Begin typing your search above and press return to search.

ప్రాంతీయ పార్టీలకు విరాళాల్లో టాప్‌ లో బీఆర్‌ఎస్, వైసీపీ!

By:  Tupaki Desk   |   25 April 2023 11:00 AM GMT
ప్రాంతీయ పార్టీలకు విరాళాల్లో టాప్‌ లో బీఆర్‌ఎస్, వైసీపీ!
X
రాజకీయ పార్టీలకు వివిధ సంస్థలు, వ్యక్తులు ఇచ్చే పార్టీ విరాళాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ దేశంలోనే టాప్‌ లో నిలిచాయి.

దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల్లో ఐదు రాజకీయ పార్టీలు మాత్రమే విరాళాల్లో అత్యధిక వాటా దక్కించుకున్నాయని ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది.

2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను 26 ప్రాంతీయ పార్టీలకు మొత్తం రూ.189.80 కోట్ల నిధులు విరాళాల కింద వచ్చాయని ఏడీఆర్‌ తెలిపింది. ఈ మొత్తంలో ఐదు పార్టీలకే రూ.162.21 కోట్లు (85 శాతం) విరాళాలు అందాయని వెల్లడించింది.

ఈ ఐదు పార్టీల్లో .. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైసీపీ)లకు రూ.162.21 కోట్లు (85 శాతానికిపైగా) అందాయని ఏడీఆర్‌ తెలిపింది.

ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పార్టీకి 2021–22లో 14 విరాళాల ద్వారా రూ.40.90 కోట్లు లభించాయి. రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఉంది. ఆప్‌ 2,619 విరాళాల ద్వారా రూ.38.24 కోట్లు అందుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో రూ.33.26 కోట్లతో జేడీయూ, రూ.29.80 కోట్లతో ఎస్పీ నాలుగో స్థానంలో, రూ.20 కోట్లతో వైసీపీ అయిదో స్థానంలో నిలిచాయి.

ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలను వెల్లడిస్తున్నట్టు ఏడీఆర్‌ పేర్కొంది. విరాళాల రూపంలో రూ.20వేలకు పైన, అంతకన్నా తక్కువ మొత్తాల్లో అందిన వివరాలను 26 ప్రాంతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశాయి.

కాగా 2021–22 సంవత్సరానికి అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే), బిజూ జనతాదళ్‌ (బీజేడీ), ఎన్‌డీపీపీ, ఎస్‌డీఎఫ్, ఏఐఎఫ్‌బీ, పీఎంకే, జేకేఎన్‌సీ పార్టీలు తమ విరాళాల వివరాలను వెల్లడించలేదని ఏడీఆర్‌ వివరించింది.