Begin typing your search above and press return to search.

సెన్సెక్స్ ఉచకోత.. 10 అప్ డేట్స్

By:  Tupaki Desk   |   25 Aug 2015 4:35 AM GMT
సెన్సెక్స్ ఉచకోత.. 10 అప్ డేట్స్
X
ఒక్కరోజులో భారీగా పతనమైన సెన్సెక్స్ దేశ చరిత్రలో మూడో అతి పెద్ద పతనం సోమవారం చోటు చేసుకుంది. ఒక్కసారిగా రూ7 లక్షల కోట్ల మదుపరుల సొమ్ము ఆవిరైంది. దీంతో.. లక్షలాది మంది మదుపరుల సొమ్ము ఆవిరై.. చేతిలోని షేర్లు చిత్తు కాగితాల్లా మారిపోయాయి. గంటకు లక్ష కోట్ల రూపాయిల చొప్పున నష్టపోయిన సూచీ కారణంగా చోటు చేసుకున్న పది పరిణామాలు చూస్తే..

1. చైనా తన కరెన్సీ విలువ తగ్గించుకోవటం.. చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందన్న సందేహాలు.. భయాలు కొంతకాలంగా వెంటాడుతున్నా.. సోమవారం ఆ భయాలన్నీ కలిసి చైనా మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బ తీయటంతో.. మిగిలిన దేశాలూ ఆ ప్రభావానికి గురయ్యేలా చేయటంతో మహా పతనం ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంది. 2007 తర్వాత చైనా సూచీ భారీగా నష్టపోయింది సోమవారం నాడే. మొత్తం తన విలువలో షాంగై సూచి 8.46 శాతం క్షీణిస్తే.. కాంపోనెంట్ సూచి 7.83 శాతం కుంగిపోయింది.

2. భారీ భూకంపం చోటు చేసుకున్న తర్వాత.. కొద్ది రోజుల వరకూ భూ ప్రకంపనలు వస్తుంటాయి. భూమి లోపలి పొరల్లో సర్దుబాటుకోసం ఇదంతా జరుగుతుంది. అది సైన్స్ అయితే.. మార్కెట్ భారీగా పతనం అయ్యాక.. ఆ ప్రభావం మార్కెట్ల మీద ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు ఇది నిరూపితం అయ్యింది కూడా. తాజాగా డ్రాగన్ (చైనా) ధాటికి ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ ‘బేర్’మంటున్న వేళ.. మరికొద్ది రోజులు ఈ పతనం కొనసాగుతుందని చెబుతున్నారు. కాకుంటే.. ఎంతమేర నష్టం ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్న..?

3. సెన్సెక్స్ భారీ పతనంలో ముడిచమురు ధరలు కనిష్ఠ స్థాయికి చేరుకోవటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. పారిశ్రామికవృద్ధికి సూచికగా ఉండే ముడిచమురు డిమాండ్ అంతకంతకూ తగ్గిపోవటం.. అమెరికాలో భారీ నిల్వలు బయటపడ్డాయన్న వార్తలతో నిన్న మొన్నటివరకూ బ్యారెల్ ముడి చమురు 40 నుంచి 45 డాలర్ల మధ్యనుండగా.. సోమవారం 39 డాలర్ల దిగువనకు పడిపోవటం.. మార్కెట్ సెంటిమెంట్ ను మరింత కుంగదీసింది.

4. సెన్సెక్స్ భారీ కుదుపునకు డ్రాగన్ ఒక కారణం అయితే.. రూపాయి విలువ అంతకంతకూ తగ్గిపోవటం కూడా ఒక కారణం చెబుతున్నారు. ఆర్ బీఐ గవర్నర్ చెబుతున్నట్లుగా దేశంలో తగినంత విదేశీ మారకం ఉందని.. ఆర్థికంగా బలంగా ఉందని చెబుతున్నా.. రూపాయి క్షీణించటం మాత్రం ఆగటం లేదు. సోమవారం సంగతే తీసుకుంటే.. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.65కు పడిపోయింది. ఒక్కరోజులో భారీగా క్షీణించిన దాన్లో ఈ సోమవారం కూడా ఒకటుంది. ఈ నేపథ్యంలో రూపాయి బలోపేతం కావటం సెన్సెక్స్ పతనాన్ని నిలువరిస్తుందని చెబుతున్నారు. రూపాయి బలపడి.. స్థిరంగా ఉంటే.. సెంటిమెంట్ బలపడటం ఖాయమంటున్నారు.

5. సోమవారం రూపాయి విలువ రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. స్టాక్ మార్కెట్లు పాతాళానికి పడిపోవటానికి ఇదో కారణం కూడా. దిగుమతిదారులు.. ప్రభుత్వ బ్యాంకుల నుంచి డాలరుకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోవటంతో మరింత నష్టం చేకూరేలా చేసింది. సోమవారం ఒక్కరోజులోనే 82 పైసలు నష్టపోయింది. చైనా యువాన్ మారకం విలువ తగ్గించిన తర్వాత గత రెండు వారాల్లో డాలరుతో రూపాయి మారకం విలువ 202పైసలు (రూ.2.02) క్షీణించటం గమనార్హం.

6. గత నెలలో భారీగా పతనమైన బంగారం ధర.. గత కొద్ది రోజులుగా పుంజుకుంటోంది. గత 14 రోజులుగా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. సోమవారం కూడా అది కంటిన్యూ అయ్యింది. దేశీయంగా డిమాండ్ పెరగటం.. స్టాక్ మార్కెట్ కుప్పకూలటంతో బంగారం మీదకు పెట్టుబడులు మళ్లించే వారి సంఖ్య పెరిగింది. దీంతో.. బంగారం ధర కళకళలాడిపోతోంది. సోమవారం పది గ్రాముల బంగారానికి రూ.150మేర పెరిగింది. గడిచిన 13 రోజుల్లో పది గ్రాముల బంగారం ధర రూ.2,445 పెరగటం గమనార్హం.

7. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టొచ్చా? అన్నది ఒక ప్రశ్న. మహా పతనం అయిన సమయంలో పెట్టుబడులుపెడితే లాభాలు గడించొచ్చన్న వాదన ఒకటుంది. అయితే.. ఇదంత సరైనది కాదని.. పతనం మరికొంత కాలం కొనసాగుతుందని.. అందుకే.. పతనం ఆగి.. కుదుటుపడిన తర్వాత పెట్టుబడులు పెట్టటం మంచిదన్న సూచన నిపుణులు చేస్తున్నారు.

8. అంతా మీరే చేశారు నాన్న అన్న సినిమా డైలాగు చందంగా.. భారత్ లో చోటు చేసుకున్న సెన్సెక్స్ మహా పతనంపై ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ.. ఇదంతా అంతర్జాతీయ మార్కెట్లే చేశాయని.. ఈ మహాపతనంలో భారత్ పాత్ర ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని చెప్పుకొచ్చారు.

9. మార్కెట్ మహాపతనం కారణంగా భారత్ లోని షేర్ల విలువ రూ.7లక్షల కోట్ల మేర ఆవిరి అయ్యాయయన్న విషయం తెలిసిందే. మరి..ఈ భారీ మొత్తంలో సామాన్యుల వాటా ఎంత ఉంటుంది? వారు వాస్తవంగా ఎంత మేర నష్టపోయారన్న విషయానికి వస్తే.. ఒక అంచనా ప్రకారం ఈ విలువ రూ.75వేల కోట్ల మేర ఉంటుందని అంచనా. మహా పతనంతో.. మరింత తగ్గే అవకాశం ఉందన్న భయంతో షేర్లను తెగనమ్ముకొని.. వచ్చిన కాడికి అన్నట్లుగా వ్యవహరించే వారు సోమవారం ఒక్కరోజు పోగొట్టుకొన్నది రూ.75వేల కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అలా కాకుండా.. షేర్ల ధర పతనమైనా.. ఫర్లేదని ధీమాగా ఉండేవారికి ముఖ విలువ తగ్గినా.. భవిష్యత్తు మీద ఆశతో ఉంటారు కాబట్టి.. వారికి నేరుగా నష్టం వాటిల్లిందని లెక్క వేయలేని పరిస్థితి.

10. సోమవారం ఒక్కరోజు చోటు చేసుకున్న మహా పతనంతో సెన్సెక్స్ 1624 పాయింట్లు పడిపోయి 25,741పాయింట్ల వద్ద స్థిరపడింది. 2014 ఆగస్టు పతనం తర్వాత ఇంత భారీగా తగ్గిపోవటం ఇదే మొదటిసారి. మార్కెట్ సెంటిమెంట్ నేపథ్యంలో.. ఈ పతనం 24 వేల కిందకు దిగినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇదెంత వరకూ నిజమన్నది మంగళవారం మార్కెట్ కొంత మేర స్పష్టత ఇచ్చే వీలుందని చెబుతున్నారు.