Begin typing your search above and press return to search.

లవ్ చేసి పెళ్లాడినందుకు హైదరాబాద్ నడి రోడ్డు మీదే దారుణంగా చంపేశారు

By:  Tupaki Desk   |   5 May 2022 3:59 AM GMT
లవ్ చేసి పెళ్లాడినందుకు హైదరాబాద్ నడి రోడ్డు మీదే దారుణంగా చంపేశారు
X
ప్రేమల్ని కాదన్నారు. ప్రేమే తమకు జీవితం అనుకున్నారు. అయితే.. తమ ప్రేమ తమ ప్రాణాలకు ముప్పుగా వాటిల్లుతుందన్న భయాందోళనకు గురయ్యారు. పెళ్లి చేసుకొని.. తమ ఊరికి దూరంగా ఉంటున్నప్పటికి.. వెంటాడి మరీ అబ్బాయిని అమ్మాయి తరఫు వారు దారుణంగా హత్య చేసిన వైనం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ నడి రోడ్డు మీదన జరిగిన ఈ దారుణ హత్యా కాండ సంచలనమైంది. బుధవారం రాత్రి తొమ్మిది గంటల వేళలో.. దంపతులు బైక్ మీద వెళుతున్న వేళ.. అమ్మాయి సోదరి అతనికి సంబంధించిన వారు వెంటాడి మరీ.. తమ చెల్లిని పెళ్లాడిన వ్యక్తిని అందరూ చూస్తుండగానే దారుణంగా చంపేశారు.

అసలేమైందంటే..రంగారెడ్డి జిల్లాలోని మర్పల్లికి చెందిన నాగరాజు.. ఈ ఊరికి దగ్గర్లోని ఘనాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ ఆశ్రిన్ సుల్తానాలు ఇద్దరూ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి మతాలు వేరు కావటంతో అమ్మాయి తరఫు వారు అబ్బాయిని హెచ్చరించారు.

అయితే.. వీటిని పట్టించుకోకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడాలని నిర్ణయించుకున్న నాగరాజు.. ఈ జనవరిలో ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి తరఫు వారితో ప్రాణహాని ఉందన్న ఆలోచనతో ఊరికి దూరంగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ కార్ల కంపెనీలో సేల్స్ మెన్ గా చేరాడు.

పెళ్లి చేసుకొన్న తర్వాత ఎవరికి తెలీకుండా గుట్టుగా కాపురం పెట్టేశారు కొత్త దంపతులు. తొలుత రెండు నెలలు విశాఖపట్నంలో ఉన్న వారు.. ఇటీవల హైదరాబాద్ కు షిప్టు అయ్యారు. ఐదురోజుల క్రితమే నగరానికి వచ్చిన వీరు.. సరూర్ నగర్ లోని పంజా అనిల్ కుమార్ కాలనీలో నివసిస్తున్నారు. వీరి కదలికల్ని గుర్తించిన అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు.. బుధవారం రాత్రి నాగరాజును చంపేందుకు ప్లాన్ చేశారు. స్నేహితులతో కలిసి బైక్ మీద వెళుతున్న నాగరాజు.. ఆశ్రిన్ ను వెంటాడారు.

తమపై దాడి చేసేందుకు వెంబడిస్తున్న వారిని గుర్తించిన నాగరాజు తప్పించుకునే ప్రయత్నం చేశారు అయితే.. మలుపు వద్ద బైక్ స్కిడ్ కావటంతో దంపతులు ఇద్దరు కింద పడిపోయారు. ఆ వెంటనే.. తమతో తెచ్చుకున్న గడ్డపారతో నాగరాజుపై దాడికి పాల్పడ్డారు.

గడ్డపారతో తలపై బలంగా మోదటంతో అక్కడికక్కడే నాగరాజు చనిపోయాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త కళ్ల ముందు చనిపోయిన వైనంతో ఆశ్రిన్షాక్ కు గురైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.