Begin typing your search above and press return to search.

నిజం చెప్పిన సైనికుడి ఉద్యోగం పోయింది

By:  Tupaki Desk   |   19 April 2017 1:35 PM GMT
నిజం చెప్పిన సైనికుడి ఉద్యోగం పోయింది
X
క్ర‌మ‌శిక్ష‌ణ ముఖ్య‌? నిజం ముఖ్య‌మా? వ‌్య‌వ‌స్థ‌లోని లోపాల్ని ఎత్తి చూపించ‌టానికి నిబంధ‌న‌ల్ని తూచా త‌ప్ప‌కుండా పాటించాల్సిందేనా? ఒక‌వేళ పాటిస్తే వాటి వ‌ల్ల ఎలాంటి ఫ‌లితం లేక‌పోతే ఏం చేయాలి? త‌ప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. నిజాన్ని చెబుతూ.. వ్య‌వ‌స్థ‌లోని మార్పు కోసం ప్ర‌య‌త్నించేందుకు సాహ‌సించిన ఒక జ‌వానుకు భారీ బ‌హుమ‌తి ల‌భించింది.

వాస్త‌వానికి నిజం చెబితే అంద‌రూ అభినందిస్తారు. కానీ..స‌ద‌రు వీర జ‌వాను ఉద్యోగం మాత్రం పోయింది. ఇక్క‌డ‌.. వీర జ‌వాను మాట‌ను ఎందుకు ఉప‌యోగించాల్సి వచ్చిందంటే.. దారుణ‌మైన త‌ప్పులు జ‌రుగుతుంటే.. కుళ్లిపోయిన వ్య‌వ‌స్థ‌ను స‌రిదిద్దే సాహ‌సం చేస్తే ఎక్క‌డ ముప్పు వ‌చ్చి ప‌డుతుందోన‌న్న భ‌యంతో నోరు విప్ప‌ని వారున్న చోట‌.. అంద‌రికి భిన్నంగా.. ధైర్యంగా జ‌రుగుతున్న తప్పులు ఇవి అని చెప్పిన ఒక సైనికుడ్ని వీర సైనికుడిగా అభివ‌ర్ణించ‌టం త‌ప్పేం కాద‌నే చెప్పాలి.

ఇంత‌కీ.. ఆ వీర సైనికుడు ఎవ‌రో గుర్తుకు వ‌చ్చిందా?కొద్దిరోజుల క్రితం సైనికుల‌కు ఇస్తున్నఆహారం ఎంత దారుణంగా ఉంటుంద‌న్న విష‌యాన్ని లోకం మొత్తానికి తెలిసేలా చేసి.. ఏ మాత్రం నాణ్య‌త లేని భోజ‌నం అందిస్తే.. క‌ఠిన‌మైన విధుల్ని ఏ ర‌కంగా నిర్వ‌హిస్తారంటూ ప్ర‌శ్నించిన బీఎస్ఎఫ్ జ‌వాను తేజ్ బ‌హుదూర్ యాద‌వ్‌ను విధుల నుంచి త‌ప్పించారు. సైన్యంలోని లోటుపాట్ల‌ను వీడియో రూపంలో చిత్రీక‌రించి.. సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌టం ఇప్పుడు అత‌డి పాలిట శాపంగా మారింది.

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించినందుకు అత‌డిపై వేటు వేశారు. అంతేకాదు.. అత‌ను రూల్స్‌కు భిన్నంగా ఎన్నో ప‌నులు చేశార‌న్న ఆరోప‌ణ‌లు కూడా నిజ‌మ‌య్యాయ‌ని తేల్చేశారు. త‌న‌పై వేటు వేయ‌టాన్ని కోర్టులో తేల్చుకుంటాన‌ని తేజ్ బ‌హ‌దూర్ చెబుతున్నారు. నిజాలు బ‌య‌ట‌కు చెప్పాన‌నే కోపంతో త‌న‌పై ఇలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని.. త‌న‌కు న్యాయం జ‌రిగేవ‌ర‌కూ పోరాడ‌తాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. దుర‌దృష్ట‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తేజ్ ఉదంతం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు.. ఎవ‌రు స్పందించినా స్పందించ‌కున్నా ప్ర‌ధాని మోడీ మాత్రం స్పందించి.. ఈ వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు నిర్వ‌హించ‌టంతో పాటు.. కుళ్లిన వ్య‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తార‌ని ప‌లువురు భావించారు. కానీ.. అందుకు భిన్నంగా నిజాన్ని బ‌య‌ట పెట్టిన సైనికుడికి న‌జ‌రానాగా ఉద్యోగం నుంచి తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/