Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ లో ఇంకా పాత వాసనలు పోలేదే..

By:  Tupaki Desk   |   11 Jan 2023 6:01 AM GMT
బీఆర్ఎస్ లో ఇంకా పాత వాసనలు పోలేదే..
X
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కమిటీ ఏర్పడి కార్యకలాపాలు కూడా ప్రారంభం అయ్యాయి. త్వరలో ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించేందుకు కేసీఆర్ వ్యూహం రచిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నారు. అయితే బీఆర్ఎస్ పురుడు పోసుకున్న తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన విషయం చాలామందికి తెలియదట. కనీసం పార్టీలోని నేతలు కూడా ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారట.

ఇప్పటికీ నువ్వే పార్టీలో ఉన్నావంటే..? టీఆర్ఎస్ అని చెబుతున్నారు. ఇవి కేవలం విమర్శలు కావు. పీపుల్స్ పల్స్ అనే నిర్వహించి సర్వేలో వెల్లడైన విషయం. ఓ వైపు బీఆర్ఎస్ అధినేత పార్టీని విస్తృతంగా ప్రచారం కల్పిస్తుంటే పార్టీలోని నాయకులు కనీసం పేరును కూడా పూర్తిగా పలకపోవడం గమనార్హం. అయితే ఎంతమందికి బీఆర్ఎస్ పార్టీ గురించి తెలుసు..? వారేమనుకుంటున్నారు..? చూద్దాం.

పీపుల్స్ పల్స్ అనే సంస్థ ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు సర్వే నిర్వహించింది. లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభ, మండల్లలోని కొన్ని ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకుంది. మొత్తం 17 జిల్లాలు, 51 మండలాల్లో సర్వే చేసింది. 1625 మందిని శాంపిల్ గా తీసుకుంది. అందరినీ ఫోన్లో సంప్రదించి పార్టీ గురించి అడిగారు. ఇందులో బీఆర్ఎస్ నాయకులు కూడా ఉండడం గమనార్హం. ఇందులో బీఆర్ఎస్ పై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుంది.

ఈ సందర్భంగా తేలిన విషయమేంటంటే.. బీఆర్ఎస్ ను ఇప్పటికీ టీఆర్ఎస్ అని పలుకుతున్న వారు 72 శాతం మంది, ముందుగా టీఆర్ఎస్ అని ఆ తరువాత సవరించుకొని బీఆర్ఎస్ అని చెప్పిన వారు 21 శాతం మంది, మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పిన వారు 4 శాతం మంది ఉన్నారు. ఇక అసలు పార్టీ పేరు చెప్పడానికి ఇస్టపడని వారు 3 శాతం ఉన్నట్లు సర్వలో తేలింది. దీంతో బీఆర్ఎస్ ప్రజలతో పాటు నాయకుల్లో ఏమేరకు విస్తరించిందో అర్థమైంది.

తెలంగాణలో తాజాగా మారుతున్న రాజకీయాల నేపథ్యంలో పీపుల్స్ సంస్థ ఈ సర్వేను చేప్టటింది. అయితే నాయకులు బీఆర్ఎస్ ను ప్రజల్లోకి ఏ మేరకు తీసుకెళ్లారో ఈ సర్వేను చూస్తే అర్థమవుతోంది. పార్టీలోని కొందరు నాయకులు ఇప్పటికీ స్పష్టంగా బీఆర్ఎస్ అని పలకకుండా టీఆర్ఎస్ పేరు చెప్పడం చూస్తే వారికి ఇంకా పాత వాసనలు పోలేదని తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లోనూ తడబడి టీఆర్ఎస్ అని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ ను ఎవరూ గుర్తించే అవకాశం లేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కేసీఆర్ మినహా ఇతర ముఖ్య నాయకులెవరూ శ్రద్ధ చూపడం లేదన్నది స్పష్టం అవుతోంది.

దేశంలో గుణాత్మక మార్పులు తీసుకొస్తామని చెబుతున్న కేసీఆర్ సొంత రాష్ట్రంలోనే పార్టీ పేరు తెలియని వారు చాలా మంది ఉండడంపై రకరకాలుగా చర్చ సాగుతోంది. మరోవైపు పార్టీ శ్రేణులు కొత్త పేరు పలకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరు బీఆర్ఎస్ అని ప్రస్తావిస్తారా..? లేక టీఆర్ఎస్ అని పార్టీ చెప్పి తడబడకుండా ప్రచారం చేస్తారా..? అనేది కీలకంగా మారనుంది. ఇప్పటికే పార్టీలోని కొందరు ముఖ్యులు బీఆర్ఎస్ మారడం పై అసంతృప్తితోనే ఉన్నారు. ప్రజల్లోకి తెలంగాణ వాదాన్ని ఎలా తీసుకెళ్లాలని మదనపడుతున్నారు. అందుకనే బీఆర్ఎస్ పేరు చెప్పడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.