Begin typing your search above and press return to search.

స‌రిహ‌ద్దుల్లో ఉగ్రవాదులపై ఆర్మీ మెరుపు దాడి

By:  Tupaki Desk   |   27 Sep 2017 12:19 PM GMT
స‌రిహ‌ద్దుల్లో ఉగ్రవాదులపై ఆర్మీ మెరుపు దాడి
X
ఉగ్ర‌వాదుల విష‌యంలో భార‌త సైన్యం మ‌రోమారు త‌న స‌త్తా నిరూపించుకుంది. బుధవారం తెల్లవారుఝామున ఇండియన్ ఆర్మీ ఇండో - మయన్మార్ బోర్డర్‌ లో మెరుపు దాడులు చేసింది. నాగా తీవ్రవాదుల శిబిరాలపై ఉదయం 4-45 గంటల ప్రాంతంలో ఇండియన్ పారా కమాండోలు ఈ దాడులు జరిపారు. ఈ దాడుల్లో నాగా తీవ్రవాదుల శిబిరానికి భారీ నష్టం వాటిల్లినట్లు ఆర్మీ వెల్లడించింది. ఆర్మీ వైపు ఎలాంటి నష్టం జరగలేదని కూడా స్పష్టంచేసింది.

కాగా, గత ఏడాది ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడుల్లో నియంత్రణ రేఖ దాటి వెళ్లిన ఆర్మీ.. ఈసారి మాత్రం సరిహద్దు దాటలేదని ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ స్పష్టంచేసింది. ఈ దాడులను కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కూడా ధృవీకరించారు. ఇది మన పొరుగు దేశాలకు ఓ హెచ్చరికలాంటిదని ఆయన చెప్పారు. 2001లో భారత ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసింది నాగా ఉగ్రవాద సంస్థ. అయితే 2015, మార్చి 27న ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. నాగాలాండ్, మణిపూర్‌లలోని భారత జవాన్లపై దాడులు చేశారు. జూన్ 4 - 2015లో మణిపూర్‌ లోని డోగ్రా రెజిమెంట్‌ లో ఆర్మీ కాన్వాయ్‌ పై దాడి చేయగా 18 మంది సైనికులు మృత్యువాత పడ్డారు.

మ‌రోవైపు పాకిస్థాన్ రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌ను తిప్పికొట్టేందుకు భార‌త ఆర్మీ ఆపరేషన్ అర్జున్ పేరుతో చేప‌డుతున్న చ‌ర్య‌ల‌కు పాక్ దిమ్మ‌తిరిగిపోయింది. మ‌న సైనిక పోస్టులు స‌హా, ప్ర‌జ‌ల నివాసాల‌ను ల‌క్ష్యం చేసుకొని కాల్పుల‌కు పాల్ప‌డుతున్న నేప‌థ్యంలో పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల్లోని మాజీ సైనికుల‌కు ఆ ప్ర‌భుత్వం ఇచ్చిన స్థ‌లాలపై దాడులకు పాల్ప‌డింది. భారత్‌ కు వ్యతిరేకంగా జరిపే సైనిక కార్యకలాపాల్లో సహాయంగా ఉండేలా పాక్ ప్రోత్స‌హించిన ఈ మాజీ సైనికుల‌పై చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ఆయుధాల‌తో మ‌న ఆర్మీ చేసిన దాడి వ‌ల్ల ఆస్తినష్టంతో పాటు ఏడుగురు పాకిస్తాన్ సైనికులు, 11 మంది పౌరులు మృతిచెందార‌ని స‌మాచారం. అయితే ఈ ప‌రిణామంతో ఉలిక్కిప‌డ్డ పాక్ పంజాబ్ డీజీ వ‌చ్చి భార‌త బీఎస్ ఎఫ్ డైరెక్ట‌ర్‌ ను క‌లిసి కాల్పులు నిలిపివేయాల‌ని వేడుకున్నారు. గ‌తంలోనూ భారత సైన్యం ‘ఆపరేషన్ రుస్తాన్’ చేపట్టిన‌ప్పుడు త‌ట్టుకోలేక దాడులు నిలిపివేయాల‌ని ఇదే రీతిలో పాక్ ఆర్మీ వేడుకోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే పాకిస్తాన్ లెఫ్ట్‌ నెంట్ కల్నల్ ఇర్ఫాన్ రెచ్చ‌గొట్టే రీతిలో భార‌త్‌ పైకి కాల్పుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఈ చ‌ర్యకు స్పంద‌న‌గానే తాము ఈ చ‌ర్య‌కు దిగామ‌ని వెళ్ల‌డించారు. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల శిబిరాలు కొనసాగుతున్నాయని, పైగా పాక్ దాడుల‌కు సైతం పాల్ప‌డుతోంద‌ని దీనిపై త‌గు రీతిలో స్పందించేందుకు తాము ఈ దాడుల‌కు దిగాల్సి వ‌చ్చింద‌ని వెల్ల‌డించారు. భారత్‌ పై పాక్ కాల్పులను తిప్పికొట్టేందుకే ‘ఆపరేషన్ అర్జున్‌’ ప్రారంభించారు.