. దీన్ని ఆంధ్రులు ఆదరిస్తారా? అనేది అసలు విషయం బయటపడుతుందని అనుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.